Mahindra Thar : గాల్లో ఎగిరి హైవే బోర్డులో ఇరుక్కుపోయిన మహీంద్రా థార్! వైరల్​ వీడియో వెనుక అసలు కథ ఇది..

ఓ హైవేపై ఉన్న ఒక భారీ సైన్ బోర్డులో మహీంద్రా థార్ ఎస్​యూవీ ఇరుక్కుపోయిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఇది నిజంగా జరిగిన ప్రమాదమా లేక ఏఐ మాయాజాలమా? ఫ్యాక్ట్ చెక్ వివరాలు మీకోసం..

Published on: Feb 20, 2026, 06:45:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. తాజాగా ఒక మహీంద్రా థార్ ఎస్​యూవీ, నేల నుంచి భారీ ఎత్తున ఉన్న హైవే ఎగ్జిట్ సైన్ బోర్డులో ఇరుక్కుపోయి ఉన్న దృశ్యం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

మహీంద్రా థార్​ వైరల్​ వీడియో..
మహీంద్రా థార్​ వైరల్​ వీడియో..

"దిల్లీ, గురుగ్రామ్, జైపూర్, ఎగ్జిట్ 22, ఎన్​హెచ్​-48" అని రాసి ఉన్న బోర్డు మధ్యలో కారు దూసుకుపోయినట్లు ఉన్న ఈ క్లిప్ చూసి నెటిజన్లు విస్మయానికి గురవుతున్నారు. అయితే దీని వెనుక అసలు నిజం తెలిస్తే షాక్​ అవుతారు.

అసలేం జరిగింది?

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి వేదికలపై ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. జైపూర్‌లో ఒక మహీంద్రా థార్ కారు అతివేగంతో వచ్చి గాల్లోకి ఎగిరి, హైవే బోర్డులో ఇరుక్కుపోయిందని, అది గంటల తరబడి అలాగే ఉండిపోయిందని కొన్ని పోస్టులు పేర్కొన్నాయి. మొదటి చూపులో ఈ దృశ్యం చాలా భయంకరంగా, వాస్తవంగా అనిపించినప్పటికీ.. నిశితంగా గమనిస్తే మాత్రం ఇందులో ఏదో తేడా ఉందనే అనుమానం రాక మానదు.

నెటిజన్ల రియాక్షన్: సీరియస్ కాదు.. కామెడీ!

వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భౌతిక శాస్త్రం ప్రకారం ఒక కారు అంత ఎత్తుకు ఎగిరి బోర్డులో అలా ఇరుక్కుపోవడం అసాధ్యమని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇది నిజమైన ప్రమాదంలా కాకుండా ఏదో వీడియో గేమ్‌లో వచ్చే ‘గ్లిచ్’ లాగా ఉందంటూ జోకులు పేలుస్తున్నారు.

మరికొందరు దీనిపై మీమ్స్‌ కూడా జచేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెక్: ఇది నిజమా? అబద్ధమా?

ఈ మహీంద్రా థార్​ వీడియోపై పెరుగుతున్న గందరగోళాన్ని నివృత్తి చేయడానికి వాస్తవ పరిశీలన (ఫ్యాక్ట్​ చెక్​) చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

నిజం ఏంటంటే: ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) నిర్వహించిన విచారణలో ఈ వీడియో పూర్తిగా నకిలీదని తేలింది.

సాంకేతికత: ఇది ఏఐ సాంకేతికతతో సృష్టించిన వీడియో. కేవలం ఆకర్షణ కోసం, వ్యూస్ కోసం ఎవరో కావాలనే దీనిని రూపొందించి సోషల్ మీడియాలో వదిలారు. అండ్​ వారి ప్రయత్నం ఫలించింది కూడా!

ఆధారాలు: వీడియోలో ఎక్కడా చలనం లేకపోవడం, కారు ఉన్న స్థితి భౌతిక సూత్రాలకు విరుద్ధంగా ఉండటం వల్ల ఇది కృత్రిమంగా సృష్టించినదని స్పష్టమైంది.

కాబట్టి, హైవే బోర్డులో థార్ ఇరుక్కుపోయిందనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇలాంటి ఏఐ జనరేటెడ్ వీడియోలను చూసి మోసపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఏఐ వీడియోని ఎలా పసిగట్టాలి?

నేటి ఏఐ కాలంలో ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పడం కష్టంగా మారింది. కానీ ఏఐ వీడియోని గుర్తించేందుకు కొన్ని సంకేతాలు ఉంటాయి. వైరల్ అయిన థార్ వీడియోలో లాగే, ఏఐ వీడియోల్లో వస్తువులు భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాయి. కారు గాల్లో తేలడం, నీడలు సరిగ్గా పడకపోవడం లేదా గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా వస్తువులు ఉండటం గమనిస్తే అది ఏఐ మాయాజాలమని అర్థం చేసుకోవచ్చు.

ఇక వీడియోలోని వ్యక్తులు కనురెప్పలు ఆర్పకపోవడం, వారి చర్మం ప్లాస్టిక్‌లా మెరుస్తూ ఉండటం లేదా నవ్వుతున్నప్పుడు ముఖ కండరాల్లో సహజత్వం లేకపోవడం వంటివి ఏఐ వీడియోల ప్రధాన లక్షణాలు. ముఖ్యంగా చేతి వేళ్లు, కాళ్లు కదులుతున్నప్పుడు అవి వింతగా లేదా అదనపు వేళ్లతో కనిపిస్తుంటాయి.

ఏఐ సృష్టించిన వీడియోలలో వెనుక వైపు ఉన్న దృశ్యాలు తరచుగా అస్పష్టంగా ఉంటాయి. అలాగే, బోర్డులపై ఉన్న అక్షరాలు చదవడానికి వీల్లేకుండా వింత ఆకారంలో ఉండటం లేదా ఒక అక్షరం మరొక అక్షరంలోకి కలిసిపోయినట్లు ఉండటం మీరు గమనించవచ్చు.

వీడియోలో మాటలకు, పెదవుల కదలికలకు (లిప్​ సింక్) పొంతన లేకపోవడం మరో సంకేతం. శబ్దం రోబోటిక్‌గా ఉన్నా లేదా శ్వాస తీసుకోవడం వంటి సహజమైన శబ్దాలు వినిపించకపోయినా అది డీప్ ఫేక్ లేదా ఏఐ వీడియో అయ్యే అవకాశం ఉంది.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా మహీంద్రా థార్ కారు గాల్లోకి ఎగిరి సైన్ బోర్డులో ఇరుక్కుపోవడం నిజంగా సాధ్యమేనా?

సమాధానం- భౌతిక శాస్త్రం ప్రకారం ఇది దాదాపు అసాధ్యం. ఒక కారు అంత ఎత్తులో ఉన్న బోర్డులోకి నేరుగా దూసుకువెళ్లి, అక్కడ స్థిరంగా ఇరుక్కుపోవడానికి అవసరమైన వేగం లేదా పరిస్థితులు సాధారణ రహదారిపై ఉండవు. ఇది చూడటానికి అచ్చం వీడియో గేమ్స్‌లో కనిపించే గ్రాఫిక్స్ లాగా ఉంది తప్ప, వాస్తవ ప్రమాదంలా లేదు.

ప్రశ్న- ఈ వీడియో జైపూర్ హైవేపై జరిగిన ప్రమాదానిదేనని వస్తున్న వార్తల్లో నిజమెంత?

సమాధానం- ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. జైపూర్ లేదా దేశంలోని మరే ఇతర ప్రాంతంలోనూ ఇలాంటి ప్రమాదం జరగలేదని 'ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా' (పీటీఐ) ధృవీకరించింది. ఈ వీడియోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి సృష్టించారు. కేవలం నెటిజన్లను ఆశ్చర్యపరచడానికి, తప్పుడు సమాచారంతో ఈ క్లిప్‌ను వైరల్ చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More