ముస్లింలు ఆర్ఎస్ఎస్లో చేరొచ్చా? మోహన్ భాగవత్ సమాధానం ఇది..
ఆర్ఎస్ఎస్లో ముస్లింలు, క్రైస్తవులు చేరొచ్చా? అన్న ప్రశ్నకు సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టతనిచ్చారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చరిత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
"రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో ముస్లింలు చేరవచ్చా?" అని చాలా కాలంగా చాలా మంది మనసులో ఉన్న ప్రశ్నకు మోహన్ భాగవత్ సమగ్రమైన సమాధానం ఇచ్చారు.

"సంఘ్ ప్రయాణం 100 ఏళ్లు: కొత్త దిశలు" అనే శీర్షికతో రెండు రోజుల పాటు జరిగిన ఉపన్యాస శ్రేణిలో పాల్గొన్న సందర్భంగా భాగవత్ ఈ విషయాలను స్పష్టం చేశారు. సంఘ్ ముస్లింలు, క్రైస్తవులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తెరిచే ఉంటుందని, అయితే దానికి ఒక షరతు ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ వివరించారు.
సంఘ్‌లో చేరడానికి షరతు ఏంటి?
ప్రతి ఒక్కరూ భరతమాత సంతానంగా తమను తాము భావించుకొని, విస్తృతమైన హిందూ సమాజానికి కట్టుబడి ఉంటే, వారు సంఘ్‌లోకి రావచ్చని భాగవత్ తెలిపారు.
"సంఘ్‌లో బ్రాహ్మణులకు అనుమతి లేదు. ఇతర కులాల వారికి అనుమతి లేదు. సంఘ్‌లో ముస్లింలకు అనుమతి లేదు. క్రైస్తవులకు అనుమతి లేదు. హిందువులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కాబట్టి, వేర్వేరు మతాలకు చెందిన వారు, ముస్లింలు, క్రైస్తవులు, ఏ మతానికి చెందినవారైనా సంఘ్‌లోకి రావచ్చు. కానీ మీ ప్రత్యేకతను బయట పెట్టకూడదు. మీ ప్రత్యేకతను స్వాగతిస్తాము. కానీ మీరు శాఖలోకి వచ్చినప్పుడు, మీరు భరతమాత సంతానంగా, ఈ హిందూ సమాజంలో సభ్యులుగా వస్తారు," అని భాగవత్ స్పష్టం చేశారు.
శాఖలలో అన్ని వర్గాల భాగస్వామ్యం
అన్ని కులాల వారు, ముస్లిం లేదా క్రైస్తవ నేపథ్యం ఉన్నవారు కూడా ఆర్ఎస్ఎస్ స్థానిక విభాగాలైన శాఖలకు వస్తారని ఆయన మరింత వివరించారు.
"ముస్లింలు శాఖకు వస్తారు, క్రైస్తవులు శాఖకు వస్తారు. సాధారణంగా హిందూ సమాజంగా పిలిచే మిగతా కులాల వారు కూడా శాఖకు వస్తారు. కానీ మేము వారి లెక్కలు తీసుకోము, వారు ఎవరో అడగము. మనమందరం భరతమాత సంతానమే. సంఘ్ ఇలాగే పనిచేస్తుంది," అని ఆయన పేర్కొన్నారు.
ఐక్యత మరియు సమ్మిళితం (Inclusivity) అనే భావనపై ఆధారపడి, భారత జాతీయ గుర్తింపు అనే ఆలోచనతో సంఘ్ యొక్క విధానం ఉందని ఆయన వివరించారు.
సంఘ్ చట్టపరమైన హోదాపై భాగవత్ వివరణ
ఆర్ఎస్ఎస్ చట్టపరమైన హోదా గురించి కూడా మోహన్ భాగవత్ ప్రస్తావించారు. దాని సుదీర్ఘ చరిత్రను చెబుతూ.. "సంఘ్ 1925లో ప్రారంభమైంది. మేము బ్రిటిష్ ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకోవాలని మీరు ఆశిస్తున్నారా? ఎవరికి వ్యతిరేకంగా? మా మీద 3సార్లు నిషేధం పడింది. కాబట్టి, ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. మేము లేకపోతే, వారు ఎవరిని నిషేధిస్తారు? ప్రతిసారీ కోర్టులు నిషేధాన్ని కొట్టివేసి, ఆర్ఎస్ఎస్ని చట్టబద్ధమైన సంస్థగా మార్చాయి," అని అన్నారు.
ఆర్ఎస్ఎస్ దృక్పథాన్ని వివరిస్తూ, సంఘ్ ప్రధాన లక్ష్యం – ధర్మ సూత్రాల ద్వారా ప్రపంచానికి శాంతి, సంతోషం వైపు మార్గనిర్దేశం చేయగల శక్తివంతమైన, బలమైన భారతదేశాన్ని నిర్మించడానికి హిందూ సమాజాన్ని వ్యవస్థీకరించడం, సాధికారత కల్పించడం అని భాగవత్ తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


