సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం- మృతులు తెలంగాణ వాసులు! సీఎం రేవంత్​ స్పందన

సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు ఓ ట్యాంకర్​ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందారు.

Published on: Nov 17, 2025, 09:37:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళుకున్న ఉమ్రా యాత్రికులతో కూడిన బస్సు.. ఓ డీజిల్​ ట్యాంకర్​ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 45 మంది హైదరాబాద్ యాత్రికులు సజీవ దహనం అయ్యారు! స్థానిక మీడియా నివేదికల ప్రకారం, మరణించిన వారంతా హైదరాబాదీలే.

మక్కా నుంచి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదం.. (HT_PRINT)
మక్కా నుంచి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదం.. (HT_PRINT)

తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారు హైదరాబాద్ నివాసితులేనని ప్రాథమిక సమాచారం అందినట్లు తెలిపారు. వీరంతా మాలెపల్లిలోని బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన వారని, మృతుల వివరాలను అధికారులు ఇంకా ధృవీకరిస్తున్నారని ఆయన చెప్పారు.

బాధితుల బంధువు ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బృందం నవంబర్ 9న హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లింది. మక్కాలో ఉమ్రా ప్రార్థనలు పూర్తి చేసుకుని మదీనాకు తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

యాత్రకు వెళ్లిన వారందరు నాంపల్లిలోని అల్ మీనా, అల్ మక్కా ట్రావెల్స్ ద్వారా ప్రయాణించారు.

కేంద్రం సహాయం: విదేశాంగ మంత్రి స్పందన

భారతీయ పౌరులు ప్రయాణిస్తున్న బస్సుకు మదీనా సమీపంలో ప్రమాదం జరగడం పట్ల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ "తీవ్ర దిగ్భ్రాంతి" వ్యక్తం చేశారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్, బాధితులకు, వారి కుటుంబాలకు "పూర్తి సహాయ సహకారాలను" అందిస్తున్నాయని ఆయన తెలిపారు. "శోకసంద్రంలో ఉన్న కుటుంబాలకు" తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు.

జెడ్డా కాన్సులేట్ హెల్ప్‌లైన్

ఈ దుర్ఘటన కారణంగా ప్రభావితమైన వారి కుటుంబాల కోసం జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం ఒక హెల్ప్‌లైన్ నంబర్​ని ప్రకటించింది. ఈ విషయాన్ని 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, "సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో భారతీయ ఉమ్రా యాత్రికులకు సంబంధించిన విషాదకర బస్సు ప్రమాదం దృష్ట్యా, జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్‌లో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. హెల్ప్‌లైన్ సంప్రదింపు వివరాలు: ట్రూ ఫ్రీ నంబర్- 8002440003" అని తెలిపింది.

తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి దిగ్భ్రాంతి..

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సుకు జరిగిన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వార్తలపై వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలు చేసేందుకు రంగంలోకి దిగాలని అదేశించారు.

సీఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు దిల్లీలో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్​ను అప్రమత్తం చేశారు. సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు.

సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్లోను ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్​లో ఈ కింద ఇచ్చిన నెంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు.

కంట్రోల్​ రూమ్​ నెంబర్లు

  • +91 79979 59754
  • +91 99129 19545

వెంటనే సాయం చేయండి: అసదుద్దీన్​ ఓవైసీ

సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం కేంద్రాన్ని కోరారు.

రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అబు మాథెన్ జార్జ్​తో తాను మాట్లాడానని, "వారు ఈ విషయంపై సమాచారాన్ని సేకరిస్తున్నారని" ఒవైసీ తెలిపారు. తాను హైదరాబాద్‌కు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించి, ప్రయాణికుల వివరాలను రియాద్ ఎంబసీ, విదేశాంగ కార్యదర్శికి పంపినట్లు ఆయన వెల్లడించారు.

కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఓవైసీ అభ్యర్థిస్తూ, "కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్‌ను నేను అభ్యర్థిస్తున్నాను. మృతదేహాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి, ఎవరైనా గాయపడి ఉంటే, వారికి తగిన వైద్య చికిత్స అందించడానికి చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More