Canada deportation : భారతీయులపై పగబట్టేసిన కెనడా! ఎన్నడూ లేని విధంగా డిపోర్టేషన్లు..

Indian students in Canada : కెనడాలో వలస నిబంధనలు కఠినతరం కావడంతో భారతీయుల బహిష్కరణలు పెరిగాయి. 2026 ప్రథమార్థంలోనే, అంటే 6 నెలల్లో 3,323 మంది భారతీయ పౌరులను కెనడా ప్రభుత్వం వెనక్కి పంపించేసింది.

Published on: Aug 9, 2026, 07:29:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వలస నిబంధనలను శరవేగంగా మారుస్తున్న కెనడా ప్రభుత్వం.. భారతీయ పౌరుల బహిష్కరణలో సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. 2026 మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 3,323 మంది భారతీయులను ఆ దేశం వెనక్కి పంపింది. గతేడాది మొత్తం మీద 3,779 మందిని బహిష్కరించగా, కేవలం ఆరు నెలల్లోనే ఆ సంఖ్యను దాదాపుగా చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదే వేగం కొనసాగితే, గత ఆరేళ్లలో ఎన్నడూ లేనన్ని అత్యధిక బహిష్కరణలు ఈ ఏడాదే నమోదయ్యే ప్రమాదం ఉంది.

భారతీయులను వెనక్కి పంపించేస్తున్న కెనడా..
భారతీయులను వెనక్కి పంపించేస్తున్న కెనడా..

గత గణాంకాలను పరిశీలిస్తే ఈ పెరుగుదల స్పష్టంగా తెలుస్తుంది. 2021లో 603 మందిని, 2022లో 786 మందిని, 2023లో 1,132 మందిని, అలాగే 2024లో 2,004 మందిని కెనడా బహిష్కరించింది. అంటే, గడచిన నాలుగేళ్లలో (2021-2024 మధ్య) ఏ ఒక్క సంవత్సరంలో లేనంత మంది భారతీయులు.. కేవలం 2026 ప్రథమార్థంలోనే స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. అంతేకాకుండా, మెక్సికోను వెనక్కి నెట్టి ఈ ఏడాది కెనడాలో అత్యధికంగా బహిష్కరణకు గురవుతున్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానానికి చేరింది. గత ఐదేళ్లుగా మెక్సికో తొలి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానానికి పరిమితమయ్యేది.

భారతీయుల బహిష్కరణకు అసలు కారణాలు ఏంటి?

వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండటం, శరణార్థి దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పాటించకపోవడం, వీసా మోసాలకు పాల్పడటం వంటి పలు ఉల్లంఘనల కారణంగా భారతీయ పౌరులను కెనడా వెనక్కి పంపుతోంది.

కెనడా బార్డర్ సర్వీసెస్ ఏజెన్సీ ఈ బహిష్కరణల వివరాలను నమోదు చేస్తున్నప్పటికీ, ఏ దేశంవారికీ ప్రత్యేక కారణాలను విడిగా వెల్లడించడం లేదు. అయితే, అంతర్జాతీయ విద్యార్థులతో కళకళలాడిన కెనడా విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన చర్యలు చేపట్టారు.

ఇంకా వేలాది మంది భారతీయులు క్యూలో..!

అధికారిక గణాంకాల ప్రకారం.. కెనడాలో ప్రస్తుతం బహిష్కరణ ప్రక్రియ ఎదుర్కొంటున్న జాబితాలోనూ భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఏకంగా 7,669 మంది భారతీయులు ఈ జాబితాలో ఉండి, స్వదేశానికి వెనక్కి వెళ్లేందుకు నిరీక్షిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే, బహిష్కరణల పర్వం ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.

కెనడా ప్రభుత్వం ప్రధానంగా మూడు రకాల బహిష్కరణ ఆదేశాలను అమలు చేస్తోంది.

  • స్వచ్ఛందంగా 30 రోజుల్లోగా దేశం విడిచివెళ్లాలని డిపార్చర్ ఆర్డర్ కోరుతుంది.
  • నిర్దిష్ట కాలం (సాధారణంగా 1 నుంచి 5 సంవత్సరాలు) పాటు తిరిగి దేశంలోకి అడుగుపెట్టకుండా ఎక్స్‌క్లూజివ్ ఆర్డర్ నిషేధిస్తుంది.
  • కెనడా ప్రభుత్వ నుంచి రాతపూర్వక అనుమతి పొందితేనే తప్ప ఎప్పటికీ తిరిగి రానివిధంగా డిపోర్టేషన్ ఆర్డర్ శాశ్వత నిషేధం విధిస్తుంది.

అమెరికా గణాంకాలతో పోల్చినా కెనడా చర్యలు విపరీతంగా కనిపిస్తున్నాయి. జనవరి 1 నుంచి జులై 22 మధ్య అమెరికా నుంచి 1,273 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారని గత నెలలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కానీ కెనడా మాత్రం కేవలం ఆరు నెలల్లోనే దానికి రెండున్నర రెట్లు అధికంగా భారతీయులను సాగనంపింది.

కరిగిపోతున్న 'కెనడా కల'!

ఒకవైపు బహిష్కరణల వేడి పెరుగుతుంటే, మరోవైపు భారతీయ విద్యార్థుల్లో కెనడాపై ఆసక్తి వేగంగా మసకబారుతోంది. కెనడాను ఎంచుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2023లో 2,33,532 ఉండగా, 2024 నాటికి అది 1,37,608కి, అంటే సుమారు 41 శాతం పడిపోయింది.

కఠినతరమైన వలస విధానాలు, విపరీతంగా పెరిగిన జీవన వ్యయం, కఠినమైన ఆర్థిక నిబంధనలు, 2023లో భారత్-కెనడా మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలు వంటి కారణాలన్నీ కలిసి విద్యార్థులను వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి. ముఖ్యంగా 2024 ప్రారంభంలో అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సులపై కెనడా ప్రభుత్వం రెండేళ్ల పరిమితి విధించడం పెద్ద మలుపు తిప్పింది. ప్రధాన నగరాల్లో అద్దెలు భారీగా పెరిగిపోవడం, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు దొరకకపోవడంతో భవిష్యత్తుపై విద్యార్థుల్లో అభద్రతాభావం నెలకొంది.

అంతర్జాతీయ విద్యార్థుల రాకపోకలు దాదాపు 60 శాతం వరకు తగ్గాయని, మరింత సుస్థిరమైన వ్యవస్థను రూపొందించే క్రమంలో వలసల మీద మళ్లీ నియంత్రణ సాధించామని కెనడా వర్గాలు చెబుతున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More