Nepal flash floods : నేపాల్ ఆకస్మిక వరదల్లో 150కిపైగా మృతులు- 130 మంది భారతీయులు గల్లంతు!

నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భోటే కోశి నది ఉప్పొంగడంతో సంభవించిన ఆకస్మిక రాత్రిపూట వరదలు తీవ్ర వినాశనం సృష్టించాయి. ఈ ఘటనలో 157 మంది ప్రాణాలు కోల్పోగా, కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ భక్తులు సహా వందలాది మంది గల్లంతయ్యారు.

Published on: Aug 27, 2026, 05:31:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి విధ్వంసం సృష్టించింది. టిబెట్ వైపు నుంచి ఉద్ధృతంగా దూసుకొచ్చిన భోటే కోశి నది, సరిహద్దు జిల్లాలైన రసువా, ధాడింగ్, నువాకోట్‌లలో కనురెప్పపాటులో వినాశనం సృష్టించింది. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఊహించని రీతిలో వచ్చిన ఈ ఆకస్మిక వరదలు.. గ్రామాలు, ప్రధాన రహదారులు, కీలక వంతెనలను తుడిచిపెట్టేశాయి. రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు 157 మృతదేహాలను వెలికితీయగా, వందలాది మంది ఆచూకీ లభించలేదు. వరద ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

నేపాల్​లో కొనసాగుతున్న సహాయక చర్యలు..
నేపాల్​లో కొనసాగుతున్న సహాయక చర్యలు..

చిక్కుకుపోయిన కైలాస మానససరోవర యాత్రికులు!

నేపాల్​లో ఈ ప్రకృతి విపత్తులో కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన భారతీయులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టూరిజం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మొత్తం 403 మంది పర్యాటకులు గల్లంతు కాగా, అందులో 341 మంది విదేశీయులే ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 133 మంది భారతీయ భక్తులు ఉన్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, అమెరికా దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. కొండచరియలు విరిగిపడటం, ఫైబర్ నెట్‌వర్క్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం కావడంతో భక్తుల కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమ వారి క్షేమ సమాచారం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బంధువులు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

సైన్యాన్ని రంగంలోకి దించిన నేపాల్, భారత్ అత్యవసర సాయం!

బురద, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు నేపాల్ సహాయక బృందాలు, నేపాల్ ఆర్మీ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాయి.

"ఈ విపత్తులో మీరు కోల్పోయిన ప్రాణాలు, అనుభవిస్తున్న బాధ మాటల్లో చెప్పలేనిది. అయితే ఈ క్లిష్ట సమయంలో మీరు ఒంటరిగా లేరు. ప్రభుత్వం తన శక్తినంతటినీ ఉపయోగించి మీకు తోడుగా ఉంటుంది," అని నేపాల్ ప్రధాని బా లేంద్ర షా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ధైర్యం చెప్పారు.

మరోవైపు, పొరుగు దేశానికి ఆపద రాగానే భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. 10 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రవాణా విమానాన్ని నేపాల్‌కు తరలించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి సంఘీభావం తెలిపారని నేపాల్ పేర్కొంది. తక్షణ సహాయం అందించినందుకు నేపాల్ ప్రధాని షా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత్ చూపిస్తున్న ఈ మానవతా దృక్పథం రెండు దేశాల మధ్య ఉన్న దృఢమైన మైత్రికి నిదర్శనమని కొనియాడారు.

ఆకస్మిక వరదలకు అసలైన కారణం ఏంటి?

ఈ ఘోర విపత్తు వెనుక మంచు కొండచరియలు విరిగిపడటం, భూకంపం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. టిబెట్ ప్రాంతంలోని లెండే నదిలో మంచు విరిగిపడి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఇది బోటేకోశీకి ఉపనది. ఆ తర్వాత ఆ మంచు ఆకస్మికంగా పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు ఒక్కసారిగా కిందనున్న భోటేకోశీ నదిలోకి దూసుకొచ్చింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More