Karnataka crime : నర్సును నరికి చంపిన ఉన్మాది.. బస్టాండ్‌లోనే దారుణ హత్య!
Bantwal Lavanya case : కర్ణాటకలోని బంట్వాల్ బీసీ రోడ్ కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌లో గురువారం సాయంత్రం ఒక ఘోర కలి జరిగింది. తనను ప్రేమించాలంటూ వేధిస్తున్న ఓ ఉన్మాది, 21 ఏళ్ల నర్సు లావణ్యను అందరూ చూస్తుండగానే కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు!
ప్రేమ పేరిట వేధిస్తున్న ఓ ఉన్మాది రెచ్చిపోయాడు! రద్దీగా ఉండే బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఓ యువతిపై కత్తితో విరుచుకుపడ్డాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె పరుగులు తీసినా వదలకుండా వెంటాడి, వేటాడి మెడపై నరికి దారుణంగా హత్య చేశాడు. గురువారం సాయంత్రం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ పరిధిలోని బీసీ రోడ్ కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటన సర్వత్రా కలకలం సృష్టిస్తోంది.

అసలేం జరిగింది?
మృతురాలిని దక్షిణ కన్నడ జిల్లా కాక్యాపడవు సమీపంలోని కొడంగే నివాసి లావణ్య (21)గా పోలీసులు గుర్తించారు. లావణ్య కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తోంది. గురువారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. బెల్తంగడికి చెందిన చేతన్ (22) అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతడు మృతురాలికి దూరపు బంధువు అని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. లావణ్య ఇంటికి వెళ్లడం కోసం బీసీ రోడ్ బస్టాండ్‌లో కాక్యాపడవు వెళ్లే కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఎక్కి కూర్చుంది. అప్పటికే అక్కడ కారులో ఉన్న చేతన్.. లావణ్య బస్సు ఎక్కడం చూసి ఆమె వెంటే బస్సులోకి వెళ్లాడు. తన బ్యాగులో తెచ్చుకున్న పెద్ద కత్తిని తీసి ఒక్కసారిగా ఆమెపై దాడికి యత్నించాడు.
కత్తిని చూసి భయపడిపోయిన లావణ్య ప్రాణభయంతో బస్సు దిగి బస్టాండ్‌లో పరుగులు తీసింది. అయినా వదల్లేని ఉన్మాది చేతన్, జనం చూస్తుండగానే ఆమెను వెంటాడి మెడ వెనుక భాగంలో కత్తితో బలంగా నరికాడు. తీవ్ర రక్తస్రావమై లావణ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
భయంతో పరుగులు తీసిన జనం.. వీడియో వైరల్!
బస్టాండ్‌లో ఊహించని ఈ ఘోరాన్ని చూసి ప్రయాణికులు భయాందోళనతో పరుగులు తీశారు. మరికొందరు స్థానికులు వెంటనే స్పందించి లావణ్యను బంట్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
దాడి చేసిన అనంతరం నిందితుడు చేతన్ ఆ కత్తిని అక్కడే పడేసి, తాను తెచ్చుకున్న కారులో పారిపోయాడు.
ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు బస్టాండ్‌లోని సీసీటీవీల్లో, అక్కడి వారి ఫోన్లలో రికార్డయ్యాయి. ఈ ఘోర హత్యకు సంబంధించిన వీడియో సాషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంట్వాల్ టౌన్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
యువతిపై ఉన్న విపరీతమైన వ్యామోహం, వేధింపుల వల్లే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, అయితే దీని వెనుక ఉన్న పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ అరుణ్ తెలిపారు.
నిందితుడు అరెస్ట్.. ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం!
ఈ దారుణ ఉదంతం జరిగిన కొన్ని గంటల్లోనే బంట్వాల్ టౌన్ పోలీసులు వేగంగా స్పందించారు. శుక్రవారం ఉదయం నిందితుడు చేతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నిందితుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


