ఇంకొన్ని రోజుల్లో JEE Mains 2026 సెషన్​ 1- ఈ రివిజన్​ టిప్స్​తో మెరుగైన ఫలితాలు..

జేఈఈ మెయిన్స్ 2026 సెషన్​ 1 పరీక్షలో మెరుగైన స్కోర్ సాధించడానికి పక్కా రివిజన్ ప్లాన్ అవసరం. సిలబస్‌ను అర్థం చేసుకోవడం, తప్పులను విశ్లేషించడం, మాక్ టెస్ట్‌లు రాయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

Published on: Jan 18, 2026, 10:00:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంకొన్ని రోజుల్లో జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 ప్రారంభకానుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్​ కార్డులు సైతం ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అయితే, లక్షలాది మంది పోటీపడే ఈ పరీక్షలో విజయం సాధించాలంటే కేవలం సిలబస్ పూర్తి చేస్తే సరిపోదు! సబ్జెక్టుపై పట్టుతో పాటు ఒత్తిడిని తట్టుకుని నిలబడే నేర్పు కూడా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పరీక్షకు ముందు చేసే రివిజన్ మీ స్కోర్‌ను ఏ స్థాయిలో పెంచుతుందో నిర్ణయిస్తుందని అంటున్నారు.

జేఈఈ మెయిన్స్​ సెషన్​ 1 రివిజన్​ టిప్స్​..
జేఈఈ మెయిన్స్​ సెషన్​ 1 రివిజన్​ టిప్స్​..

మరి చివరి నిమిషంలో జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 రివిజన్​ ఎలా ఉండాలి? ఈ టిప్స్​ని తెలుసుకుని కచ్చితంగా ఫాలో అవ్వండి..

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1- రివిజన్​ టిప్స్​..

జేఈఈ మెయిన్స్ అంటేనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో ఉన్న లోతైన సూత్రాలను పరీక్షించే వేదిక. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి, పైగా నెగెటివ్ మార్కింగ్ భయం ఉంటుంది. అందుకే పరీక్ష కోసం రివిజన్ అనేది చివరి నిమిషంలో పుస్తకాలు తిరగేయడం లాగా కాకుండా, ఒక యుద్ధతంత్రంలా ఉండాలి.

1. పక్కా ప్రణాళిక -

రివిజన్ ప్రారంభించే ముందు మీకు అనుకూలమైన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోండి.

ప్రతిరోజూ మూడు సబ్జెక్టులకూ సమయం కేటాయించండి.

ప్రతి టాపిక్ నుంచి కనీసం 10-15 రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి.

థర్మోడైనమిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాలిక్యులస్ వంటి ఎక్కువ వెయిటేజీ ఉన్న పాఠాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.

నిరంతరంగా చదవకుండా మధ్యలో విరామం తీసుకోండి. 'పొమోడోరో' (25 నిమిషాల చదువు - 5 నిమిషాల విరామం) వంటి పద్ధతులు ఏకాగ్రతను పెంచుతాయి. ఇవి ప్రూవెన్​ టెక్నిక్స్​.

2. తప్పుల విశ్లేషణ-

మీరు చేసే తప్పులే మీకు ఉత్తమ పాఠాలు చెబుతాయి.

జేఈఈ మెయిన్స్​ పరీక్ష కోసం ఒక ప్రత్యేక నోట్‌బుక్ పెట్టుకుని, ప్రాక్టీస్ టెస్టుల్లో మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో రాయండి.

అది లెక్కల్లో పొరపాటా? సూత్రం మర్చిపోవడమా? లేదా ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకోవడమా? అనేది విశ్లేషించండి.

ప్రతి వారం ఈ నోట్స్ తిరగేయడం వల్ల అదే తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడవచ్చు. రివిజన్​ చివరి రోజుల్లో సైతం ఈ బుక్​ బాగా ఉపయోగపడుతుంది.

3. కాన్సెప్ట్ మ్యాపింగ్ అండ్​ షార్ట్ నోట్స్-

పెద్ద పెద్ద పాఠాలను గుర్తుంచుకోవడానికి 'విజువల్ మ్యాప్స్' వాడండి. ఒక పేజీ మధ్యలో మెయిన్ టాపిక్ రాసి, దాని నుంచి ఫార్ములాలు, థియరమ్స్​ని సెక్షన్లుగా విభజించి రాసుకోండి. ఇది పరీక్షకు ముందు త్వరగా రివిజన్ చేయడానికి పనికొస్తుంది.

4. పాత ప్రశ్నపత్రాలు - మాక్ టెస్టులు-

కనీసం గత 10 ఏళ్ల జేఈఈ మెయిన్స్ ప్రశ్నపత్రాలను సాధన చేయండి. "గడియారం పెట్టుకుని పరీక్ష వాతావరణంలో మాక్ టెస్టులు రాయడం వల్ల మీ వేగం, ఖచ్చితత్వం పెరుగుతాయి," అని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష తర్వాత మీ పనితీరును విశ్లేషించుకుని, బలహీనంగా ఉన్న అంశాలపై (ఉదాహరణకు ప్రాబబిలిటీ లేదా ఎలక్ట్రోమాగ్నెటిజం) ఎక్కువ దృష్టి పెట్టండి.

5. ఆరోగ్యం పట్ల జాగ్రత్త-

ఎంత చదివినా మీ మెదడు చురుగ్గా ఉండాలంటే సరైన నిద్ర, పౌష్టికాహారం తప్పనిసరి. ఒత్తిడికి లోనవ్వకుండా రోజుకు కనీసం 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఏవైనా సందేహాలు ఉంటే మీ టీచర్లు లేదా స్నేహితులతో చర్చించి నివృత్తి చేసుకోండి.

గుర్తుంచుకోండి.. జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1లో విజయం అనేది మీరు ఎంత చదివారన్న దానికంటే, చదివిన దాన్ని ఎంత సమర్థవంతంగా రివిజన్ చేశారన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More