కేఎఫ్‌సీలో కుళ్ళిన చికెన్.. మంగళూరు ఔట్‌లెట్‌ను సీజ్ చేసిన అధికారులు

ఆన్‌లైన్ ఆర్డర్‌లో కుళ్ళిన చికెన్ పంపారన్న కస్టమర్ ఫిర్యాదుతో మంగళూరులోని ప్రముఖ కేఎఫ్‌సీ ఔట్‌లెట్‌ను ఆహార భద్రతా అధికారులు సీజ్ చేశారు. కర్ణాటకవ్యాప్తంగా స్టార్ హోటళ్లు, ఆసుపత్రుల కిచెన్లలో జరిపిన తనిఖీల్లో భారీగా కుళ్ళిన మాంసం, కాలంచెల్లిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి.

Published on: Aug 17, 2026, 11:31:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళూరులోని కె.ఎస్. రావు రోడ్డులో ఉన్న సిటీ సెంటర్ మాల్‌లోని కేఎఫ్‌సీ (KFC) ఔట్‌లెట్‌ను ఆహార భద్రతా శాఖ అధికారులు సీజ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన చికెన్ దుర్వాసన వస్తూ, కుళ్ళిపోయి ఉందంటూ ఒక వినియోగదారుడు చేసిన ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించారు. ఔట్‌లెట్‌పై మెరుపు దాడి చేసి తనిఖీలు చేపట్టారు.

ఆన్‌లైన్ ఆర్డర్‌లో కుళ్ళిన చికెన్ పంపారన్న కస్టమర్ ఫిర్యాదుతో మంగళూరులోని ప్రముఖ కేఎఫ్‌సీ ఔట్‌లెట్‌ను ఆహార భద్రతా అధికారులు సీజ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆన్‌లైన్ ఆర్డర్‌లో కుళ్ళిన చికెన్ పంపారన్న కస్టమర్ ఫిర్యాదుతో మంగళూరులోని ప్రముఖ కేఎఫ్‌సీ ఔట్‌లెట్‌ను ఆహార భద్రతా అధికారులు సీజ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)

గోదాము సీల్.. ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు

తనిఖీల సమయంలో అధికారులు కేఎఫ్‌సీ కిచెన్, స్టోర్‌రూమ్‌తో పాటు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను అంగుళం అంగుళం పరిశీలించారు. అనంతరం ఆ ఔట్‌లెట్ గోదామును సీల్ చేసి, చికెన్ శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాతే కేఎఫ్‌సీపై తదుపరి చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు ఉంటాయని ఆహార భద్రతా శాఖ స్పష్టం చేసింది.

కేఎఫ్‌సీ వివరణ ఇదీ..

ఈ వివాదంపై కేఎఫ్‌సీ యాజమాన్యం స్పందిస్తూ ఆరోపణలను ఖండించింది. "మా సంస్థ ఆహార భద్రత, నాణ్యత, పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యమిస్తుంది. నెట్టింట ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదు. మేము ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ (FSSAI) మార్గదర్శకాలకు అనుగుణంగానే దేశంలోని గుర్తింపు పొందిన సరఫరాదారుల నుంచి నాణ్యమైన చికెన్‌ను సేకరిస్తాం. ప్రతీ రోజూ కఠినమైన నాణ్యతా పరీక్షల తర్వాతే వినియోగదారులకు అందిస్తాం. అధికారుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాం" అని కేఎఫ్‌సీ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ కిచెన్ నిర్వహణపై సందేహాలు ఉన్న వినియోగదారులు నేరుగా వచ్చి పరిశీలించవచ్చని తెలిపారు.

మైసూరు, బెంగళూరులోనూ దాడుల పరంపర

ఈ ఒక్క సంఘటన మాత్రమే కాక, కర్ణాటకవ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులు తనిఖీలను ఉధృతం చేశారు. మైసూరులోని రియో మెరిడియన్ హోటల్ నుంచి 9 కేజీల కాలంచెల్లిన చికెన్, గ్రాండ్ మెర్క్యూర్ హోటల్ నుంచి 68 కేజీల మాంసం, క్యూ స్టార్ హోటల్ నుంచి 4 కేజీల పుట్టగొడుగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నంజనగూడు, మైసూరు పరిసరాల్లోని రిసార్టులలో తనిఖీలు చేసి 16 కేజీల పాడైపోయిన ఆహారాన్ని పారేశారు.

స్టార్ హోటళ్లు, ఆసుపత్రి కిచెన్లలో కుళ్ళిన ఆహారం

బెంగళూరులోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి కిచెన్‌లో జరిపిన సోదాల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ కాలంచెల్లిన రవ్వ, మైదా, బేకరీ ఉత్పత్తులు, పాడైపోయిన పానీపూరీ, మిశ్రమం ప్యాకెట్లతో పాటు కుళ్ళిన బ్రెడ్‌ను గుర్తించారు. అలాగే బెంగళూరులోని 'ఫోర్ సీజన్స్', 'షాంగ్రీలా' వంటి ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ కుళ్ళిన మాంసం, గడువు తీరిన పాలు లభించడంతో ఆహార భద్రతా శాఖ న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది.

రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, ఆసుపత్రులు, రెస్టారెంట్లలో దాడులు కొనసాగుతాయని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఏ సంస్థనూ విడిచిపెట్టబోమని అధికారులు హెచ్చరించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More