JIO AI glasses : ఫోన్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్ చూసి యూపీఐ పేమెంట్! జియో సంచలన ‘ఏఐ గ్లాసెస్’
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 లో రిలయన్స్ జియో సరికొత్త 'పర్సనల్ ఏఐ వేరబుల్స్'ను ఆవిష్కరించింది. స్మార్ట్ కెమెరా గ్లాసెస్ ద్వారా కేవలం క్యూఆర్ కోడ్‌ను చూసి, వాయిస్ కమాండ్‌తో యూపీఐ చెల్లింపులు చేసే 'స్కాన్ అండ్ పే' టెక్నాలజీని పరిచయం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
షాప్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు జేబులోంచి ఫోన్ తీయకుండా, అన్‌లాక్ చేయకుండా, స్క్రీన్ కూడా తాకకుండా కేవలం వాయిస్ కమాండ్‌తో పేమెంట్ పూర్తి చేయగలిగితే ఎలా ఉంటుంది? ఇది ఏదో ఊహాజనిత సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యం కాదు. త్వరలోనే మన రోజువారీ జీవితంలోకి రాబోతున్న సరికొత్త సాంకేతిక విప్లవం ఇది! దేశీయ టెలికాం దిగ్గజం 'రిలయన్స్ జియో' ఈ విధమైన అద్భుత సాంకేతికతను సాకారం చేసింది.

దిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026’ వేదికగా జియో తమ సరికొత్త ప్రొడక్ట్ లైనప్‌ను ప్రదర్శించింది. ఇందులో భాగంగా ఏఐ కెమెరా గ్లాసెస్, ఆడియో గ్లాసెస్, స్మార్ట్ ఇయర్‌ఫోన్లతో కూడిన పర్సనల్ 'ఏఐ వేరబుల్స్' శ్రేణిని ఆవిష్కరించింది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..
స్కాన్ అండ్ పే: కంటిచూపుతోనే చెల్లింపులు!
ఈ ఏఐ గ్లాసెస్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ‘స్కాన్ అండ్ పే’. మీరు షాపు వద్ద ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్‌ను ఈ గ్లాసెస్ ధరించి చూస్తూ, "రూ. 500 పే చెయ్" అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు.. గ్లాసెస్‌లో ఉన్న ఏఐ కెమెరా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మీ వాయిస్ నిర్ధారణతో పేమెంట్‌ను పూర్తి చేస్తుంది.
అంటే స్మార్ట్‌ఫోన్‌ను చేతిలోకి తీసుకోకుండానే సురక్షితంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే సౌలభ్యాన్ని ఇది కల్పిస్తుంది.
ఈ చెల్లింపులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన 'యూపీఐ సర్కిల్' నిబంధనల ప్రకారం జరుగుతాయి. దీని ద్వారా ఒక లావాదేవీలో గరిష్టంగా రూ. 5,000 వరకు, నెలకు గరిష్టంగా రూ. 15,000 వరకు చెల్లింపులు చేయవచ్చు.
భాష అడ్డంకులకు చెక్ పెట్టే 'లైవ్ ట్రాన్స్‌లేషన్'
భారతీయ భాషలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ ఏఐ గ్లాసెస్ అనేక ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఉన్న మరో విప్లవాత్మక ఫీచర్ ‘లైవ్ ట్రాన్స్‌లేషన్’. వేర్వేరు భారతీయ భాషలు మాట్లాడే ఇద్దరు వ్యక్తులు ఈ పరికరం సహాయంతో చాలా సులభంగా సంభాషించుకోవచ్చు. ఉదాహరణకు ఒకరు తెలుగులో, మరొకరు హిందీ లేదా తమిళంలో మాట్లాడితే.. ఏఐ రియల్ టైమ్‌లో దానిని అనువదించి వినిపిస్తుంది.
నోట్స్ తయారీ నుంచి లైవ్ క్రికెట్ స్కోర్ వరకు..
ఈ జియో వేరబుల్ పరికరాలు కేవలం కమ్యూనికేషన్‌కే పరిమితం కాకుండా రోజువారీ పనులను మరింత సులభతరం చేస్తాయి:
ఏఐ నోట్ టేకింగ్ : ఆఫీస్ మీటింగ్‌లు, కాన్ఫరెన్స్‌లలో మాట్లాడే ముఖ్యమైన పాయింట్లను ఏఐ స్వయంచాలకంగా నోట్స్ రూపంలో రికార్డ్ చేస్తుంది.
లైవ్ క్రికెట్ కామెంట్రీ: మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా పనుల్లో నిమగ్నమైనప్పుడు నేరుగా లైవ్ క్రికెట్ స్కోరు, కామెంట్రీని మీ ఇయర్‌ఫోన్లు లేదా గ్లాసెస్ ద్వారా వినవచ్చు.
ఫోన్ స్క్రీన్ వాడకం తగ్గించడమే ప్రధాన లక్ష్యం..
ప్రస్తుతం మన జీవితాలు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు, కీబోర్డులకే పరిమితమైపోతున్నాయని, డిజిటల్ సేవల వినియోగాన్ని వాయిస్-ఆధారిత సంభాషణల వైపు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని జియో తెలిపింది. ప్రతి చిన్న పనికీ ఫోన్ వైపే చూడాల్సిన అవసరం లేకుండా, ఏఐ సాంకేతికతను సామాన్య భారతీయుడి ప్రాథమిక అవసరాలకు అనుగుణంగా మార్చడమే ఈ వేరబుల్స్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేసింది.
భారతీయ వినియోగదారుల అలవాట్లను, ప్రాంతీయ భాషల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియో రూపొందించిన ఈ ఏఐ గ్లాసెస్ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


