MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్ లాంచ్- రేంజ్, ఫీచర్లు అదుర్స్!
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా పండుగ సీజన్ సందర్భంగా అత్యంత ప్రజాదరణ పొందిన విండ్సర్ ఈవీలో 'ఇండల్జ్ ఎడిషన్'ను విడుదల చేసింది. రూ. 17.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన ఈ ప్రత్యేక మోడల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తమ విండ్సర్ ఈవీలో సరికొత్త వర్షన్‌ను ఆవిష్కరించింది. 'ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్' పేరిట పరిచయం చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 17,99,800గా నిర్ణయించారు. అత్యంత ప్రాచుర్యం పొందిన విండ్సర్ ఈవీ మోడల్ విక్రయాలు ప్రారంభమైన 24 నెలల్లోనే ఏకంగా 80,000 కు పైగా కుటుంబాల ఆదరణ పొందడం విశేషం. ఈ అపూర్వ విజయానికి ప్రతీకగా, ఈవీ ప్రియులకు మరింత విలాసవంతమైన అనుభూతిని అందించే లక్ష్యంతోనే ఈ కొత్త వేరియంట్/ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చారు.

ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్- డిజైన్..
విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్‌కు బాహ్య రూపురేఖల పరంగా సరికొత్త 'ష్యాడో గోల్డ్' బాడీ కలర్‌ను అందించారు. దీనికి కాంట్రాస్ట్‌గా ఆల్-బ్లాక్ రూఫ్‌ను జత చేయడంతో వాహనానికి స్పోర్టీ లుక్ వచ్చింది. బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్లు, 18-ఇంచుల బ్లాక్ అలాయ్ వీల్స్ కారు అందాన్ని మరింత పెంచుతున్నాయి. సీ-పిల్లర్ భాగంలో ప్రత్యేకంగా అమర్చిన 'INDULGE' బ్యాడ్జింగ్ ఈ మోడల్ ప్రత్యేకతను స్పష్టంగా తెలియజేస్తుంది.
దీనికి తోడు క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్లు, బాడీ సైడ్ మోల్డింగ్లతో కూడిన క్యూరేటెడ్ యాక్సెసరీస్ ప్యాకేజీని కూడా పొందుపరిచారు.
ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్- బిజినెస్ క్లాస్ క్యాబిన్..
ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్ క్యాబిన్ లోపలికి అడుగుపెడితే సరికొత్త ‘అర్బన్ టాన్ అండ్ బ్లాక్’ లేథరెట్ అప్హోల్స్టరీ కళ్లను ఆకట్టుకుంటుంది. ముందు సీట్ల హెడ్రెస్ట్లపై 'INDULGE' అక్షరాలను ఎంబ్రాయిడరీ చేశారు. వెనుక సీట్లలో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా 'ప్రివే స్క్రీన్' పేరుతో రూఫ్-మౌంటెడ్ వినోద స్క్రీన్‌ను అందించడం ఈ ఎడిషన్‌లోనే అతిపెద్ద విశేషం.
135 డిగ్రీల వరకు వంగే సామర్థ్యం ఉన్న ఏరో లాంజ్ సీట్లు, 'INDULGE' బ్రాండింగ్‌తో కూడిన ప్రీమియం పిల్లోలు, నెక్ కుషన్లు, వెనుక విండో సన్షేడ్లు, డ్యూయల్-థీమ్ 3డీ మ్యాట్లు, ప్రీమియం లేథర్ కీ కవర్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు విమానంలోని బిజినెస్ క్లాస్ స్థాయి సౌకర్యాన్ని అందిస్తాయి.
ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్ - బ్యాటరీ, రేంజ్..
సాంకేతిక వివరాలను పరిశీలిస్తే, ఈ ఎలక్ట్రిక్ కారులో నమ్మకమైన 38 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 136 బీహెచ్పీ పీక్ పవర్‌ను, 200 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 332 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణ రేంజ్‌ని అందిస్తుంది. 45 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వేగంగా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
"ఎలక్ట్రిక్ వాహనాల విపణిలోనే కాకుండా మా కంపెనీ ప్రయాణంలో ఎంజీ విండ్సర్ అత్యంత కీలకమైన ఉత్పత్తి. కేవలం 24 నెలల వ్యవధిలోనే 80,000కి పైగా కుటుంబాలకు చేరువకావడం సంతోషకరం. ఈ విజయాన్ని పురస్కరించుకుని తెచ్చిన ఇండల్జ్ ఎడిషన్ కస్టమర్ల వ్యక్తిగత ప్రాధాన్యతలకు తగినట్లుగా మరింత ప్రీమియం డిజైన్, మెరుగైన క్యాబిన్ అనుభూతిని అందిస్తుంది," అని లాంచ్ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులు, కుటుంబ సమేతంగా ప్రయాణించే వారికి మెరుగైన స్పేస్, వెనుక సీట్ వినోదం ఇచ్చే ఈ ఈవీ పండుగ సీజన్లో మంచి ప్రాధాన్యతగా మారనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


