ఇతని పని.. ‘దురద గోకడం’- నవ్వకండి! నెల సంపాదన ఏకంగా రూ. 14లక్షలు

చైనాలో ఒక యువకుడు వినూత్నమైన ఆలోచనతో సరికొత్త బిజినెస్ మొదలుపెట్టాడు. ఒంటిపై దురద గోకే సర్వీస్ అందిస్తూ నెలకు రూ. 14 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. ఒత్తిడితో సతమతమయ్యే నగర వాసులకు ఈ వినూత్న స్పా విశ్రాంతినిస్తోందని అతను అంటున్నాడు.

Published on: Sep 4, 2026, 15:11:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచంలో రకరకాల వ్యాపారాలు చూసుంటాం కానీ, కేవలం ఒంటిపై దురద గోకడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించడం ఎప్పుడైనా విన్నారా? చైనాలోని ఒక యువకుడు సరిగ్గా ఇదే ఆలోచనతో రంగంలోకి దిగి కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు! దక్షిణ చైనాలోని షెన్‌జెన్ నగరానికి చెందిన 32ఏళ్ల జాంగ్ జియావోకియావో అనే యువకుడు 'సుమా' పేరుతో బ్రాండ్ ప్రారంభించి, కేవలం దురద గీకే షాపులు నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇతని పని.. ‘దురద గోకడం’!
ఇతని పని.. ‘దురద గోకడం’!

22026 మే నెలలో బావోయాన్ జిల్లాలో తన మొదటి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన జాంగ్, దానికి వచ్చిన విశేష ఆదరణతో మరుసటి నెలలోనే ఫుటియాన్ జిల్లాలో రెండో బ్రాంచ్‌ను తెరిచాడు. ప్రస్తుతం ఈ రెండు స్టోర్ల ద్వారా నెలకు 1,00,000 యువాన్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 14,06,505) నికర ఆదాయం పొందుతున్నాడు.

గోళ్లు తొడుక్కుని మరీ సర్వీస్.. గంటకు రూ. 3,500!

ఈ సెంటర్లలో సర్వీస్ అందించే తీరు ఎంతో విభిన్నంగా ఉంటుంది. సాధారణ మసాజ్ పార్లర్ల తరహాలోనే ఇక్కడ కస్టమర్లు బెడ్లపై బోర్లా పడుకుంటారు. ప్రత్యేకంగా తయారు చేసిన పదునైన కృత్రిమ గోళ్లను చేతులకు తొడుక్కుని సిబ్బంది.. కస్టమర్ల వీపుపై, ఒంటిపై ఎంతో సున్నితంగా గోకుతారు. గంట పాటు సాగే ఈ వినూత్న సర్వీస్ కోసం కస్టమర్ల నుంచి 300 యువాన్లు (సుమారు రూ. 3,500) వసూలు చేస్తున్నారు.

పెద్ద నగరాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారని, వారికి ఉపశమనం కలిగించడమే ఈ సేవ ముఖ్య ఉద్దేశమని జాంగ్ చెబుతున్నాడు. చైనాలో ఇప్పటివరకు ఇలాంటి బిజినెస్ మోడల్ లేకపోవడంతో, శరీరానికి హాని కలగకుండా హాయిగా ఉండేలా ప్రత్యేకమైన గీకుడు పద్ధతులను (స్క్రాచింగ్ టెక్నిక్స్) జాంగే స్వయంగా రూపొందించాడు.

ప్రస్తుతం ఇక్కడికి వచ్చే కస్టమర్లలో 70 శాతం మంది పురుషులే కావడం విశేషం. సాధారణ మసాజ్ కంటే ఇది ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తోందని, అందుకే మళ్లీ మళ్లీ వస్తున్నామని కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఒక చిన్న రీల్ ఇచ్చిన బిజినెస్ ఐడియా!

హుబెయ్ ప్రావిన్స్‌కు చెందిన జాంగ్ జీవితంలో ఎన్నో ఓటములను చూశాడు. డిగ్రీ పూర్తయ్యాక ఒకే ఏడాదిలో ఏడు రకాల ఉద్యోగాలు మారాడు. 30 ఏళ్ల వయస్సు రాకముందే క్రాస్ బోర్డర్ ఈ-కామర్స్ రంగంలో రెండు కంపెనీలు స్థాపించినా నష్టాలే మిగిలాయి. ఆ తర్వాత సోషల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టినా పెద్దగా ఫలితం లేకపోయింది.

ఇక గతేడాది సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుండగా, ఒక మహిళ తన భర్త వీపుపై దురద గోకుతున్న వీడియో కనిపించింది. ఆ వీడియో కింద "మాకు కూడా ఇలా గోకేవాళ్లు ఉంటే డబ్బులిచ్చి మరీ చేయించుకుంటాం" అని చాలామంది కామెంట్లు చేయడం జాంగ్ దృష్టిని ఆకర్షించింది. చిన్నతనంలో తన తండ్రి వీపు గోకితే హాయిగా నిద్రపోయిన జ్ఞాపకాలు కూడా గుర్తుకురావడంతో, తక్షణమే ఈ 'ఇచ్ స్క్రాచింగ్' బిజినెస్ ఐడియాను పట్టాలెక్కించాడు జాంగ్.

100 అవుట్‌లెట్లు తెరిచే దిశగా ప్రణాళికలు!

ప్రస్తుతం చాలామంది జాంగ్‌ను "దురద గీకడం కూడా ఒక ఉద్యోగమేనా?" అని విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలను అతడు పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా 100 అవుట్‌లెట్లను ప్రారంభించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాడు. అంతకంటే ముఖ్యంగా, 'దురద గోకడం' అనేది సమాజంలో అందరూ గౌరవించే ఒక అధికారిక వృత్తిగా గుర్తింపు పొందాలని అతడు కోరుకుంటున్నాడు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More