Muhurat Trading అంటే ఏంటి? ఈ ఏడాది ఎప్పుడు జరుగుతుంది?
Muhurat Trading : ముహురత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ఏడాది ఎప్పుడు జరుగుతుంది? ముహురత్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? దీపావళికి స్టాక్ మార్కెట్ల సెలవు ఎప్పుడు లభిస్తోంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 20, సోమవారం నాడు జరుపుకుంటున్నారు. అయితే, ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ప్రతీ ఏటా శుభప్రదమైన ముహురత్ ట్రేడింగ్ సెషన్ మాత్రం దీపావళి రోజున ఉండదు.

నిజానికి, అక్టోబర్ 20, సోమవారం నాడు దళాల్ స్ట్రీట్ (స్టాక్ మార్కెట్) యథావిధిగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు సాధారణ ట్రేడింగ్‌కు తెరిచే ఉంటుంది. ఆ తర్వాత, అక్టోబర్ 21, మంగళవారం నాడు మాత్రమే ఈ ముహురత్ ట్రేడింగ్ సెషన్ జరగనుంది.
ముహురత్ ట్రేడింగ్ 2025: సమయం, తేదీ, ఇతర వివరాలు..
ఎక్స్ఛేంజీల నుంచి అందిన సర్క్యులర్ ప్రకారం, ముహురత్ ట్రేడింగ్ అక్టోబర్ 20, సోమవారం కాకుండా, అక్టోబర్ 21, మంగళవారం నాడు జరగనుంది. ఆ రోజున, గంటపాటు జరిగే ట్రేడింగ్ సెషన్ మినహా ఇండియన్ స్టాక్ మార్కెట్ పూర్తిగా మూసివేసి ఉంటుంది.
సాధారణంగా ముహురత్ ట్రేడింగ్ సాయంత్రం వేళల్లో జరుగుతుంటుంది. అయితే ఈ ఏడాది ఆ ట్రెండ్‌కు భిన్నంగా, ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు జరగనుంది.
సర్క్యులర్ ప్రకారం, ముందుగా 15 నిమిషాల ప్రీ-ఓపెన్ సెషన్ మధ్యాహ్నం 1:30 నుంచి 1:45 వరకు ఉంటుంది. ఆ తర్వాత సాధారణ ట్రేడింగ్ సెషన్ మొదలవుతుంది.
మరోవైపు దీపావళి బలిప్రతిపద సందర్భంగా అక్టోబర్ 22, బుధవారం నాడు కూడా ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు ఉంటుంది!
అసలు ముహురత్ ట్రేడింగ్ అంటే ఏమిటి?
ముహురత్ ట్రేడింగ్ అనేది ఒక సాధారణ ట్రేడింగ్ రోజు మాదిరిగానే పూర్తి నియమాలతో నిర్వహించే ఒక ప్రత్యేకమైన, గంటపాటు జరిగే సెషన్.
దీపావళి పండుగ కొత్త సంవత్సరాన్ని (సంవత్) సూచిస్తుంది. కాబట్టి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం శుభసూచకంగా భావించి, పెట్టుబడిదారులు తరచుగా ఈ టోకెన్ ట్రేడింగ్ సెషన్‌లో పాల్గొంటారు. ముహురత్ ట్రేడింగ్ సమయంలో ట్రేడింగ్ వాల్యూమ్స్ సాధారణంగా తక్కువగా ఉంటాయి.
అనేక మంది పెట్టుబడిదారులు ఈ రోజున దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్స్ని చేస్తుంటారు.
ముహురత్ ట్రేడింగ్‌లో మార్కెట్ ఎలా స్పందిస్తుంది?
హిస్టరీని చూస్తే, గత ఐదు ముహురత్ ట్రేడింగ్ సెషన్లలో (2020–2024), నిఫ్టీ50 స్థిరంగా పాజిటివ్‌లో ముగిసింది. ప్రతి సందర్భంలోనూ 0.40% నుంచి 0.90% పరిధిలో లాభాలను నమోదు చేసింది.
ఈ సంవత్సరం కూడా, అనుకూలమైన టెక్నికల్ ఇండికేటర్లు, మెరుగుపడుతున్న ఫండమెంటల్స్ కలగలిసి, మార్కెట్ సెంటిమెంట్ ఆశాజనకంగా ఉంది.
ముహురత్ ట్రేడింగ్ వ్యూహం..
"నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించే వ్యక్తులకు జీరో ఆదాయపు పన్ను, నాలుగు-శ్రేణుల జీఎస్టీ నిర్మాణాన్ని రెండు ప్రధాన శ్లాబ్‌లుగా హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, దేశీయ వినియోగాన్ని ఉత్తేజపరిచే దిశగా ప్రభుత్వ విధానం బలంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి," అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ ఏవీపీ, విష్ణు కాంత్ ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.
"దీని ఫలితంగా, కన్జ్యూమర్-ఆధారిత స్టాక్‌లపై దృష్టి పెట్టొచ్చు," అని ఆయన తెలిపారు.
టెక్నికల్స్ని చూస్తే, నిఫ్టీ 50 విస్తృత దృక్పథం నిర్మాణాత్మకంగా ఉందని, అందువల్ల "బై ఆన్ డిప్స్" అనే వ్యూహం ప్రబలంగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 25000–24800 జోన్ వైపు ఏదైనా దిద్దుబాటు వస్తే, తాజా లాంగ్ పొజిషన్‌లను ప్రారంభించడానికి ఇది ఒక అవకాశాన్ని అందిస్తుంది. ప్రారంభ అప్‌సైడ్ టార్గెట్‌లు 25650–25700 స్థాయిల వద్ద ఉండవచ్చని కాంత్ సలహా ఇచ్చారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


