GT vs SRH : చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఎస్ఆర్హెచ్! ఐపీఎల్ 2026 టేబుల్ టాప్‌లో జీటీ..
Who won yesterday match : నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
IPL 2026 points table : ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 82 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 169 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. గుజరాత్ బౌలర్ల ధాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది!
వరుసగా ఐదో విజయాన్ని అందుకున్న శుభ్‌మన్ గిల్ సేన, పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
పేకమేడలా కూలిన సన్‌రైజర్స్ బ్యాటింగ్!
సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆది నుంచే చుక్కెదురైంది. గుజరాత్ పేసర్లు కాగిసో రబడా (3/28), జేసన్ హోల్డర్ (3/20) నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటర్లను వణికించారు. కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనితో 14.5 ఓవర్లలోనే 86 పరుగులకు హైదరాబాద్ ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
గతంలో 2019లో ముంబైపై చేసిన 96 పరుగులే ఇప్పటివరకు తక్కువ స్కోరుగా ఉండేది.
రాణించిన సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్ సాయి సుదర్శన్ (44 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ (33 బంతుల్లో 50) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్ రెండేసి వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.
ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో మార్పులివే..
ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు సాధించి టేబుల్ టాప్ పొజిషన్‌కు చేరింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు ఓటమి పాలైనప్పటికీ సన్‌రైజర్స్ 14 పాయింట్లతో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది.
కాగా బుధవారం రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే, మళ్లీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
రికార్డుల వేటలో టైటాన్స్!
వరుస విజయాలు: ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇది వరుసగా ఐదో విజయం. 2022లో కూడా ఆ జట్టు వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచింది.
హెడ్-టు-హెడ్: సన్‌రైజర్స్‌తో ఆడిన గత ఏడు మ్యాచ్‌ల్లో గుజరాత్‌కు ఇది ఆరో విజయం.
లోయెస్ట్ డిఫెండ్: ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (159 పరుగులు) తర్వాత అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా గుజరాత్ (168 పరుగులు) నిలిచింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


