Nepal Floods : మానవత్వం లేని మనుషులు.. మృతదేహం నుంచి ఆభరణాలు చోరీ! వీడియో వైరల్
నేపాల్‌లో సంభవించిన భయంకరమైన వరదల్లో కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహం నుంచి ఇద్దరు వ్యక్తులు బంగారు కమ్మలను దొంగిలించిన ఘటన కలకలం రేపింది. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంభవించిన జలప్రళయం నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. వరదల ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. ఇటువంటి ఆపద సమయంలో ఒకరికొకరు ఆసరాగా నిలిచి, మానవత్వాన్ని చాటిచెప్పాల్సింది పోయి.. మృతదేహాల నుంచి దోచుకుంటున్నారు! కొందరు వ్యక్తులు అత్యంత నీచంగా ప్రవర్తించారు. వరద నీటిలో కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహం నుంచి పసిడి ఆభరణాలను దొంగిలించిన దారుణ సంఘటన నేపాల్‌లో వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియోతో దొరికిపోయారు..
నారాయణి నదిలో కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు, దానిని ఒడ్డుకు తీసి అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను లాక్కున్నారు. ఆమె జుట్టు పట్టుకుని మృతదేహాన్ని ఒడ్డుకు లాగి, ఇరువైపుల ఉన్న కమ్మలను తీసి పక్కన పెట్టుకున్నారు.
చుట్టూ ఉన్నవారు ఈ దారుణాన్ని అడ్డుకోకుండా వీడియోలు తీస్తుండటం గమనార్హం.
సుమారు 41 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో నేపాల్ పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన భరత్‌పూర్ ఏరియా చిత్వాన్ పోలీసులు నిందితులను గుర్తించారు. పోఖారా బస్ పార్క్ సమీపంలో 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేష్ చౌదరి అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
"విపత్తు సమయంలో బాధితులను దోచుకోవడం లేదా ఎలాంటి అమానుష చర్యలకు పాల్పడినా సహించేది లేదు," అని పోలీసులు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :
కష్టకాలంలో మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో మహా ప్రళయం..
ప్రస్తుతం నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలు భయంకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో విలవిలలాడుతున్నాయి. ఈ ప్రళయంలో ఇప్పటివరకు 469 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 1,500 మందికి పైగా గల్లంతయ్యారు. బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీయడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. టిబెట్‌లోని గైరోంగ్ పోర్ట్ సరిహద్దు వద్ద బహుళ అంతస్తుల భవనాలు, బస్సు పార్కింగ్ ప్రాంతాలు దాదాపు ఐదు అడుగుల మేర బురదలో మునిగిపోయాయి.
హిమాలయాల్లో సంభవించే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కేవలం సరిహద్దు దేశాలనే కాకుండా, దిగువన ఉండే భారతదేశ నదుల వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
వాంటోర్ టెక్నాలజీ విడుదల చేసిన సరికొత్త శాటిలైట్ చిత్రాలు అక్కడ జరిగిన విధ్వంస తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. నేపాల్-టిబెట్ మధ్య ఉన్న అత్యంత కీలకమైన 'రసువాగధి' సరిహద్దు తనిఖీ కేంద్రం వరద నీటి ప్రవాహానికి ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. ఉధృతంగా వచ్చిన బురద, నీటి ప్రవాహం లోయ ఆకారాన్నే మార్చేసింది. అంతేకాకుండా, సరిహద్దు సమీపంలో ఒక కొత్త కృత్రిమ సరస్సు ఏర్పడి వేగంగా విస్తరిస్తున్నట్లు వైమానిక దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సరస్సు కట్ట తెగితే దిగువ ప్రాంతాలకు మరింత ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ జలప్రళయంలో వేలాది మంది ప్రజలు బురద, శిథిలాల కింద గల్లంతయ్యారు. బాధితులను కాపాడేందుకు అంతర్జాతీయ సమాజంతో పాటు పలు దేశాలు తమ శోధన, సహాయక బృందాలను పంపేందుకు ముందుకు వచ్చాయి. అయితే, ప్రధాని బాలేంద్ర షా నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం ఈ విదేశీ రెస్క్యూ బృందాల సహాయాన్ని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. తమ దేశ భద్రతా దళాలే ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహించగలవని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు 'ద స్ట్రెయిట్ టైమ్స్' కథనం వెల్లడించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


