అమెరికా వర్క్ పర్మిట్ గడువు కుదింపు.. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై పెనుభారం!

అమెరికా వర్క్ పర్మిట్ గడువును కుదించింది ట్రంప్​ ప్రభుత్వం. ఈఏడీ కాలపరిమితి 18 నెలలకు పరిమితమైంది. ఇది గ్రీన్​ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అధిక భారంగా మారనుంది. ఉద్యోగంలో స్థిరత్వాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది! 

Published on: Dec 9, 2025, 06:45:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్​సీఐఎస్​) ఇటీవల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) (దీనినే సాధారణంగా 'వర్క్ పర్మిట్' అంటారు) కాలపరిమితిపై కీలకమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ మార్పు ప్రధానంగా అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డు) కోసం దరఖాస్తు చేసుకుని, ఆ ప్రక్రియలో ఉన్న వలసదారులపై ప్రభావం చూపనుంది!

కొత్త రూల్స్​తో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై పెనుభారం!
కొత్త రూల్స్​తో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై పెనుభారం!

గడువు తగ్గింపు ఎందుకు ముఖ్యమైంది?

డిసెంబర్ 5వ తేదీ నుంచి, కొత్తగా మంజూరు చేసే లేదా రెన్యువల్​ చేసే ఈఏడీల గరిష్ట కాలపరిమితిని 18 నెలలకు పరిమితం చేసింది యూఎస్​సీఐఎస్.

ఈ తేదీకి ముందు ఈఏడీ పొందిన వారికి, వారికి మొదట మంజూరు చేసిన పూర్తి కాలపరిమితి అలాగే ఉంటుంది. అయితే, భవిష్యత్తులో వారు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, కొత్తగా అమల్లోకి వచ్చిన 18 నెలల పరిమితి మాత్రమే వర్తిస్తుంది (న్యూస్‌వీక్ నివేదిక ప్రకారం).

ఈ మార్పుల వల్ల ఈఏడీ రెన్యూవల్స్ మరింత తరచుగా చేయాల్సి వస్తుంది! దీని అర్థం- అదనపు ఫైలింగ్ ఫీజులు, ఎక్కువ పేపర్‌వర్క్, యూఎస్​సీఐఎస్​ ప్రాసెసింగ్ సమయాలు నెమ్మదిగా ఉంటే, ఉద్యోగంలో అంతరాయం ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది! ఇది గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల ఉద్యోగ స్థిరత్వాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు తీసుకోవాల్సిన చర్యలు..

'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్' కోసం దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఈఏడీపై ఆధారపడే గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు సిద్ధంగా ఉండటానికి కింద పేర్కొన్న ముఖ్యమైన అంశాలను పాటించాలి:

ముందస్తు దరఖాస్తు: ఈఏడీ పునరుద్ధరణ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలి. గడువు ముగియడానికి 180 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్​సీఐఎస్​ అనుమతిస్తుంది.

పత్రాల సన్నద్ధత: పాస్‌పోర్ట్, ఐ-485 రసీదు నోటీసు, ప్రస్తుత ఈఏడీ వంటి అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అలాగే, యూఎస్​సీఐఎస్​ రికార్డులు కచ్చితంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.

ఆర్థిక ప్రణాళిక: తరచుగా రెన్యూవల్ చేయాల్సి వస్తుంది కాబట్టి, అందుకు అయ్యే ఫీజుల కోసం ఆర్థికంగా సిద్ధమవ్వాలి! ఈ నివేదిక ప్రచురించే సమయానికి, రెన్యువల్​ ఖర్చు 605 డాలర్లు వరకు ఉండవచ్చు. అయితే, అడ్జస్ట్‌మెంట్-ఆఫ్-స్టేటస్ దరఖాస్తుదారులకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి.

యజమానిని అప్రమత్తం చేయడం: ఈ మార్పుల గురించి తమ యజమానులకు తెలియజేయాలి. ఇది నిబంధనల పాటించడానికి, ఐ-9 రీ-వెరిఫికేషన్‌ను సకాలంలో పూర్తి చేయడానికి సహాయపడుతుంది.

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ కఠినతరం..

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్‌పై కఠిన వైఖరిని అనుసరిస్తున్న నేపథ్యంలో, 50 మందికి పైగా ఇరాన్ జాతీయులు అమెరికా నుంచి తిరిగి తమ దేశానికి రానున్నారని ఇరాన్ ప్రకటించింది.

ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మైల్ బఖాయీ మాట్లాడుతూ, "రాబోయే రోజుల్లో, సుమారు 50 నుంచి 55 మంది ఇరాన్ జాతీయులు తిరిగి వస్తారు" అని తెలిపారు.

"ఇటీవలి నెలల్లో ఇరాన్‌కు తిరిగి పంపిస్తున్న రెండవ బృందం ఇది" అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా బఖాయీ మాట్లాడుతూ, అమెరికా "విదేశీ జాతీయులపై – ముఖ్యంగా ఇరానియన్లపై చూపుతున్న జాతి వివక్ష చర్యలను" ఖండించారు.

ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, టెహ్రాన్ కాన్సులర్ సమస్యలను పరిష్కరించడానికి వాషింగ్టన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం పరిధిలో ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More