...
...
Next Story

JEE Mains 2027 : జేఈఈ మెయిన్స్ సెషన్ 1 రిజిస్ట్రేషన్ ప్రారంభం- ఫీజు, అర్హత వివరాలు..

జేఈఈ మెయిన్స్ 2027 దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). నవంబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు సెషన్లలో జరిగే ఈ పరీక్ష తేదీలు, దరఖాస్తు రుసుము, తెలుగు భాషా వెసులుబాటు గురించిన పూర్తి వివరాలు ఇవే..

Published on: Oct 25, 2026, 10:45:58 IST
Advertisement

దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలైన ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో (సీఎఫ్​టీఐ) ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'జేఈఈ మెయిన్స్ 2027' సెషన్ 1 దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ మేరకు సమగ్ర షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1 అప్డేట్స్..
జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1 అప్డేట్స్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న వేలాది మంది ఇంజనీరింగ్ ఆశావాహులకు ఇది ఎంతో కీలకమైన ఘట్టం. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సౌకర్యార్థం ఈ పరీక్షను ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషలోనూ కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (సీబీటీ) ఎన్టీఏ నిర్వహించనుంది.

ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1 వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్-1 ముఖ్యమైన తేదీలు..

జేఈఈ మెయిన్స్ 2027 మొదటి సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 22, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ సాధారణ గడువులోగా దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు రూ. 500 ఆలస్య రుసుముతో నవంబర్ 23 నుంచి నవంబర్ 26 వరకు దరఖాస్తు దాఖలు చేసే అవకాశం కల్పించారు. దరఖాస్తులో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి నవంబర్ 27 నుంచి 29 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్-1 పరీక్షలను 2027 జనవరి 20, 21, 22, 23, 24, 28 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తారు. పరీక్ష రాసే నగరం వివరాలతో కూడిన 'సిటీ ఇంటిమేషన్ స్లిప్'ను డిసెంబర్ 30, 2026న విడుదల చేస్తారు. అలాగే పరీక్షా కేంద్రంలోకి అనుమతించే అడ్మిట్ కార్డెన్‌ (హాల్ టికెట్లను) 2027 జనవరి 13న పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు.

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1- దరఖాస్తు ఫీజు..

జనరల్ కేటగిరీ: బాలురు రూ. 1,000 | బాలికలు రూ. 800

జనరల్ -ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ-ఎన్​సీఎల్: బాలురు రూ. 900 | బాలికలు రూ. 800

ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ / పీడబ్లయూబీడీ: బాలురు రూ. 500 | బాలికలు రూ. 500

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్​ 1- అర్హతలు, కావాల్సిన పత్రాలు..

2025 లేదా 2026లో ఇంటర్మీడియట్ / 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు, లేదా 2027లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయడానికి ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు! ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పూర్తి చేసిన తర్వాత వరుసగా మూడేళ్ల పాటు జేఈఈ మెయిన్స్ రాసే వెసులుబాటు ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు కింది పత్రాలను డిజిటల్ రూపంలో సిద్ధంగా ఉంచుకోవాలి:

  • పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
  • డిజిటల్ సంతకం
  • 10వ తరగతి మార్కుల మెమో లేదా సర్టిఫికేట్
  • వికలాంగుల వైకల్య సర్టిఫికేట్ / యూడీఐడీ కార్డ్ (వర్తించే వారికి)
  • విదేశీ విద్యార్థులైతే సంబంధిత పాస్‌పోర్ట్ వివరాలు

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్-2 షెడ్యూల్ కూడా విడుదల..

మొదటి సెషన్‌తో పాటే సెషన్ 2 (ఏప్రిల్) షెడ్యూల్‌ను కూడా ఎన్టీఏ వెల్లడించింది. సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ 2027 జనవరి 5 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు ఆలస్య రుసుముతో అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు సవరణల విండో తెరుచుకుంటుంది.

సెషన్-2 పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్లిప్ మార్చి 12న, అడ్మిట్ కార్డులు మార్చి 25న విడుదల కానున్నాయి. 2027 ఏప్రిల్ 2, 3, 4, 5, 6, 7 తేదీల్లో సెషన్-2 పరీక్షలు జరగనున్నాయి.

ఇంటర్మీడియట్ అభ్యర్థులు చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా వీలైనంత త్వరగా జేఈఈ మెయిన్స్ 2027 సెషన్​ 1 దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks