లోన్ కట్టకపోతే ఎల్ఐసీ పాలసీ రద్దు చేయొచ్చు: వినియోగదారుల కమిషన్ తీర్పు
బ్యాంకు రుణానికి హామీగా ఉంచిన ఎల్ఐసీ పాలసీలపై జాతీయ వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది. రుణాలు చెల్లించని పక్షంలో, పాలసీదారుని అనుమతి లేకపోయినా బ్యాంకు దాన్ని రద్దు (సరెండర్) చేయవచ్చని తేల్చిచెప్పింది. ఈ విషయంలో బీమా సంస్థ సేవల్లో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేసింది.
బ్యాంకు రుణాలు తీసుకునేందుకు చాలామంది ఎల్ఐసీ లేదా ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ష్యూరిటీగా పెడుతుంటారు. అయితే, అప్పు తీర్చకపోతే ఆ పాలసీకి ఏమవుతుందనే దానిపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) కీలక స్పష్టత ఇచ్చింది. బ్యాంకుకు హామీగా అప్పగించిన (అసైన్ చేసిన) పాలసీని రద్దు చేసేందుకు అసలు పాలసీదారుడి నుంచి ప్రత్యేక అనుమతి గానీ, నోటీసు గానీ అవసరం లేదని ఎన్‌సీడీఆర్‌సీ తీర్పు చెప్పింది.

అసలు కేసేంటి?
హర్యానాలోని సోనెపత్ జిల్లా ఖార్ఖోడాకు చెందిన అమర్ సింగ్ 2001 డిసెంబర్ 28న ఎల్ఐసీ నుంచి రూ. 5 లక్షల బీమా హామీ మొత్తంతో (సమ్ అస్యూర్డ్) ఒక పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీ మెచ్యూరిటీ గడువు 2026 డిసెంబర్ 8 వరకు ఉంది. ఆ తర్వాత ఆయన ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ. 79,000 క్రెడిట్ లిమిట్ పొందడానికి తన ఎల్ఐసీ పాలసీని బ్యాంకుకు హామీగా (అసైన్) ఇచ్చారు.
అమర్ సింగ్ ప్రీమియంలు చెల్లిస్తున్నప్పటికీ, 2011 అక్టోబర్ 5న ఎల్ఐసీ ఈ పాలసీని రూ. 2,26,325కు సరెండర్ చేసి, ఆ మొత్తాన్ని ఐడీబీఐ బ్యాంకుకు బదిలీ చేసింది. తాను ఎలాంటి అనుమతి ఇవ్వకుండానే పాలసీని రద్దు చేశారని అమర్ సింగ్ సోనెపత్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.
జిల్లా, రాష్ట్ర కమిషన్ల భిన్న తీర్పులు
ఈ కేసులో జిల్లా వినియోగదారుల ఫోరం 2015 ఫిబ్రవరిలో అమర్ సింగ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పాలసీని పునరుద్ధరించాలని ఎల్ఐసీని, సరెండర్ చేసిన రూ. 2,26,325 మొత్తాన్ని 9 శాతం వడ్డీతో పాటు మానసిక వేదనకు రూ. 10,000 పరిహారం చెల్లించాలని ఐడీబీఐ బ్యాంకును ఆదేశించింది.
అయితే, ఈ తీర్పును ఎల్ఐసీ హర్యానా రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో సవాలు చేసింది. 2016 సెప్టెంబర్‌లో రాష్ట్ర కమిషన్ విచారణ జరిపి, జిల్లా ఫోరం తీర్పును కొట్టివేసింది. పాలసీని బ్యాంకుకు అసైన్ చేసిన తర్వాత దానిపై హక్కులు బ్యాంకుకే ఉంటాయని, అమర్ సింగ్‌కు ప్రత్యేకంగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఎల్ఐసీకి లేదని స్పష్టం చేసింది. దీంతో అమర్ సింగ్ ఎన్‌సీడీఆర్‌సీని ఆశ్రయించారు.
ఎన్‌సీడీఆర్‌సీ ఏం చెప్పిందంటే..
విచారణ సందర్భంగా, అమర్ సింగ్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. నిలిచిపోయిన పాలసీల పునరుద్ధరణకు ఎల్ఐసీ ప్రత్యేక ప్రచారాలు నిర్వహిస్తుందని, పాలసీ కొనసాగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని 2011 నవంబర్‌లో బ్యాంకు లేఖ రాసినా ఎల్ఐసీ దాన్ని పునరుద్ధరించలేదని తెలిపారు.
దీనికి ఎల్ఐసీ స్పందిస్తూ.. ఇది ప్రీమియం చెల్లించకపోవడం వల్ల లాప్స్ అయిన పాలసీ కాదని వివరించింది. 2007 డిసెంబర్ 6న అమర్ సింగ్ పాలసీ హక్కులన్నింటినీ బ్యాంకుకు బదిలీ చేస్తూ సంతకం చేశారని, చట్టబద్ధమైన హక్కుదారు (అసైన్నీ) కోరిక మేరకే పాలసీని సరెండర్ చేశామని పేర్కొంది.
ఈ వాదనలను పరిశీలించిన ఎన్‌సీడీఆర్‌సీ 2026 ఆగస్టు 2న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. "ఫిర్యాదుదారుడు తన పాలసీని బ్యాంకుకు అసైన్ చేసిన మాట వాస్తవం. రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు విజ్ఞప్తి మేరకు ఎల్ఐసీ సరెండర్ విలువను లెక్కించి ఆ మొత్తాన్ని బ్యాంకుకు పంపింది. నిబంధనల ప్రకారమే నడుచుకున్నందున ఈ వ్యవహారంలో బీమా సంస్థ సేవల్లో ఎలాంటి లోపం లేదు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆ రూ. 2.26 లక్షల సంగతేంటి?
బాధితుడికి రావాల్సిన సరెండర్ విలువ రూ. 2,26,325 విషయమై ఐడీబీఐ బ్యాంకుకు ఎన్‌సీడీఆర్‌సీ కీలక ఆదేశాలిచ్చింది. అమర్ సింగ్ చెక్కును నగదుగా మార్చుకోకముందే ఖాతాను మూసివేయడంతో ఆ మొత్తం బ్యాంకు 'సస్పెన్స్ అకౌంట్'లో ఉండిపోయింది. నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని వడ్డీతో సహా అమర్ సింగ్‌కు విడుదల చేయాలని బ్యాంకును ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే ఏడాదికి 6 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
పాలసీదారులు తెలుసుకోవాల్సిన విషయాలు
బ్యాంకు రుణాల కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలను కుదువ పెట్టేటప్పుడు అమల్లోకి వచ్చే 'అసైన్‌మెంట్' నిబంధనల తీవ్రతను ఈ తీర్పు తేటతెల్లం చేస్తోంది. పాలసీని బ్యాంకుకు బదిలీ చేసిన క్షణం నుంచి దానిపై పూర్తి హక్కులు బ్యాంకుకే సంక్రమిస్తాయి. కాబట్టి రుణాలు సరిగా చెల్లించని పక్షంలో పాలసీదారుడి ప్రమేయం లేకుండానే బ్యాంకు దాన్ని సరెండర్ చేసే అధికారం పొందుతుంది. అందుకే సెక్యూరిటీగా పాలసీలను ఇచ్చే ముందు ఈ నిబంధనలను కూలంకషంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


