Crime news : షార్జాలో ఘోరం! కర్ణాటక వ్యక్తి దారుణ హత్య- శరీర భాగాలు 9 ముక్కలు చేసి..
ఉడుపికి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఆల్విన్ ప్రకాశ్ కుందర్ షార్జాలో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి రెండు సంచుల్లో పెట్టి కారులో పడేసిన వైనం తీవ్ర కలకలం రేపుతోంది. హత్య జరిగినప్పటి నుంచి ఆయన భార్య, కుమారుడు కనిపించకుండాపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లోని షార్జాలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన ఆల్విన్ ప్రకాశ్ కుందర్ (44) అనే ఎన్‌ఆర్‌ఐ దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగులు ఆయన శరీరాన్ని తొమ్మిది భాగాలుగా నరికి, రెండు సంచుల్లో కుక్కి ఓ కారులో పడేసిన ఉదంతం గల్ఫ్ దేశాల్లోని భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఫోన్ మెసేజ్‌తో మొదలైన అనుమానం!
ఆల్విన్ ప్రకాశ్ గత 14 ఏళ్లుగా షార్జా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య టీనా షార్జాలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. జూలై 20న ఆల్విన్ సోదరుడు అనిల్ ప్రశాంతి ఆయనకు ఫోన్ చేయగా కాల్ లిఫ్ట్ చేయలేదు. అయితే, "నేను బాగున్నాను" అని ఒక మెసేజ్ వచ్చింది. సాధారణంగా ప్రకాశ్ ఎప్పుడూ అలా మెసేజ్ పెట్టకపోవడంతో అనిల్‌కు అనుమానం వచ్చింది. వారం తర్వాత మళ్లీ ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో షార్జాలో ఉన్న స్నేహితుడు మనోహర్‌ను విచారించాల్సిందిగా కోరారు.
పాస్‌పోర్ట్ రికార్డులతో వెలుగులోకి నిజం..
ప్రకాశ్ నివాసానికి వెళ్లిన మనోహర్‌కు వాచ్‌మన్ షాకింగ్ సమాచారం ఇచ్చాడు. ప్రకాశ్ కుటుంబంతో కలిసి ఇండియా వెళ్లిపోయాడని చెప్పాడు. ఆ తర్వాత ఆల్విన్ పనిచేసే కంపెనీ హెచ్‌ఆర్‌ను సంప్రదించగా వారు కూడా మొదట ఆల్విన్ ఇండియాకు వెళ్లారని చెప్పారు. కానీ ఇండియాకు ఆయన రాలేదని కుటుంబసభ్యులు స్పష్టం చేయడంతో కంపెనీ యాజమాన్యం పాస్‌పోర్ట్ రికార్డులను పరిశీలించింది. ప్రకాశ్ యుఏఈ దాటలేదని తేలడంతో వెంటనే షార్జా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒమన్ మార్గంలో మృతదేహం లభ్యం..
పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. ఒమన్ వైపు వెళ్లే రహదారిలో నిలిపి ఉంచిన ఒక కారులో ఆల్విన్ ప్రకాశ్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశ్ గుండెలో పొడిచి చంపిన దుండగులు, శరీరాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి రెండు సంచుల్లో ప్యాక్ చేసి కారులో పడేశారు.
సోమవారం పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత అనిల్ ఉడుపి ఎస్పీని కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మిస్టరీగా భార్య, పిల్లాడి ఆచూకీ..
ఈ దారుణ హత్య వెనుక ఉన్న హంతకులు ఎవరనేది ఇంకా తేలలేదు. ప్రకాశ్ నివసించిన ఫ్లాట్ సీసీటీవీ ఫుటేజ్‌లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ బయటకు వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.
"గుండెలో పొడిచి చంపి శరీరాన్ని తొమ్మిది ముక్కలు చేయడానికి బాగా అనుభవం ఉన్న నేరస్థులే కారణమై ఉంటారు," అని బాధితుడి సోదరుడు అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
"ఆయన భార్య ఇండియాకు వచ్చి ఉంటే ఈ హత్య గురించి ఆమెకు కచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే తప్ప పాస్‌పోర్ట్ వివరాలు బయటకు రావు," అని ఆయన పేర్కొన్నారు.
గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల భద్రతపై ఈ సంఘటన తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


