NEET UG 2026 results : నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే పైచేయి!
NEET UG Re Exam Result 2026 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రతిష్టాత్మక నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను గురువారం అర్ధరాత్రి ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 11.21 లక్షల మంది అర్హత సాధించగా, ఇందులో 58 శాతానికి పైగా విద్యార్థినులే కావడం విశేషం.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా.. అందులో 11.21 లక్షల మంది ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. ఈసారి ఫలితాల్లో అమ్మాయిలు స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. పరీక్ష పాసైన వారిలో 58 శాతానికి పైగా విద్యార్థినులే ఉన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ (neet.nta.nic.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు- దేశవ్యాప్తంగా టాపర్లు వీరే..
ఈ ఏడాది నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌లో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పాన్షుల్ బన్సల్ 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి సంయుక్తంగా దేశంలోనే అత్యున్నత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో మొదటి 17 ర్యాంకుల్లో నిలిచిన టాపర్లు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు కావడం విశేషం. మొత్తం 19 మంది విద్యార్థులు 700 కంటే ఎక్కువ మార్కులు సాధించారు.
ఈసారి టాప్ స్కోరర్లలో అద్భుతమైన మార్పు కనిపించింది. 690 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 138 మంది అభ్యర్థులలో 93 శాతం మంది తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించినవారే. అలాగే, వీరిలో 99 శాతం మంది 17 నుంచి 19 సంవత్సరాల వయసు గలవారే.
మార్కుల పంపిణీ, కేటగిరీల వారీగా కటాఫ్..
ఎన్టీఏ విడుదల చేసిన వివరాల ప్రకారం మార్కుల సరళి ఇలా ఉంది:
650 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు: 1,492 మంది
600 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు: 10,160 మంది
500 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు: 90,780 మంది
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1.7 లక్షల మంది క్వాలిఫై కాగా, లక్షద్వీప్ నుంచి అత్యల్పంగా 43 మంది అర్హత సాధించారు. కేటగిరీల వారీగా చూస్తే.. జనరల్ కేటగిరీలో 2.91 లక్షల మంది, ఓబీసీ-ఎన్‌సీఎల్ కేటగిరీలో 5.12 లక్షల మంది, ఎస్సీ కేటగిరీలో 1.59 లక్షల మంది, ఎస్టీ కేటగిరీలో 63,716 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 95,026 మంది అభ్యర్థులు వైద్య కోర్సుల కౌన్సిలింగ్‌కు అర్హత సాధించారు.
త్వరలోనే కౌన్సిలింగ్ ప్రక్రియ..
"ఫలితాలను సకాలంలో విడుదల చేయడం వల్ల కౌన్సిలింగ్, వైద్య ప్రవేశాల ప్రక్రియ అనుకున్న సమయానికే జరుగుతుంది," అని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. మిగిలిన 85 శాతం రాష్ట్ర కోటా సీట్లకు ఆయా రాష్ట్రాల అధికారిక కమిటీలు ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


