ఇంటర్ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్.. విద్యార్థులు ఈ కీలక మార్పులు తెలుసుకోండి

Telangana Inter 1st year Practicals : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఇంటర్ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టుగా బోర్డు అధికారికంగా ప్రకటించింది.

Published on: Jul 6, 2026, 22:41:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి(TGBIE) రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. సైన్స్ గ్రూపుల (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) ప్రాక్టికల్ పరీక్షల సరళిని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తూ సరికొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. నూతన విధానం ప్రకారం ఇకపై ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు విడివిడిగా ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. అంటే ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయి.

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్

గతంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఈ విధానాన్ని మార్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు ఇంటర్ ప్రథమ సంవత్సరం 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ మార్కులు ఉంటాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం కూడా 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. సైన్స్ సబ్జెక్టుల థియరీ పరీక్షలు యథావిధిగా 60 మార్కులకే కొనసాగుతాయి. కాకపోతే ప్రాక్టికల్ పరీక్షల మార్కులను విభజించి.. రెండు సంవత్సరాలకు కేటాయించారు.

ఈ ప్రాక్టికల్ పరీక్షలను మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు విడివిడిగా ఎక్స్‌టర్నల్ పర్యవేక్షణలో అధికారికంగా నిర్వహిస్తారని బోర్డు స్పష్టం చేసింది.

ఈ మార్పులకు అనుగుణంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన కొత్త ల్యాబ్ మాన్యువల్స్‌ను ఇంటర్ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్ (www.tgbie.cgg.gov.in) లో అందుబాటులో ఉంచింది. ఈ ల్యాబ్ మాన్యువల్స్‌లో ప్రాక్టికల్ సిలబస్, మోడల్ క్వశ్చన్ పేపర్లు, వార్షిక విద్యా ప్రణాళిక ప్రకారం నెలవారీగా అనుసరించాల్సిన షెడ్యూల్ వివరాలు పొందుపరిచారు.

ప్రిన్సిపాల్స్‌కు కీలక ఆదేశాలు

నూతన విద్యా ప్రణాళిక అమలుకు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.

నిర్దేశిత ప్రాక్టికల్ సిలబస్, వార్షిక విద్యా ప్రణాళిక ప్రకారం ల్యాబ్ తరగతులను క్రమం తప్పకుండా, పద్ధతిగా నిర్వహించాలి.

ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కావడానికి ముందే విద్యార్థులందరూ ల్యాబ్ మాన్యువల్‌లో సూచించిన అన్ని ప్రయోగాలు, యాక్టివిటీలను పూర్తి చేసేలా చూడాలి.

ప్రతి విద్యార్థి ప్రాక్టికల్ రికార్డును సరిగ్గా నిర్వహించేలా చూడాలి. ఈ రికార్డులను ఎక్స్‌టర్నల్ పరీక్షల సమయానికి సిద్ధం చేయాలి.

ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ, అటెండెన్స్, అవార్డు లిస్టులు, ఇతర రికార్డుల భద్రత ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారమే జరగాలి. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు లేదా మాల్‌ప్రాక్టీస్ జరిగినా కఠిన చర్యలు ఉంటాయి.

ఈ నూతన మార్పులను తక్షణమే విద్యార్థులకు, ప్రిన్సిపాల్స్‌కు చేరవేసి, కొత్త అకడమిక్ ప్లాన్ ప్రకారం ప్రాక్టికల్స్ జరిగేలా చూడాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, నోడల్ అధికారులను బోర్డు సెక్రటరీ ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More