హైదరాబాద్‌కు తెలుగు పర్యాటకులు.. చూస్తుండగానే ప్రాణాలు పోయాయి.. గుండెలదిరే విషయాలు!

వియత్నాంలో పడవ ప్రమాదంలో భారతీయులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. సురక్షితంగా ఉన్నవారిలో కొందరు హైదరాబాద్‌ చేరుకున్నారు. తమ అనుభవాలు చెప్పుకొన్నారు.

Published on: Jul 13, 2026, 07:11:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వియత్నాంలోని ఫు క్వోక్ దీవి సమీపంలో శనివారం జరిగిన ఘోర పడవ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలుగు రాష్ట్రాల పర్యాటకులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న బాధితులు, అక్కడ తమ కోసం ఆందోళనగా వేచి చూస్తున్న కుటుంబ సభ్యులను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

వియత్నాం బోటు ప్రమాదం
వియత్నాం బోటు ప్రమాదం

విజయవాడకు చెందిన మహిపాల్ సంఘ్వి జూలై 8న దాదాపు 80 మంది పర్యాటకుల బృందంతో కలిసి వియత్నాం వెళ్లారు. ఆయన తన చేదు అనుభవాన్ని పంచుకుంటూ.. 'మేం జులై 11న ఫు క్వోక్ దీవికి చేరుకున్నాం. మా బృందంలోని కొందరు వాటర్ స్పోర్ట్స్ కోసం వెళ్లగా, నేను ఒడ్డునే ఉండిపోయాను. కొంత సమయం తర్వాత ఒక బోటు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. సహాయక సిబ్బంది నీటిలో పడిపోయిన వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. మేం వారికి వెంటనే సి.పి.ఆర్ చేసి బతికించడానికి ప్రయత్నించాం, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వారు కళ్లముందే ప్రాణాలు కోల్పోయారు.' అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ టూర్‌లో మొత్తం 105 మంది సభ్యులు ఉన్నారని రమేశ్వర్ ప్రధాన్ అనే మరో పర్యాటకుడు తెలిపారు. ఫు క్వోక్ దీవి నుండి మరో చిన్న దీవికి వెళ్లేందుకు పర్యాటకులను మూడు బోట్లలో విభజించారు. ప్రమాదానికి గురైన మొదటి బోటులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు.

బయలుదేరిన ఒక కిలోమీటరు దూరంలోనే సముద్రపు అలల ఉధృతికి నియంత్రణ కోల్పోయిన ఆ బోటు ఒక్కసారిగా బోల్తా పడింది. నావికాదళం వెంటనే స్పందించి కొందరిని సురక్షితంగా కాపాడినప్పటికీ, మిగిలిన వారు నీటిలో మునిగిపోయారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారు అక్కడి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని ప్రధాన్ వివరించారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే పర్యాటకుడు మాట్లాడుతూ, తాము 24 మందితో కూడిన వేరే గ్రూప్‌లో ఉన్నామని, తమ కళ్ల ముందే ముందు వెళ్తున్న బోటు మునిగిపోయిందని చెప్పారు. నీటి ప్రవాహం చాలా బలంగా ఉందని, తాము తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నామని పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం నావికాదళంతో పాటు, భారత రాయబార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించి అవసరమైన సహాయ సహకారాలు అందించాయని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరిన విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన ఎనిమిది మందితో కలిపి మొత్తం 17 మంది పర్యాటకులు తిరిగి వచ్చారు. వియత్నాంలో చిక్కుకున్న మిగిలిన వారిని కూడా సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More