హైదరాబాద్ సహా భారతీయ కాన్సులేట్లలో అనేక హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్లు రద్దు! కారణం..
హెచ్-1బీ వీసాలకు కొత్త నిబంధన త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ రూల్స్ ప్రకారం సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ చేయాల్సిందే! ఇది భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ కొత్త నిబంధనల కారణంగా అనేక హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్లు రద్దు కూడా అవుతున్నాయి!
అమెరికాలో పనిచేయడానికి అనుమతినిచ్చే హెచ్-1బీ వీసా, వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే హెచ్-4 వీసాదారులందరూ తప్పనిసరిగా తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాలని అమెరికా విదేశాంగ శాఖ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. "వీసా వెట్టింగ్"లో భాగంగా ఈ నిబంధన తీసుకురావడంతో, అమెరికాలో నైపుణ్యం కలిగిన వీసాదారుల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న భారతీయ వలస సమాజంలో తీవ్ర ఆందోళన మొదలైంది. అంతేకాదు, కొత్త నిబంధనల కారణంగా ఇండియాలోని పలు కాన్సులేట్లలో అనేక హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్లు రద్దు కూడా అవుతున్నాయి!

డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అమెరికాలో హెచ్-1బీ వీసా అనుమతులు పొందినవారిలో 70 శాతానికి పైగా, హెచ్-4 ఆధారిత ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కలిగి ఉన్నవారిలో దాదాపు 90 శాతం మంది భారతీయులే ఉన్నారు. వీరిలో చాలా మంది తమ కెరీర్‌లు, ఇళ్ల రుణాలు, పిల్లల చదువులను అమెరికాలో తమ చట్టపరమైన హోదాపై ఆధారపడి నిర్మించుకున్నారు.
ఆందోళన ఎందుకు?
వీసా అధికారులు ఇప్పుడు ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, లింక్‌డిన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అభ్యర్థులు చేసిన పబ్లిక్ పోస్ట్‌లను సమీక్షించేందుకు ఈ కొత్త ఆదేశం వీలు కల్పిస్తుంది.
ఇమ్మిగ్రేషన్ లాయర్ల అభిప్రాయం ప్రకారం.. మామూలు వ్యాఖ్యలు, రాజకీయ అభిప్రాయాలు లేదా రెజ్యూమె వివరాల్లో చిన్న తేడాలు కనిపించినా కూడా వీసాదారులపై అదనపు పరిశీలన పెరిగే అవకాశం ఉంది. ఇది తీవ్ర భయాన్ని సృష్టించింది.
పెద్ద సంఖ్యలో భారతీయ ఉద్యోగులు ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు సోషల్ మీడియా ప్రొఫైల్‌లను పూర్తిగా తనిఖీ చేసుకోమని, రాజకీయ మీమ్స్ షేర్ చేయకుండా ఉండాలని, వీసా దరఖాస్తుల్లో వృత్తిపరమైన ఈమెయిల్‌లనే ఉపయోగించాలని సలహా ఇస్తున్నాయి.
వీసా అపాయింట్‌మెంట్లు రద్దు..
కొత్త నిబంధన కారణంగా ప్రక్రియలో ఇప్పటికే అంతరాయం ఏర్పడింది! హైదరాబాద్, చెన్నై సహా భారతీయ కాన్సులేట్లలో డిసెంబర్ నెలలో షెడ్యూల్ చేసిన అనేక వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు అకస్మాత్తుగా రద్దయ్యాయి.
డిసెంబర్ అపాయింట్‌మెంట్లు మార్చి 2026కు వాయిదా పడినట్లు చాలా మంది దరఖాస్తుదారులు తెలుసుకున్నారు. దీనివల్ల కొత్త ఉద్యోగాల్లో చేరాల్సిన వారు, విదేశాల్లో చిక్కుకుపోయిన కుటుంబాలు, పెళ్లిళ్లు లేదా తల్లిదండ్రులను చూసేందుకు షార్ట్ టర్మ్ సందర్శన కోసం వచ్చిన ప్రయాణికులు అమెరికాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
నిబంధన వెనుక కారణం..
విదేశాంగ శాఖ ఈ కొత్త నిబంధనను గట్టిగా సమర్థించుకుంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల కోసం ఇప్పటికే అమల్లో ఉన్న ఆన్‌లైన్ వెట్టింగ్ ప్రక్రియనే ఇప్పుడు విస్తరించినట్లు తెలిపింది.
"ప్రతి వీసా నిర్ణయం జాతీయ భద్రతకు సంబంధించినదే. అమెరికన్లకు, మా జాతీయ ప్రయోజనాలకు హాని చేయని అభ్యర్థులను మాత్రమే అనుమతించడానికి ఈ పరిశీలన అవసరం. యూఎస్ వీసా అనేది ఒక ప్రత్యేక అర్హత మాత్రమే, అది హక్కు కాదు," అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
అధికారులు తనిఖీ చేయడానికి వీలుగా దరఖాస్తుదారులు ఇప్పుడు తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌లు అన్నింటినీ పబ్లిక్ సెట్టింగ్‌లోకి మార్చవలసి ఉంటుంది.
అమెరికా ఎంబసీ కీలక ప్రకటన..
మరోవైపు, భారత్‌లోని అమెరికా ఎంబసీ మంగళవారం (డిసెంబర్ 9, 2025) వీసా దరఖాస్తుదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. తమ ఇంటర్వ్యూ తేదీ రీషెడ్యూల్ అయినట్టు ఈమెయిల్ నోటిఫికేషన్ అందుకున్న వారు, పాత తేదీల్లో ఇంటర్వ్యూలకు రావద్దని కోరింది.
ఎంబసీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, “మీ వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయినట్లు మీకు ఈమెయిల్ వస్తే, మిషన్ ఇండియా కొత్త అపాయింట్‌మెంట్ తేదీన మీకు సేవ చేయడానికి ఎదురుచూస్తోంది. గతంలో షెడ్యూల్ చేసిన తేదీకి వస్తే, ఎంబసీ లేదా కాన్సులేట్‌లోకి అనుమతి నిరాకరిస్తారు,” అని పేర్కొంది.
సాధారణంగానే వీసా ఇంటర్వ్యూ స్లాట్‌ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఈ రీషెడ్యూలింగ్ వల్ల ఎదురుచూపుల సమయం మరిన్ని నెలలు పెరగనుంది!
ఇమ్మిగ్రేషన్ న్యాయవాది స్టీవెన్ బ్రౌన్ మాట్లాడుతూ, "సోషల్ మీడియా వెట్టింగ్‌కు వీలు కల్పించడానికి రాబోయే వారాల్లో అనేక అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసి, మార్చికి వాయిదా వేస్తున్నట్లు మిషన్ ఇండియా ధృవీకరిస్తోంది," అని తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


