...
...
Next Story

సీబీఎస్‌ఈ నూతన ఛైర్మన్‌గా మన్‌దీప్ భండారీ నియామకం.. 4 నెలల్లోమూడో సారథి

డిజిటల్ మూల్యాంకన వివాదం నేపథ్యంలో సీబీఎస్‌ఈ నూతన ఛైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కే భండారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. గత నాలుగు నెలల్లో ఈ పదవిలో ముగ్గురు అధికారులు మారడం గమనార్హం.

Published on: Sep 26, 2026, 07:17:45 IST
Advertisement

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కొత్త ఛైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కే భండారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. డిజిటల్ మూల్యాంకన ప్రక్రియలో (ఆన్-స్క్రీన్ మార్కింగ్ - OSM) అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వివాదం తలెత్తిన నాటి నుంచి, గత నాలుగు నెలల వ్యవధిలోనే సీబీఎస్‌ఈకి మూడో ఛైర్మన్‌ను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వహించిన లోఖండే ప్రశాంత్ సీతారామ్ స్థానంలో భండారీ పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించనున్నారు.

సీబీఎస్‌ఈ నూతన ఛైర్మన్‌గా మన్‌దీప్ భండారీ నియామకం.. 4 నెలల్లోమూడో సారథి
సీబీఎస్‌ఈ నూతన ఛైర్మన్‌గా మన్‌దీప్ భండారీ నియామకం.. 4 నెలల్లోమూడో సారథి

కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) పరిధిలోని క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) సెప్టెంబర్ 25న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని సీబీఎస్‌ఈ ఛైర్మన్ పోస్టును తాత్కాలికంగా అదనపు కార్యదర్శి హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ, ఏజీఎమ్‌యూటీ (AGMUT) క్యాడర్‌కు చెందిన 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కే భండారీని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

వైద్యుడి నుంచి ఐఏఎస్ అధికారిగా..

పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ భండారీ వృత్తిరీత్యా వైద్యుడు (ఎంబీబీఎస్). సీబీఎస్‌ఈ ఛైర్మన్‌గా ఎంపిక కాకముందు ఆయన జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా, అలాగే శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డు సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2023 మార్చి 6న ఆయన జమ్మూకశ్మీర్ ఎల్జీ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు.

గతంలో 2009 నుంచి 2018 వరకు సుదీర్ఘకాలం పాటు దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థల్లో ఒకటైన శ్రీమాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు అదనపు సీఈఓగా సేవలు అందించారు. అనంతరం 2018 జనవరిలో కేంద్ర ప్రభుత్వంలోకి ప్రవేశించి, కేంద్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి వద్ద ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసారు. ఆ తర్వాత 2018 సెప్టెంబర్ నుంచి 2023 జనవరి వరకు నాలుగేళ్లకు పైగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రటరీగా కీలక విధాన నిర్ణయాల్లో పాలుపంచుకున్నారు.

నాలుగు నెలల్లో ముగ్గురు ఛైర్మన్లు

2026 బోర్డు పరీక్షల జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం (ఆన్-స్క్రీన్ మార్కింగ్ - OSM) ప్రక్రియలో తీవ్ర అక్రమాలు, సాంకేతిక లోపాలు చోటుచేసుకున్నాయంటూ మూల్యాంకనదారులు, అధికారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పేపర్లు స్కాన్ సరిగా కాకపోవడం వల్ల 12వ తరగతి విద్యార్థుల మార్కుల్లో వ్యత్యాసాలు రావడం, సాఫ్ట్‌వేర్ కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

ఈ వివాదంపై సమగ్ర విచారణ కోసం మాజీ కేంద్ర కార్యదర్శి ఎస్.రాధా చౌహాన్‌తో ఏకసభ్య విచారణ కమిటీని కూడా వేసింది. బోర్డు ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు సీబీఎస్‌ఈ అగ్ర నాయకత్వాన్ని ప్రభుత్వం వరుసగా ప్రక్షాళన చేస్తూ వస్తోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks