జేపీ నడ్డా ఆహ్వానాన్ని తిరస్కరించిన CJP.. స్తంభించిన పార్లమెంటు
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతలు సడలడం లేదు. ఒకవైపు పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనలతో సభలు స్తంభిస్తుండగా, మరోవైపు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. మంత్రి జేపీ నడ్డా నివాసంలో చర్చలకు రావాలన్న ప్రతిపాదనను కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తిరస్కరించింది.
నీట్ పేపర్ లీక్ వివాదం పార్లమెంట్‌ను, ఢిల్లీ వీధులను ఊపేస్తోంది. బుధవారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు నీట్ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతున్నప్పటికీ, అడ్జర్న్‌మెంట్ మోషన్ ద్వారానే సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్షాలు స్పష్టం చేయడంతో పార్లమెంట్‌లో స్థంబన కొనసాగుతోంది.

మరోవైపు, జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP), కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో చర్చలకు రావాలన్న పోలీసుల ఆహ్వానాన్ని బహిరంగంగా తిరస్కరించింది.
వాయిదా తీర్మానానికి ప్రతిపక్షాల పట్టు
నీట్ పేపర్ లీక్‌పై ప్రాధాన్యత ఇచ్చి అడ్జర్న్‌మెంట్ మోషన్ కిందే చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. "మేము చర్చకు వ్యతిరేకం కాదు, అయితే వాయిదా తీర్మానం ద్వారా చర్చ జరిగితేనే ఈ సున్నితమైన అంశంపై పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం లభిస్తుంది. 'వందేమాతరం'పై చర్చించేందుకు ఎనిమిది గంటల సమయం కేటాయించిన ప్రభుత్వం.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ వివాదంపై సమయం కేటాయించలేదా? ప్రభుత్వం సమస్యను పరిష్కరించేందుకు బదులు రాజకీయ క్రీడలు ఆడుతోంది" అని ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అదే సమయంలో, ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్‌సభలో డిమాండ్ చేశారు.
చర్చకు సిద్ధమేనన్న కేంద్ర ప్రభుత్వం
ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. పార్లమెంట్ సక్రమంగా సాగితే నీట్ అంశంపై ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. "గత మూడు రోజులుగా నీట్ పేపర్ లీక్‌పై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. దేశ యువత భవిష్యత్తుపై అర్థవంతమైన చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది" అని కిరణ్ రిజిజు వివరించారు.
రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రతిపక్షాల వైఖరిని తప్పుపట్టారు. 'ఇండియా' కూటమి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, నీట్ వ్యవహారంపై సమగ్ర చర్చకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
'ఎవరి ఇంటికీ వెళ్లేది లేదు'.. సీజేపీ స్పష్టీకరణ
కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి వచ్చి మాట్లాడాలని పోలీసులు కోరినప్పటికీ, ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. "మంత్రి జేపీ నడ్డా మాట్లాడాలనుకుంటున్నారని ఉదయం పోలీసులు మాకు సమాచారం ఇచ్చారు. ఆయన నివాసానికి రావాలని కోరగా మేం తిరస్కరించాం. మేము ఎవరి ఇళ్లకు లేదా ఆఫీసులకు వెళ్లేది లేదు. జంతర్ మంతర్ వద్ద ప్రజా దర్బార్ జరుగుతోంది, మంత్రులే ఇక్కడికి వచ్చి ప్రజలతో మాట్లాడాలి. సెక్యూరిటీ సమస్యలు ఉంటే జంతర్ మంతర్ సమీపంలోని ఏదైనా తటస్థ ప్రదేశంలో భేటీకి సిద్ధంగా ఉన్నాం" అని సౌరవ్ దాస్ తెలిపారు.
విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో, భద్రతను పర్యవేక్షించడానికి పశ్చిమ బెంగాల్ నుంచి అదనంగా 20 సిఆర్‌పిఎఫ్ (CRPF) కంపెనీలను ఢిల్లీకి తరలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


