CSK vs SRH : సీఎస్కేపై గ్రాండ్ విక్టరీ- ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లోకి కాటేరమ్మ కొడుకులు..
IPL 2026 playoffs : చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఎస్‌ఆర్‌హెచ్ 5 వికెట్ల తేడాతో సీఎస్కేని ఓడించింది. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది.
CSK vs SRH 2026 : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ప్లేఆఫ్స్‌కి చేరింది. సోమవారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియంలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను హోమ్ గ్రౌండ్‌లోనే సన్‌రైజర్స్ చిత్తు చేసింది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తూ బ్యాటింగ్‌కు కష్టంగా మారినప్పటికీ.. డాషింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత హాఫ్ సెంచరీతో సన్‌రైజర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. 2016 ఐపీఎల్ ఛాంపియన్ అయిన హైదరాబాద్.. ఈ గెలుపుతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న రెండొవ జట్టుగా నిలిచింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
కమిన్స్ కెప్టెన్సీ మార్క్.. సీఎస్కే కట్టడి
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నైకి కెప్టెన్ సంజు శాంసన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 13 బంతుల్లోనే 27 పరుగులు చేసి పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న శాంసన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ క్లీన్ క్యాచ్‌తో అవుట్ చేసి చెన్నై వేగానికి బ్రేకులు వేశాడు. ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ పిచ్ మందగమనాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. కమిన్స్ వేసిన షార్ట్ బాల్‌కు గైక్వాడ్ పెవిలియన్ చేరాడు. ఉర్విల్ పటేల్ రెండు భారీ సిక్సర్లు బాదినా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.
ఆ తర్వాత కార్తీక్ శర్మ (19 బంతుల్లో 32) కాసేపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టినా, మళ్లీ కమిన్స్ అతడిని అవుట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ (27 బంతుల్లో 44) జట్టును ఆదుకున్నాడు. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై బౌన్సర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ శివమ్ దూబేతో కలిసి ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బ్రెవిస్ మెరుపుల వల్ల సీఎస్కే గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.
సన్‌రైజర్స్ బౌలర్లలో పాట్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు (3/28) పడగొట్టగా, షాబాజ్ హుస్సేన్ 2 వికెట్లు తీశాడు.
ఇషాన్ కిషన్ క్లాస్ ఇన్నింగ్స్- క్లాసెన్ మెరుపులు..
181 పరుగుల ట్రిక్కీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది! స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 5 బంతులు మాత్రమే ఆడి ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ (1 సిక్స్, 3 ఫోర్లు) కాసేపు ప్రయత్నించినా అకీల్ హొసేన్ చేతికి చిక్కాడు. దీనితో ఎస్‌ఆర్‌హెచ్ పవర్‌ప్లే ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది ఈ సీజన్‌లో వారికి అత్యంత నెమ్మదైన పవర్‌ప్లే స్కోరు!
స్కోరు 56/2 వద్ద క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్.. ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. క్లాసెన్ నూర్ అహ్మద్, అకీల్ హొసేన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు, ఫోర్లు బాది ఒత్తిడిని తగ్గించాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. 15వ ఓవర్లో క్లాసెన్ (47) ను సంజు శాంసన్ అద్భుత స్టంపింగ్‌తో అవుట్ చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ పూర్తి బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు. ముఖేష్ చౌదరి వేసిన 18వ ఓవర్లో ఇషాన్ ఒక ఫోర్, ఒక సిక్స్ బాది మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పాడు. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 70 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, అప్పటికే సన్‌రైజర్స్ విజయం ఖాయమైంది. చివరికి 19 ఓవర్లలోనే ఎస్‌ఆర్‌హెచ్ లక్ష్యాన్ని చేధించింది.
ఇషాన్ కిషన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా ఈ ఓటమితో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. తదుపరి మ్యాచ్‌లో భారీగా గెలవడంతో పాటు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఈ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది.
సీఎస్కే వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ బోర్డు..
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే): 20 ఓవర్లలో 180/7 (డెవాల్డ్ బ్రెవిస్ 44, కార్తీక్ శర్మ 32; పాట్ కమిన్స్ 3/28, షాబాజ్ హుస్సేన్ 2/34).
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్): 19 ఓవర్లలో 181/5 (ఇషాన్ కిషన్ 70, హెన్రిచ్ క్లాసెన్ 47; ముఖేష్ చౌదరి 2/36).
ఫలితం: చెన్నైపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


