Lunar Eclipse: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమిండియా ప్రాక్టీస్ ఆలస్యంగా.. చెడు జరుగుతుందన్న భయంతో..
ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ సమరానికి ముందు టీమిండియా తన ట్రైనింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. మంగళవారం (మార్చి 3) ఏర్పడిన చంద్రగ్రహణం (lunar eclipse) కారణంగా, ప్రాక్టీస్ సెషన్‌ను ఒక గంట ఆలస్యంగా ప్రారంభించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.
చంద్రగ్రహణం ఎఫెక్ట్ టీమిండియా ప్రాక్టీస్ సెషన్ పైనా పడింది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరగనున్న హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరుకు భారత జట్టు సన్నద్ధమవుతోంది. అయితే మంగళవారం (మార్చి 3) జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ సమయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ అనూహ్యంగా మార్చింది. దీనికి కారణం మరేదో కాదు.. చంద్రగ్రహణం (lunar eclipse) కావడం గమనార్హం.

గ్రహణం వేళ అశుభమని భావించి..
నిజానికి మంగళవారం సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్ జరగాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం.. సాయంత్రం 6:47 గంటల వరకు కొనసాగింది. హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో శుభకార్యాలు లేదా ముఖ్యమైన పనులు చేయడం అరిష్టమని భావిస్తారు. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌కు ముందు ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదని కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
"సెమీఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌కు ముందు సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలని జట్టు భావిస్తోంది. గ్రహణ సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని భావించి, సెషన్‌ను ఒక గంట పాటు వాయిదా వేశాం" అని జట్టు వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6:40 గంటల తర్వాతే ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు.
దైవ దర్శనాల్లో టీమిండియా
ఈ ప్రపంచకప్ టోర్నీ పొడవునా భారత జట్టు సభ్యులు పలు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. సూపర్-8 మ్యాచ్‌కు ముందు గౌతమ్ గంభీర్ కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయాన్ని సందర్శించగా.. బుధవారం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయానికి వెళ్లేందుకు అతడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.
చరిత్ర సృష్టించే దిశగా భారత్
ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో భారత్ సరికొత్త చరిత్రకు చేరువలో ఉంది. ఒకవేళ భారత్ ఈసారి టైటిల్ గెలిస్తే.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు (డిఫెండింగ్ ఛాంపియన్‌గా) ట్రోఫీని గెలిచిన మొదటి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. అంతేకాకుండా సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన తొలి జట్టుగా కూడా భారత్ నిలుస్తుంది.
కోల్‌కతాలో జరిగిన సూపర్ 8 చివరి మ్యాచ్ లో సంజూ శాంసన్ (97 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను సెమీస్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరగబోయే ఈ మూడో సెమీఫైనల్ పోరులో (గతంలో 2022, 2024లోనూ తలపడ్డారు) విజయం ఎవరిని వరిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022లో ఇంగ్లండ్, 2024లో టీమిండియా గెలిచాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


