3 రోజుల్లో 25% పెరిగిన మిల్కీ మిస్ట్ షేరు.. అసలు కారణమిదే

మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్స్ షేర్లు వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో దూసుకెళ్లాయి. బలమైన క్యూ1 ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Sep 3, 2026, 11:48:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మొత్తం స్టాక్ మార్కెట్ ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ, కొత్తగా లిస్టయిన మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్స్ షేరు మాత్రం రికార్డు లాభాలతో దూసుకెళ్తోంది. వరుసగా మూడు సెషన్లలో ఈ షేరు ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు తీసింది. గురువారం (సెప్టెంబర్ 3) ఉదయం బీఎస్ఈ మార్కెట్లో కంపెనీ షేరు దాదాపు 6 శాతానికి పైగా పెరిగి 268.75 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. దీంతో గత మూడు రోజుల్లోనే ఈ షేరు 27 శాతం మేర లాభపడింది.

3 రోజుల్లో 25% పెరిగిన మిల్కీ మిస్ట్ షేరు.. అసలు కారణమిదే
3 రోజుల్లో 25% పెరిగిన మిల్కీ మిస్ట్ షేరు.. అసలు కారణమిదే

షేర్ల ర్యాలీకి కారణం ఏంటి?

ఆగస్టు 31న మార్కెట్ పనివేళలు ముగిసిన తర్వాత మిల్కీ మిస్ట్ తన జూన్ త్రైమాసిక (Q1FY27) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. నాటి నుంచి అంటే సెప్టెంబర్ 1 మంగళవారం నుంచి కంపెనీ షేర్లు గ్రీన్ మార్క్‌లో కొనసాగుతున్నాయి. కంపెనీ ప్రకటించిన అద్భుతమైన క్యూ1 ఫలితాలే ఈ రికార్డు స్థాయి పెరుగుదలకు ప్రధాన కారణం.

కంపెనీ ఏకీకృత నికర లాభం (Consolidated PAT) ఏడాది ప్రాతిపదికన ఏకంగా 889.81 శాతం పెరిగి 64.68 కోట్లకు చేరింది. ఉత్పత్తుల విక్రయాలు జోరందుకోవడంతో కంపెనీ నిర్వహణ ఆదాయం కూడా 43.6 శాతం పెరిగి 973.45 కోట్లను తాకింది.

ఇక కంపెనీ ఈబిట్డా (EBITDA) 74.5 శాతం పెరిగి 144.89 కోట్లకు చేరగా, ఈబిట్డా మార్జిన్ గతేడాది ఉన్న 12.24 శాతం నుంచి 14.88 శాతానికి మెరుగుపడింది. విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల విభాగాన్ని విస్తరించడం, బ్రాండ్ ప్రాబల్యాన్ని పెంపొందించడం, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది.

యాజమాన్యం వ్యాఖ్యలు

"2027 ఆర్థిక సంవత్సరంలో లాభదాయకమైన వృద్ధిని సాధించడమే మా ప్రధాన లక్ష్యం. ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడం, తయారీ, పంపిణీ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాం. విలువ ఆధారిత డెయిరీ ఉత్పత్తులను మరింత పెంచి, కొత్త మార్కెట్లలో విస్తరిస్తాం" అని మిల్కీ మిస్ట్ డెయిరీ హోల్-టైమ్ డైరెక్టర్, సీఈఓ కే రత్నం పేర్కొన్నారు.

"కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతూ, భవిష్యత్ వృద్ధికి అవసరమైన పెట్టుబడులు పెడుతున్నాం. ఎఫ్‌ఎంసీజీ (FMCG) రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించగలమని నమ్మకంతో ఉన్నాం" అని రత్నం వివరించారు.

విశ్లేషకులు ఏమంటున్నారు?

ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ సీమా శ్రీవాత్సవ ఈ షేరు ప్రదర్శనపై స్పందించారు. "కేవలం పాలు మాత్రమే కాకుండా, విలువ ఆధారిత డెయిరీ ఉత్పత్తుల వైపు దృష్టి పెట్టడమే కంపెనీ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారింది. 2024-26 ఆర్థిక సంవత్సరాల మధ్య కంపెనీ రెవెన్యూ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) 31.26 శాతంగా నమోదై 3,138.36 కోట్లకు చేరింది" అని శ్రీవాత్సవ వివరించారు.

"తమిళనాడులోని పెరుందూరై వద్ద ఉన్న ఆటోమేటెడ్ ప్లాంట్, 74,600 మందికి పైగా రైతుల నుంచి నేరుగా పాలు సేకరించే వ్యవస్థ, ఐపీఓ ద్వారా సమీకరించిన 1,428- 1,475 కోట్ల నిధులతో అప్పుల తగ్గింపు, ప్లాంట్ విస్తరణ వంటి అంశాలు కంపెనీ ఫండమెంటల్స్‌ను బలపరిచాయి" అని ఆమె తెలిపారు.

అయితే వ్యాల్యుయేషన్ల పరంగా జాగ్రత్తగా ఉండాలని సీమా హెచ్చరించారు. "ఐపీఓ సమయానికి FY26 EPS 1.65 ప్రాతిపదికన P/E నిష్పత్తి 84.86 వద్ద ఉంది. 254 ధర వద్ద వ్యాల్యుయేషన్ కాస్త ఎక్కువగా అనిపిస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన 10 రెట్ల వృద్ధి ప్రతీసారి పునరావృతం కాకపోవచ్చు. దక్షిణాది మార్కెట్లకే పరిమితం కావడం, తమిళనాడు పాల సేకరణపైనే ఎక్కువగా ఆధారపడటం వంటివి రిస్క్ అంశాలు. ఇప్పటికే ఐపీఓలో షేర్లు వచ్చిన వారు వీటిని హోల్డ్ చేయడం మంచిది. కానీ, ఈ రికార్డు స్థాయిల వద్ద కొత్తగా అగ్రెసివ్‌గా కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదు" అని ఆమె అభిప్రాయపడ్డారు.

షేరు ట్రెండ్ ఎలా ఉంది?

ఆగస్టు 18న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో మిల్కీ మిస్ట్ షేర్లు లిస్టయ్యాయి. ఐపీఓ ఆఫర్ ధర 140 కాగా, ప్రస్తుతం రేటు 268.75 వద్ద ఉంది. అంటే కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఇన్వెస్టర్లకు దాదాపు 92 శాతానికి పైగా రిటర్న్స్ అందించడం గమనార్హం.

(గమనిక: ఈ విశ్లేషణ కేవలం సమాచారం, అవగాహన కోసం మాత్రమే. విశ్లేషకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వారి సొంతం. ఇన్వెస్టర్లు ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందైనా సెబీ రిజిస్టర్డ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More