Uppal IPL Match SRH vs RCB : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్ - ఫేక్ యాప్స్‌తో జాగ్రత్త..! హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరికలు

Fake IPL Ticket Apps : హైదరాబాద్‌లో ఈనెల 22న జరగనున్న ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ టికెట్ల కోసం సైబర్ కేటుగాళ్లు నకిలీ యాప్‌లు, లింకులతో వల విసిరే పనిలో పడ్డారు. టికెట్లు బుక్ చేసుకునే ముందు క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Published on: May 16, 2026, 12:45:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Fake IPL Ticket Apps : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 22న జరగనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్‌కు నగరంలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ క్రికెటర్ల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. అయితే…… టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న ఈ విపరీతమైన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని సొమ్ముచేసుకోవడానికి సైబర్‌ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల దోపిడీకి తెరలేపారు.

ఫేక్ టికెట్లు - పోలీసుల హెచ్చరికలు
ఫేక్ టికెట్లు - పోలీసుల హెచ్చరికలు

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ఆకర్షణీయమైన ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ అధికారిక టికెటింగ్‌ భాగస్వామి అయిన 'డిస్ట్రిక్ట్‌' (District) యాప్‌ను పోలిన రంగులు, లోగోలతోనే ఈ నకిలీ యాప్‌లను, వెబ్‌సైట్లను సృష్టించడం గమనార్హం. అసలు యాప్‌కు, నకిలీ దానికి తేడా తెలియకుండా భ్రమింపజేస్తూ.. చాలా తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలతో ఊరిస్తున్నారు.

అచ్చం అసలు యాప్‌ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయమని హైదరాబాద్ నగర పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా.. మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్‌లు కూడా సైబర్ నేరగాళ్ల పరమయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. దీనివల్ల మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

మ్యాచ్‌ చూడాలనే ఉత్సాహంలో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దని నగర సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఫేక్ యాప్ లు, వెబ్ సైట్ల కదలికలపై నిఘా ఉంచినట్లు స్పష్టం చేశారు. ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల గురించి సమాచారం గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. మీ కష్టార్జితాన్ని కేటుగాళ్ల పాలు చేయకుండా కేవలం అధికారిక యాప్ ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవాలని క్రికెట్ ప్రియులకు విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More