బంగ్లాదేశ్​లో భూకంపం- కోల్​కతా వరకు ప్రకంపనలు.. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు!

కోల్​కతాతో పాటు ఈశాన్య భారత దేశంలో భూకంపం సంభవించింది. అనేక చోట్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు 30 సెకన్లా కన్నా ఎక్కువసేపు ఉన్నట్టు ప్రజలు చెబుతున్నారు.

Published on: Nov 21, 2025 10:57 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగ్లాదేశ్​లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. అక్కడి నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోల్​కతా, దాని పరిసర జిల్లాలు సహా ఈశాన్య భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది.

కోల్​కతాలో భూ ప్రకంపనలు.. (Representational image)
కోల్​కతాలో భూ ప్రకంపనలు.. (Representational image)

యూరోపియన్​- మెడిటరేనియన్​ సిస్మోలాజికల్​ సెంటర్​ ప్రకారం.. ఈ భూకంపం తొలుత బంగ్లాదేశ్​లో సంభవించింది. నార్సింగ్దిలోని మధాబ్ది ప్రాంతంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. భూమికి 10 కి.మీల లోతున భూ ప్రకంపనలు రికార్డు అయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టార్​ స్కేల్​పై 5.2గా నమోదైందని తెలుస్తోంది.

భూకంపం కారణంగా బంగ్లాదేశ్​- ఐర్లాండ్​ మధ్య క్రికెట్​ మ్యాచ్​కి అంతరాయం ఏర్పడింది. భూమి కంపించిన వెంటనే క్రికెటర్లు డ్రెస్సింగ్​ రూమ్​లో నుంచి మైదానం వైపు పరుగులు తీశారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఆట మొదలైంది.

కోల్​కతాలో పరిస్థితి ఇలా..

మరోవైపు భూ ప్రకంపనల ధాటికి కోల్​కతావాసులు హడలెత్తిపోయారు. చాలా మంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

భూమి కంపించడంపై అనేక మంది కోల్​కతావాసులు సోషల్​ మీడియాలో పోస్టులు చేశారు.

“నా జీవితంలో ఇలాంటి భూకంపం చూడలేదు,” అని ఒకరు పోస్ట్​ చేయగా.. “ఈ భూకంపం చాలా ఎక్కువసేపు ఉంది. 30 సెకన్ల కన్నా ఎక్కువసేపు భూమి కంపించింది,” అని మరొకరు పేర్కొన్నారు.

ఊగుతున్న సీలింగ్​ ఫ్యాన్స్​, షేక్​ అవుతున్న టేబుల్స్​కి సంబంధించిన వీడియోలను కొందరు ఆన్​లైన్​లో పోస్ట్​ చేశారు.

కోల్​కతాలో భూ ప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

గత కొన్ని రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపాలు, భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వారం తొలినాళ్లల్లో అండమాన్​ దీవుల్లో భూకంపం సంభవించింది. రికార్ట్​ స్కేల్​పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. భూమికి 90 కి.మీల దిగువన ఇది కేంద్రీకృతమైంది.

భూకంపాలు సంభవించే లోతు ఆధారంగా అవి కలిగించే నష్టం మారుతుంది. సాధారణంగా, లోతు తక్కువగా ఉండే భూకంపాలు, లోతు ఎక్కువగా ఉండే భూకంపాల కంటే అధిక ప్రమాదకరమైనవి!

భూకంపం ఎంత లోతులో సంభవిస్తే, భూకంప తరంగాలు అంత దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల అవి ఉపరితలం చేరుకునేసరికి వాటి శక్తి క్రమంగా తగ్గిపోయి, భూమి కంపించే తీవ్రత తగ్గుతుంది.

కాగా శుక్రవారం ఉదయం పాకిస్థాన్​లో కూడా భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై 5.2 తీవ్రత నమోదైంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More