Passport rules : మైనర్ పాస్‌పోర్ట్ తీసుకుంటున్నారా? నిబంధనల్లో కీలక మార్పులు- ఏంటంటే..
పాస్‌పోర్ట్ చట్ట సవరణ నియమాలు-2026ను కేంద్ర విదేశాంగ శాఖ అమల్లోకి తెచ్చింది. 15 ఏళ్లలోపు పిల్లల పాస్‌పోర్ట్ చెల్లుబాటు గడువుపై స్పష్టతనిచ్చింది. ఇటీవలే పెరిగిన పాస్‌పోర్ట్ ధరలను లీగల్ చేసింది. కొత్త రేట్లు, సవరించిన నిబంధనల వివరాలు ఇక్కడ చూడండి..
విదేశీ ప్రయాణాలు చేసే వారికి, విదేశాల్లో స్థిరపడిన తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబాలు, ఉన్నత విద్య కోసం పిల్లలను విదేశాలకు పంపాలనుకునే తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. 'పాస్‌పోర్ట్ (సవరణ) నిబంధనలు-2026'ను కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికారికంగా నోటిఫై చేసింది. సెప్టెంబర్ 15న గెజిట్‌లో ప్రచురించిన వెంటనే ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.

చిన్నారుల పాస్‌పోర్ట్ చెల్లుబాటులో ప్రధాన మార్పు..
ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో మార్పు చేస్తూ, 15 ఏళ్లలోపు చిన్నారులకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌ల చెల్లుబాటు కాలంపై ప్రభుత్వం కొత్త స్పష్టత ఇచ్చింది. ఇకపై ఈ పాస్‌పోర్ట్ జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లు లేదా ఆ చిన్నారికి 18 ఏళ్లు నిండే వరకు.. వీటిలో ఏది ముందయితే అంతటి వరకే అది చెల్లుబాటు అవుతుంది.
ఉదాహరణకు, 10 ఏళ్ల పిల్లాడికి పాస్‌పోర్ట్ తీసుకుంటే అది ఐదేళ్ల పాటు (అంటే 15 ఏళ్ల వయసు వచ్చేవరకు) చెల్లుతుంది. ఒకవేళ చిన్నారికి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పాస్‌పోర్ట్ తీసుకుంటే, ఐదేళ్ల గడువుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండగానే ఆ పాస్‌పోర్ట్ గడువు ముగుస్తుంది. గతంలో ఉన్న రూల్ 12(1ఏ) స్థానంలో ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు.
పెరిగిన పాస్‌పోర్ట్ దరఖాస్తు రుసుములు..
పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించి జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన రుసుముల పెంపునకు చట్టబద్ధత కల్పిస్తూ రూల్ 8(1)ని సవరించారు. పాస్‌పోర్ట్ నిబంధనలు-1980లోని షెడ్యూల్ IV ప్రకారం కొత్త రుసుముల వివరాలను ఖరారు చేశారు. కొత్తగా పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవడం, రీ-ఇష్యూ, తత్కాల్ దరఖాస్తులు, పోయిన లేదా పాడైన పాస్‌పోర్ట్‌ల స్థానంలో కొత్తవి పొందడం, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) వంటి అన్ని సేవల రుసుములను సవరించారు.
వయోజనులు, చిన్నారుల పాస్‌పోర్ట్ దరఖాస్తు రుసుముల వివరాలు..
పెరిగిన ధరల ప్రకారం సాధారణ, తత్కాల్ కేటగిరీల్లో రుసుములు గణనీయంగా పెరిగాయి.
సాధారణ పాస్‌పోర్ట్ (36 పేజీలు): పెద్దలకు గతంలో రూ.1,500 ఉండగా, ఇప్పుడు రూ.2,500కి పెంచారు.
సాధారణ పాస్‌పోర్ట్ (60 పేజీలు): గతంలో రూ.2,000 ఉండగా, ప్రస్తుతం రూ.3,500 చేశారు.
తత్కాల్ పాస్‌పోర్ట్ (36 పేజీలు): రూ.3,500 నుంచి ఏకంగా రూ.5,000కి పెరిగింది.
తత్కాల్ పాస్‌పోర్ట్ (60 పేజీలు): గతంలో ఉన్న రూ.4,000 రుసుమును రూ.6,000గా నిర్ణయించారు.
పాడైన/పోయిన 60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ భర్తీ: రూ.5,500 నుంచి రూ.8,500కి సవరించారు.
చిన్నారులకు (మైనర్లు) సంబంధించి 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ దరఖాస్తు రుసుము రూ.1,000 నుంచి రూ.1,750కి పెరిగింది. మైనర్ల తత్కాల్ పాస్‌పోర్ట్ రుసుమును రూ.3,000గా ఖరారు చేశారు.
డిస్కౌంట్ సదుపాయం..
వయోవృద్ధులు, చిన్నపిల్లలకు స్వల్ప ఊరట లభించింది. 8 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన సీనియర్ పౌరులు కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే రుసుములో 10 శాతం రాయితీ వర్తిస్తుంది. అయితే ఈ తగ్గింపు కేవలం కొత్త దరఖాస్తులకు మాత్రమే పరిమితం, రీ-ఇష్యూ దరఖాస్తులకు ఈ రాయితీ వర్తించదు అని గుర్తుపెట్టుకోవాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


