...
...
Next Story

Bike stunt : ప్రాణాలంటే లెక్క లేదు- బైక్‌పై విన్యాసాలు చేస్తూ ముగ్గురు సోదరులు బలి..

Madhya Pradesh bike stunt video : సరదా కోసం బైక్‌పై చేసిన విన్యాసాలు, సోషల్ మీడియా కోసం తీసిన వీడియో ఒకే కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాయి. మధ్యప్రదేశ్‌లో అతివేగంగా బైక్ నడుపుతూ ముగ్గురు సోదరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

Published on: Apr 20, 2026, 07:47:24 IST
Advertisement

నేటి యువతలో సోషల్ మీడియా 'రీల్స్' పిచ్చి ప్రాణాల మీదకు తెస్తోంది. కొద్ది సెకన్ల థ్రిల్ కోసం, లైకులు, వ్యూస్ కోసం చేస్తున్న సాహసాలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వైరల్ వీడియో కోసం ప్రాణాలాతో చెలగాటం..

బైక్​ స్టంట్​తో ప్రాణాలు తీసుకున్నారు.. (Screengrab)
బైక్​ స్టంట్​తో ప్రాణాలు తీసుకున్నారు.. (Screengrab)

ఈ ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన దృశ్యాలు మొబైల్ ఫోన్‌లో రికార్డయ్యాయి. మరణించిన ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై అతివేగంగా వెళ్తూ, ట్రాఫిక్‌లో ప్రమాదకరంగా వాహనాలను ఓవర్‌టేక్ చేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. వారి వెనకాలే మరో బైక్‌పై వస్తున్న ఇద్దరు స్నేహితులు.. వాళ్లేదో గొప్ప కార్యం చేస్తున్నట్టు, ఈ తతంగాన్నంతా షూట్ చేశారు.

ప్రమాద సమయంలో రెండు బైక్‌లు ఒకదానికొకటి పోటీ పడుతూ, జిగ్‌జాగ్ రీతిలో రోడ్డుపై వెళ్లాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బైక్ నడుపుతున్న యువకుల్లో ఒకరు చేతిలో పిస్టల్ పట్టుకుని గాలిలో చూపిస్తూ స్టంట్స్ చేయడం గమనార్హం. ఈ బాధ్యతారాహిత్యం చివరకు మృత్యువుకు దారితీసింది.

ఇటుకల లోడ్‌తో ఉన్న ట్రాలీని ఢీకొట్టి..

వీడియో రికార్డ్ అవుతున్న క్రమంలోనే, బైక్ నడుపుతున్న యువకులు ముందు వెళ్తున్న ఒక ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, అదే సమయంలో ముందు ఇటుకల లోడ్‌తో ఉన్న ఒక ట్రాలీ ఒక్కసారిగా వారి కళ్లముందుకు వచ్చింది. అతివేగంలో ఉండటం వల్ల బైక్‌ను నియంత్రించలేకపోయిన ఆ యువకులు, నేరుగా వెళ్లి ఆ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు.

ప్రమాదాన్ని చిత్రీకరిస్తూ వెనకాలే వెళ్లిన రెండో బైక్ కూడా ఈ క్రమంలో అదుపు తప్పింది. దానిపై ఉన్న ప్రశాంత్, ప్రదీప్ ద్వివేదిలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

ఈ మధ్యకాలంలో రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తూ వీడియోలు తీయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అయితే, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, హెల్మెట్ ధరించకపోవడం, పైగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ షూటింగ్‌లు చేయడం ప్రాణాంతకమని ఈ ఘటన హెచ్చరిస్తోంది. పిల్లల చేతికి వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు వారు ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఈ ఘోర ప్రమాదం ఎక్కడ జరిగింది?

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో ఏప్రిల్ 14న ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.

2. మరణించిన వారు ఎవరు?

ఒకే కుటుంబానికి చెందిన ఉపలక్ష్ కోల్, అమ్రీష్ కోల్, హేమరాజ్ కోల్ అనే ముగ్గురు సోదరులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

3. ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటి?

అతివేగం, అజాగ్రత్తగా వాహనాలను ఓవర్‌టేక్ చేయడం, వీడియో షూట్ చేస్తూ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు.

4. వీడియోలో పిస్టల్ కనిపించిందన్న వార్త నిజమేనా?

అవును, ప్రమాదానికి ముందు తీసిన వీడియోలో ఒక యువకుడు పిస్టల్ పట్టుకుని స్టంట్స్ చేస్తూ కనిపించాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks