Nana Patekar net worth : నానా పటేకర్ ఈజ్ రియల్ హీరో! నెలకు రూ. 35 సంపాదన నుంచి కోట్లల్లో ఆస్తుల వరకు..
బాలీవుడ్, మరాఠీ సినిమాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో నెలకు రూ. 35 సంపాదన నుంచి కోట్లల్లో ఆస్తులను వెనకేసుకున్న ఆయనపై ప్రత్యేక కథనం..
విలక్షణ నటుడు, గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి, యావత్ భారత దేశం ప్రేమించే నానా పటేకర్ కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో గుండెపోటు కారణంగా గురువారం ఉదయం 75ఏళ్ల నానా పటేకర్ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారన్న వార్త కోట్లాది మంది భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇందుకు కారణం ఆయనకున్న గొప్ప వ్యక్తిత్వం!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ రాగానే కోట్ల రూపాయల లగ్జరీ కార్లు, భారీ విల్లాలు, ఆర్భాటపు జీవితం గడపడం సర్వసాధారణం. కానీ, దశాబ్దాలుగా బాలీవుడ్, మరాఠీ చిత్రసీమలో తిరుగులేని నటుడిగా వెలుగొందిన నానా పటేకర్ తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తన అద్భుత నట విశ్వరూపంతో మూడు జాతీయ అవార్డులు, పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈ సీనియర్ నటుడు, కోట్ల ఆస్తి ఉన్నా ఎంతో సాదాసీదాగా జీవిస్తూ నిజమైన ప్రజా నటుడిగా నిలిచారు.
నానా పటేకర్ మరణం నేపథ్యంలో ఆయన నెట్ వర్త్కి సంబంధించిన విషయాలు..
రూ. 50 కోట్ల నుంచి 80 కోట్ల దాకా నెట్ వర్త్..
నానా పటేకర్ సాధించిన ఆర్థిక పురోగతి వెనుక ఆయన దశాబ్దాల కష్టం ఉంది! అధికారిక లెక్కలు బయటకు రాకపోయినప్పటికీ, వివిధ మీడియా నివేదికల ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ రూ. 50 కోట్ల నుంచి రూ. 80 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఒకప్పుడు సినిమాకు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న పటేకర్, యాడ్స్ ద్వారా కూడా మంచి రాబడి పొందారు.
అయితే, తొలినాళ్లల్లో ఆయన నెలకు రూ. 35 సంపాదించేవారు! ఆ సమయంలో చాలా కష్టాలు చూశారు. అక్కడి నుంచి కోట్లల్లో సంపాదన పొందడం వెనుక కచ్చితంగా ఆయన కష్టం ఎంతో ఉంది. ఇది నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
“అప్పుడు నా వయస్సు 13ఏళ్లే. సినిమా పోస్టర్లు పెయింటింగ్ చేసేవాడిని. ఆలా భోజనం, నెలకు రూ. 35 సంపాదించేవాడిని,” అని 1998లో ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
బాలీవుడ్‌లో 'పరిందా', 'క్రాంతివీర్', 'అగ్నిసాక్షి', 'ఖామోషి', 'అబ్ తక్ ఛప్పన్', 'అపహరణ్', 'రాజ్‌నీతి', 'వెల్కమ్' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ప్రతినాయకుడిగా, హీరోగా, కామెడీ నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు నానా పటేకర్.
భారతీయ చిత్రసీమకు ఆయన చేసిన సేవలకు గాను 2013లో కేంద్ర ప్రభుత్వం ఆయనను 'పద్మశ్రీ'తో సత్కరించింది.
ఆస్తులు ఉన్నా ఆర్భాటం లేని జీవితం..
ముంబైలో కోట్లాది రూపాయల విలువైన ఇల్లు, గోవాలో నివాసంతో పాటు ఆడీ క్యూ7, మహీంద్రా వాహనాలు ఆయన వద్ద ఉన్నాయి. అయితే, ఎంత సంపాదించినా గ్లామర్ ప్రపంచపు మెరుపులకు నానా పటేకర్ ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. సాధారణ రైతులా పొలాల్లో పనిచేయడం, సాదాసీదా దుస్తుల్లో కనిపిస్తూ ప్రజా సేవకే ఎక్కువ సమయం కేటాయించడం ఆయన ప్రత్యేకత.
రైతుల కోసం 'నామ్ ఫౌండేషన్' సేవలు..
రైతుల సంక్షేమం కోసం నానా పటేకర్ ‘నామ్ ఫౌండేషన్’ స్థాపించి అండగా నిలుస్తున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న రైతు కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు.
"లగ్జరీ కారు కోసం రూ. 1.5 కోట్లు ఖర్చు చేయడం కంటే, ఆ డబ్బుతో కష్టాల్లో ఉన్న వందలాది రైతు కుటుంబాలకు సాయం చేయడమే మేలు," అని నానా పటేకర్ (గతంలో ఓ లగ్జరీ కారు కొనుగోలును తిరస్కరించిన సందర్భంలో) చెప్పినట్టు రచయిత రణబీర్ పుష్ప్ ఇటీవలే గుర్తు వివరించారు.
డబ్బు, లగ్జరీల కంటే తోటి మనుషులకు సాయం చేయడమే గొప్పదని నిరూపించిన నానా పటేకర్, కేవలం వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


