ఇది AI ఇమేజ్​ కాదు! ఒక్కసారిగా.. 30 అడుగుల మేర కుంగిపోయిన రోడ్డు!

మధ్యప్రదేశ్​లో ఓ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది! ఫలితంగా 30 అడుగుల మేర భారీ గొయ్యి ఏర్పడింది. ఈ ఘటన అనంతరం రోడ్డు నిర్మాణాలపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

Published on: Oct 14, 2025, 06:00:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మధ్యప్రదేశ్‌లో సోమవారం మధ్యాహ్నం ఒక గ్రామం సమీపంలో ప్రధాన రహదారిలోని భారీ భాగం కుంగిపోయింది! 30 అడుగుల లోతైన పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ రోడ్డుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. రోడ్డు నిర్మాణంపై ప్రశ్నలు, సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

మధ్యప్రదేశ్​లో రోడ్డు పరిస్థితి ఇలా..
మధ్యప్రదేశ్​లో రోడ్డు పరిస్థితి ఇలా..

మధ్యప్రదేశ్​లో కుంగిపోయిన రోడ్డు- అసలేం జరిగింది?

ఈ ఘటన మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య మాండీదీప్ నుంచి ఇట్‌ఖేడి వెళ్లే వంతెన దగ్గర చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 100 మీటర్ల రోడ్డు ఒక్కసారిగా లోపలికి కుంగిపోయింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో అటువైపుగా ఎలాంటి వాహనాలు రాకపోకలు సాగించకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు, ప్రాణ నష్టం జరగలేదు.

గోడ కూలిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పదేళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన పరిస్థితిపై, రాష్ట్ర రహదారుల నిర్మాణంలో నాణ్యతపైనా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

భోపాల్ ఈస్టర్న్ బైపాస్​‌లోని బిల్ఖిరియా గ్రామం సమీపంలో ఉన్న ఈ రోడ్డు, మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో ఉంది. ఈ రోడ్డు ఇండోర్, హోషంగాబాద్, జబల్‌పూర్, జైపూర్, మాండ్లా, సాగర్ వంటి ముఖ్యమైన మార్గాలను కలుపుతుంది.

దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు..

రోడ్డు కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

"సుమారు 100 మీటర్ల రోడ్డు కుంగిపోయింది. దీని కారణంగా 30 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేసేందుకు మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రాథమిక పరిశీలనలో రీఇన్‌ఫోర్స్​డ్​ ఎర్త్ గోడ కూలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది! దర్యాప్తు నివేదిక విడుదలైన తర్వాతే ప్రమాదానికి గల అసలు కారణం స్పష్టమవుతుంది," అని ఎంపీఆర్‌డీసీ డివిజనల్ మేనేజర్ సోనాల్ సిన్హా ఒక జాతీయ మీడియాకు తెలిపారు.

నిర్మాణ లోపాలపై అనుమానాలు..

ఈ వంతెనను 2013లో నిర్మించారు. అయితే, నిర్మాణ సంస్థ ఎమ్/ఎస్ ట్రాన్స్‌ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడంలో విఫలం కావడంతో, 2020లో దాని టెండర్‌ను రద్దు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డు మార్గాన్ని అధికారికంగా నిర్వహించే బాధ్యత ఏ ఏజెన్సీకీ లేదు!

వంతెనను బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ నమూనాలో నిర్మించినట్లు అధికారులు ధృవీకరించారు. ట్రాన్స్‌ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ రద్దు తర్వాత, ఎంపీఆర్‌డీసీ నేరుగా పర్యవేక్షణ చేపట్టింది, అవసరమైన చిన్నపాటి మరమ్మత్తులను మాత్రం అవుట్‌సోర్సింగ్ ద్వారా చేయించింది.

సుఖీ సేవానియా ఆర్‌ఓబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జ్) వద్ద ఉన్న స్టేట్ హైవే-18పై ఒక వైపున ఉన్న ఆర్ఈ గోడకు జరిగిన నష్టం వల్లే ఈ రోడ్డు కూలిపోవడం జరిగిందని ప్రాథమిక సాంకేతిక నివేదిక వెల్లడించింది. సరిగ్గా లేని డ్రైనేజీ వ్యవస్థ, నిర్మాణంలో ఉన్న బలహీనత లేదా పర్యవేక్షణ లోపం వల్లే గోడ దెబ్బతిందా అనే కోణంలో ఇంజనీర్లు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు!

విచారణ కమిటీ ఏర్పాటు, కఠిన చర్యలకు హెచ్చరిక

మధ్యప్రదేశ్​లో ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఎంపీఆర్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్ బీఎస్ మీనా, జనరల్ మేనేజర్ మనోజ్ గుప్తా, జనరల్ మేనేజర్ ఆర్ఎస్ చందేల్తో కూడిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కూలిపోవడానికి గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి, దాని వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించారు.

"విచారణ నివేదికలో నిర్లక్ష్యం లేదా అక్రమాలు వెల్లడైతే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం," అని ఎంపీఆర్‌డీసీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో అడ్డుకట్టలు ఏర్పాటు చేసి, రోడ్డుకు ఒక వైపు పూర్తిగా మూసివేశారు. వాహనాలను దారి మళ్లించి పంపిస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచే మరమ్మత్తు పనులు, నేలను స్థిరీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

మంత్రి వ్యాఖ్యలు మళ్లీ చర్చకు..

ఈ రోడ్డు కుంగిపోయిన ఘటన, మధ్యప్రదేశ్‌లో రోడ్డు నిర్మాణాల నాణ్యతపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.

ఈ సందర్భంగా, ప్రజా పనుల శాఖ మంత్రి రాకేష్ సింగ్ మూడు నెలల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విమర్శకులు గుర్తు చేసుకుంటున్నారు: "గుంతలు పడని రోడ్డును నిర్మించగలిగే సాంకేతికత ఇంకా అభివృద్ధి కాలేదు. రోడ్లు ఉన్నంతవరకు, గుంతలు ఉంటూనే ఉంటాయి," అని ఆయన అన్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More