పిల్లలకు యూఎస్ పాస్‌పోర్టు కావాలంటే.. తల్లిదండ్రులకు పౌరసత్వం ఉండాల్సిందే- ట్రంప్ కొత్త రూల్!
అమెరికాలో జన్మించే పిల్లలకు పాస్‌పోర్ట్ మంజూరు చేసే ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం మరింత కఠినతరం చేస్తోంది. ఇకపై పిల్లలకు యూఎస్ పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ హోదాను నిరూపించే చట్టబద్ధమైన ఆధారాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'జన్మహక్కు పౌరసత్వం' రద్దు లక్ష్యంగా మరో కొత్త ఆంక్షలకు తెరలేపారు. వీటి వల్ల అమెరికా భూభాగంలో జన్మించిన పిల్లలకు యూఎస్ పాస్‌పోర్ట్ పొందడం ఇకపై అంత సులభం కాకపోవచ్చు! పిల్లలకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో తల్లిదండ్రులు తమ సొంత పౌరసత్వం లేదా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదాను తప్పనిసరిగా నిరూపించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ నూతన మార్గదర్శకాల ముసాయిదాను సిద్ధం చేసింది.

'బర్త్ టూరిజం' (ప్రసవం కోసమే విదేశాల నుంచి అమెరికా వచ్చి సంతానానికి పౌరసత్వం పొందడం) అడ్డుకోవడానికి ఈ మార్పులు సహాయపడతాయని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా అమెరికాలో తాత్కాలిక వీసాలపై (హెచ్-1బీ, ఎల్1) నివసిస్తున్న భారతీయ ఐటీ నిపుణులతో పాటు ఇతర విదేశీయుల పిల్లలకు ఈ కొత్త ప్రతిపాదనలు తీవ్ర కలవరం కలిగిస్తున్నాయి.
ప్రస్తుత నిబంధనలేంటి? రాబోయే మార్పులేంటి?
ప్రస్తుతం అమెరికా భూభాగంలో జన్మించిన ప్రతీ చిన్నారికి రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం స్వయంచాలకంగా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తు సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో తమకున్న సంబంధాన్ని నిరూపించే జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికేట్), తమ ఫోటో ఐడీని చూపిస్తే సరిపోతుంది. తమ పౌరసత్వ స్థితిని ఫారమ్‌లో పేర్కొన్నప్పటికీ, దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సమర్పించాల్సిన అవసరం ఇప్పటివరకు లేదు.
ప్రతిపాదిత నూతన మార్గదర్శకాల ప్రకారం..
అమెరికా పౌరులైన తల్లిదండ్రులు తమ చెల్లుబాటు అయ్యే యూఎస్ పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్‌ను దాఖలు చేయాలి.
అమెరికా పౌరులు కాని విదేశీయులు తమ గ్రీన్ కార్డ్ లేదా ఐ-94 (I-94) ఫారమ్ వంటి చట్టబద్ధ నివాస ఆధారాలను అందించాల్సి ఉంటుంది.
ఈ వివరాల ఆధారంగా సదరు చిన్నారికి అమెరికా పాస్‌పోర్ట్ పొందే అర్హత ఉందో లేదో స్టేట్ డిపార్ట్‌మెంట్ వర్గాలు నిర్ధారిస్తాయి.
"అమెరికా పౌరసత్వానికి ఉన్న విలువను, ప్రాధాన్యతను పరిరక్షించడమే ట్రంప్ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. పాస్‌పోర్ట్ మంజూరు ప్రక్రియలోనూ ఇదే ప్రమాణాన్ని కచ్చితంగా అమలు చేస్తాం," అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ స్పష్టం చేశారు.
'బర్త్ టూరిజం'పై ప్రత్యేక నిఘా..
ఆగస్టు 6న అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు అనుగుణంగా అమెరికా విదేశాంగశాఖ ఈ ముసాయిదాను తయారు చేసింది. గర్భంతో ఉన్న మహిళలు పర్యాటక వీసాలపై అమెరికా వచ్చి, బిడ్డకు జన్మనిచ్చి పౌరసత్వం పొందే 'బర్త్ టూరిజం' దందాను అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశం. దీనితో పాటు విదేశీ ప్రభుత్వాల ప్రతినిధులుగా పనిచేసేవారు, మోసపూరిత విధానాల్లో పౌరసత్వం పొందాలని చూసేవారి పిల్లలకు కూడా ఆటోమేటిక్ పౌరసత్వాన్ని తిరస్కరించేలా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు.
కాగా జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ట్రంప్ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పేర్కొన్న పౌరసత్వ నిబంధనలకు ఆ ఉత్తర్వులు విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రస్తుతం విదేశాంగశాఖ ప్రతిపాదించిన కొత్త నిబంధనలు కూడా తీవ్ర న్యాయపోరాటాలను ఎదుర్కొంటున్నాయి. మేరీల్యాండ్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డెబోరా బోర్డ్‌మన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఇప్పటికే ఈ ఉత్తర్వులపై పిటిషన్లు దాఖలయ్యాయి. ట్రంప్ జారీ చేసిన ఈ వినూత్న ఉత్తర్వుల చట్టబద్ధతపై న్యాయమూర్తి అనుమానాలు వ్యక్తం చేశారు. సరికొత్త అధికారిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా పబ్లిక్‌గా విడుదల చేయలేదని, అందువల్ల స్టే విధించడం సమంజసం కాదని జస్టిస్ డిపార్ట్‌మెంట్ న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలు రాబోయే రోజుల్లో కోర్టుల తీర్పుకు అత్యంత కీలకమైన అంశంగా మారనున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


