తలవంచేది లేదు: ఐరాస ప్రసంగానికి 'బాహుబలి' వీడియో జోడించిన ఇరాన్

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలను ప్రతిబింబిస్తూ హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రభాస్ 'బాహుబలి' సినిమాలోని సమర సన్నివేశాన్ని జోడిస్తూ ఎక్స్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published on: Sep 28, 2026, 20:48:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా ఇరాన్ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపునకు, రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి'కి సంబంధం ఏమిటి? ఈ ఊహించని ప్రశ్నకు హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ వినూత్న సమాధానం ఇచ్చింది. తమ దేశ సార్వభౌమాధికారం, తిరుగులేని ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రభాస్ నటించిన 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాలోని క్లిప్‌ను వినియోగించుకుంది.

తలవంచేది లేదు: ఐరాస ప్రసంగానికి 'బాహుబలి' వీడియో జోడించిన ఇరాన్
తలవంచేది లేదు: ఐరాస ప్రసంగానికి 'బాహుబలి' వీడియో జోడించిన ఇరాన్

బాహుబలి క్లిప్‌తో ఇరాన్ సందేశం

ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యూఎన్‌జీఏ) ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ ప్రసంగించారు. "మేము ఎప్పటికీ తలవంచం.. మోకరిల్లం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ శక్తివంతమైన ప్రకటనను ఉటంకిస్తూ హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పంచుకుంది.

'బాహుబలి: ది బిగినింగ్' చిత్రంలో కాలకేయ సైన్యంతో అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) వీరోచితంగా పోరాడే సన్నివేశాన్ని ఈ వీడియో కోసం ఎంచుకున్నారు. ఎంతటి బలమైన శత్రువు ఎదురైనా వెనకడుగు వేయని బాహుబలి పాత్రను ఉదాహరణగా చూపుతూ.. "కాలకేయులపై పోరాడిన బాహుబలి తరహాలోనే, మాతృభూమి రక్షణ కోసం మేం కూడా రక్తం చిందించేందుకు సిద్ధం" అని కాన్సులేట్ వ్యాఖ్య జోడించింది.

అమెరికా హెచ్చరికలకు కౌంటర్

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పెజెష్కియాన్ ప్రసంగానికి ఒకరోజు ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఐరాసలో ప్రసంగిస్తూ ఇరాన్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన పెజెష్కియాన్.. ఆంక్షలు, బెదిరింపులు లేదా ఒత్తిళ్లకు ఇరాన్ లొంగబోదని, ఇటువంటి చర్యలు తమ ప్రజల సంకల్పాన్ని మరింత పటిష్టం చేస్తాయని తేల్చిచెప్పారు. దౌత్య చర్చలకు తమ దేశం సిద్ధంగా ఉన్నప్పటికీ, బలవంతపు చర్యలను ఎంతమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.

నెటిజన్లు ఏమంటున్నారంటే..

అంతర్జాతీయ రాజకీయాల్లోకి 'బాహుబలి' రావడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. "సోషల్ మీడియాను ఉపయోగించడంలో ఇరాన్ రూటే వేరు" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. "ఇరాన్ కాన్సులేట్ నుంచి బాహుబలి ఎడిట్స్ వస్తాయని అస్సలు ఊహించలేదు" అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. "ఇరాన్-అమెరికా వివాదం మధ్య భూగోళ రాజకీయాల్లోకి బాహుబలి ప్రవేశించడం ఆసక్తికరం" అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ప్రపంచ స్థాయి విజయం సాధించిన బాహుబలి

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 2015లో వచ్చిన 'బాహుబలి: ది బిగినింగ్' భారతీయ చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రభాస్, రాణా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2017లో వచ్చిన 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More