Nepal Floods : నేపాల్ వరదలు.. 140 మంది తెలుగు పర్యాటకులు మిస్సింగ్.. ఎక్కడ ఉన్నారు?

Nepal Floods : నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. అయితే చాలా మంది తెలుగు పర్యాటకులు కూడా నేపాల్ సందర్శనకు వెళ్లారు. వారి ఆచూకీపై ఇప్పుడు ఆందోళన నెలకొంది.

Published on: Aug 26, 2026, 21:20:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక జలప్రళయం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనను రేకెత్తిస్తోంది. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన 156 మంది తెలుగు పర్యాటకుల బృందంలో ఏకంగా 140 మంది జాడ తెలియకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలకు భోటేకోశీ నది ఉదయం ఉగ్రరూపం దాల్చడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి నేపాల్‌ వ్యాప్తంగా ఇప్పటివరకు 95 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

నేపాల్ వరదలు
నేపాల్ వరదలు

హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన 156 మంది పర్యాటకులు నేపాల్ పర్యటనకు వెళ్లారు. మంగళవారం రాత్రి వీరంతా అక్కడి ఒక హోటల్‌లో బస చేశారు. బుధవారం ఉదయం స్థానిక సందర్శనీయ ప్రాంతాలను చూడటానికి 140 మంది పర్యాటకులు బస్సుల్లో బయటకు వెళ్లారు. అయితే స్వల్ప అనారోగ్యం, ప్రయాణ అలసట కారణంగా 16 మంది యాత్రికులు హోటల్ గదుల్లోనే ఉండిపోయారు.

అయితే వారు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే భోటేకోశీ నది తీర ప్రాంతంలో ఒక్కసారిగా మేఘావృతమై, ఆకస్మిక వరదలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో పాటు నదీ ప్రవాహం రోడ్లను, వంతెనలను తుడిచిపెట్టేసింది. బయటకు వెళ్లిన 140 మంది యాత్రికులతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.

నెట్‌వర్క్ టవర్లు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటంతో వారి ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారి కుటంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. అయితే నెట్‌వర్క్ లేక ఫోన్లు స్విచ్ఛాఫ్ అని వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర తెలుగు ప్రయాణికులు సురక్షితంగా ఉండి ఉంటారని అంటున్నారు.

హోటల్‌లోనే ఉండిపోయిన 16 మంది మాత్రం సురక్షితంగా ఉన్నారు. గదిలో ఉన్న వారిలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన నలుగురు యాత్రికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమ వారి ఆచూకీ తెలియక పర్యాటకుల కుటుంబ సభ్యులు టూర్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నారు. నేపాల్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి తెలుగు పర్యాటకులను సురక్షితంగా తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

నేపాల్ సైన్యం, స్థానిక సహాయక బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు వేగవంతం చేశాయి. కేంద్ర విదేశాంగ శాఖ కూడా నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More