టాలెంట్, డబ్బు ఉంటే ఇక అమెరికా పౌరసత్వం ఈజీ! ట్రంప్ 'గోల్డ్ కార్డ్' వీసా రూల్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిభావంతులు, సంపన్నుల కోసం ఉద్దేశించిన 'గోల్డ్ కార్డ్' ఇన్వెస్టర్ వీసా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఒక మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.3 కోట్లు) విరాళం చెల్లించడం ద్వారా శాశ్వత నివాసం, ఆ తర్వాత పౌరసత్వం పొందడానికి ఇది ఒక వేగవంతమైన మార్గం. 

Published on: Dec 12, 2025, 08:31:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో హామీ ఇస్తున్న 'గోల్డ్ కార్డ్' (Gold Card) ఇన్వెస్టర్ వీసా కార్యక్రమం డిసెంబరు 10న ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ఇప్పుడు పనిచేస్తుండగా, దరఖాస్తులను స్వీకరించడం మొదలైంది.

టాలెంట్, డబ్బు ఉంటే ఇక అమెరికా పౌరసత్వం ఈజీ! ట్రంప్ 'గోల్డ్ కార్డ్' వీసా రూల్స్ (AP)
టాలెంట్, డబ్బు ఉంటే ఇక అమెరికా పౌరసత్వం ఈజీ! ట్రంప్ 'గోల్డ్ కార్డ్' వీసా రూల్స్ (AP)

ఈ గోల్డ్ కార్డ్ కార్యక్రమం కోసం ఒక మిలియన్ డాలర్లు (సుమారు 8.3 కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రకటించారు.

'ట్రంప్ గోల్డ్ కార్డ్' లక్ష్యం ఏంటి?

ఈ గోల్డ్ కార్డ్ వీసా కార్యక్రమాన్ని ట్రంప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు (Executive Order) ద్వారా స్థాపించారు. ఇప్పుడు ఫెడరల్ ప్రభుత్వం దీనిని లాంఛనంగా అమలులోకి తీసుకొచ్చింది.

"యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ 'ట్రంప్ గోల్డ్ కార్డ్' ఈ రోజు వచ్చేసింది!" అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. "అర్హత ఉన్న, క్షుణ్ణంగా పరిశీలన పూర్తయిన ప్రజలందరికీ పౌరసత్వం పొందడానికి ఇది ఒక ప్రత్యక్ష మార్గం. చాలా ఉత్సాహంగా ఉంది! మా గొప్ప అమెరికన్ కంపెనీలు చివరకు తమ అమూల్యమైన ప్రతిభావంతులను తమ వద్దే అట్టిపెట్టుకోగలవు" అని ట్రంప్ పేర్కొన్నారు.

నిజానికి, ఈ గోల్డ్ కార్డ్ అనేది గతంలో ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసా కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా వచ్చింది. అయితే, ఈ కొత్త విధానంలో అమెరికాలో తప్పనిసరిగా ఉద్యోగాలు సృష్టించాలనే నిబంధన లేదు.

గోల్డ్ కార్డ్: ఖర్చు, విభాగాల వివరాలు

డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త రెసిడెన్సీ/వీసా కార్యక్రమంలో ప్రస్తుతం రెండు విభాగాలు (Tiers) అందుబాటులో ఉన్నాయి: గోల్డ్ కార్డ్, కార్పొరేట్ గోల్డ్ కార్డ్.

మరో విభాగం అయిన ప్లాటినమ్ కార్డ్ (Platinum Card) త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్లాటినమ్ కార్డ్ ద్వారా సుమారు 270 రోజుల వరకు అమెరికాలో ఉండేందుకు వీసా లభిస్తుంది.

గోల్డ్ కార్డ్ (వ్యక్తిగతం): ఇది అమెరికా పౌరసత్వం కోసం వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకునే వారి కోసం ఉద్దేశించినది. దరఖాస్తుదారు $15,000 అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు తిరిగి చెల్లించరు. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి ఒకసారి $1 మిలియన్ 'విరాళం' (Gift) చెల్లించాలి.

కార్పొరేట్ గోల్డ్ కార్డ్: ఉద్యోగి తరపున కార్పొరేట్ సంస్థ స్పాన్సర్ చేయడం ద్వారా ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధిత సంస్థ $15,000 అప్లికేషన్ కమ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు కూడా తిరిగి చెల్లించరు. ఆమోదం తర్వాత, దరఖాస్తు పూర్తి చేయడానికి ఒకసారి $2 మిలియన్ల 'విరాళం' చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్య గమనిక: దరఖాస్తు/ప్రాసెసింగ్ ఫీజును క్రెడిట్ కార్డ్ లేదా ACH డెబిట్ కార్డ్ (US బ్యాంకులు మాత్రమే) ద్వారా చెల్లించవచ్చు.

దరఖాస్తు తుది గడువు ఉందా?

ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్ లైవ్ అయ్యింది. ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ ఏడాది పొడవునా కొనసాగుతుందా లేదా అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దరఖాస్తుకు తుది గడువు అంటూ వెబ్‌సైట్‌లో ఎక్కడా పేర్కొనలేదు.

ట్రంప్ గోల్డ్ కార్డ్ కోసం దరఖాస్తు ఎలా చేయాలి?

అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు పూర్తి చేయడానికి అనుసరించాల్సిన విధానం ఇక్కడ ఉంది:

మొదటి దశ: https://trumpcard.gov అనే అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.

రెండో దశ: 'Apply Now' (ఇప్పుడే దరఖాస్తు చేయండి) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మూడో దశ: సంబంధిత సమాచారాన్ని నమోదు చేయడానికి ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ సరైన, ఖచ్చితమైన సమాచారంతో ఫారమ్‌ను నింపండి.

నాలుగో దశ: 'Continue to payment' (చెల్లింపుకు కొనసాగించు) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఐదో దశ: అంతర్జాతీయ/US క్రెడిట్ కార్డ్ లేదా ACH డెబిట్ కార్డ్ ఉపయోగించి ఫీజును చెల్లించండి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More