IRCTC New Website : రైల్వే ప్రయాణికులకు బిగ్​ రిలీఫ్! అతి త్వరలో ఐఆర్‌సీటీసీ సరికొత్త వెబ్‌సైట్

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే కోట్లాది మంది ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ఊరటనిచ్చారు. పీక్ అవర్స్, తత్కాల్ బుకింగ్ సమయంలో వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ జూలై 15 కల్లా సరికొత్త వెబ్‌సైట్‌ను తీసుకురానున్నారు.

Published on: Jun 12, 2026, 10:45:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

New IRCTC website launch date : దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ఉపయోగించే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్​లోని లోపాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. సాంకేతిక హంగులతో మరింత వేగంగా పనిచేసే సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఈ ఏడాది జులై 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ కీలక ప్రకటన చేశారు. జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్​ఐటీ)లో విద్యార్థులతో జరిగిన ఒక ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి.. వేదికపై నుంచే లైవ్‌లో నేరుగా రైల్వే ఉన్నతాధికారికి ఫోన్ చేసి మాట్లాడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఐఆర్​సీటీసీ కొత్త వెబ్​సైట్​ లాంచ్​ ఎప్పుడంటే..
ఐఆర్​సీటీసీ కొత్త వెబ్​సైట్​ లాంచ్​ ఎప్పుడంటే..

స్టూడెంట్ అడిగిన ప్రశ్న.. మంత్రి లైవ్ కాల్!

వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో, దేశవ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది టికెట్ బుకింగ్ కోసం ఉపయోగించే అధికారిక రైల్వే వెబ్‌సైట్‌లో ఎదురవుతున్న కాప్చా ఇబ్బందుల గురించి ఒక విద్యార్థి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

“సార్, దయచేసి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వస్తున్న కాప్చా సమస్యను పరిష్కరించండి,” అని ఆ విద్యార్థి మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు.

దీనికి మంత్రి తక్షణమే స్పందించారు. అక్కడికక్కడే రైల్వే శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారికి ఫోన్ కాల్ చేశారు.

“ఇక్కడి విద్యార్థులంతా సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ కావాలని కోరుతున్నారు. రాబోయే 30 రోజుల్లోగా కొత్త వెబ్‌సైట్‌ను సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురాగలమా?” అని మంత్రి సదరు అధికారిని ప్రశ్నించారు.

అధికారి నుంచి సానుకూల సమాధానం రావడంతో, జులై 15 కల్లా సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లాంచ్ అవుతుందని మంత్రి విద్యార్థులకు చెప్పారు. దానితో హాల్‌లోని విద్యార్థులంతా చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

తత్కాల్ బుకింగ్ ఇబ్బందులకు చెక్!

సాధారణంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు, ముఖ్యంగా ఉదయం తత్కాల్ బుకింగ్ ప్రారంభమయ్యే పీక్ అవర్స్‌లో సర్వర్లు పూర్తిగా డౌన్ అవ్వడం, సైట్ హ్యాంగ్ అవ్వడం ప్రయాణికులకు పెద్ద సమస్యగా మారింది. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఓటీపీలు సమయానికి రాకపోవడం, పేమెంట్ ఫెయిల్ అవ్వడం వంటి సాంకేతిక లోపాలపై ప్రయాణికులు చాలా కాలంగా ఫిర్యాదులు చేస్తున్నారు. కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తే ఈ సమస్యలన్నింటికీ బ్రేక్ పడుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.

ఆన్‌లైన్ వైపే మొగ్గు.. కఠిన నియమాలు!

భారతీయ రైల్వేస్ 2002లో మొదటిసారిగా ఆన్‌లైన్ ద్వారా రైలు టికెట్ల రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ డిజిటల్ వ్యవస్థ ఊహించని రీతిలో విస్తరించింది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న మొత్తం రైలు టికెట్లలో దాదాపు 88 శాతం బుకింగ్స్ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయని, రైల్వే స్టేషన్లలోని కౌంటర్లకు వెళ్లేవారి సంఖ్య బాగా తగ్గిందని అధికారులు వెల్లడించారు.

అయితే, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. గతేడాది జులై నుంచి తత్కాల్ స్కీమ్ కింద టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఖచ్చితంగా ఆధార్ కార్డు ధృవీకరణ పూర్తి చేసిన యూజర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రతా కారణాల దృష్ట్యా, నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 2025 క్యాలెండర్ ఇయర్​లో ఏకంగా 3.04 కోట్ల ఐఆర్‌సీటీసీ యూజర్ అకౌంట్లను రైల్వే శాఖ పూర్తిగా నిలిపివేసింది. మరో 2.94 కోట్ల అకౌంట్లను తాత్కాలికంగా సస్పెండ్ చేసి, తిరిగి రీవాలిడేషన్ చేసుకునే ఆప్షన్ కల్పించింది.

ఏఐ కెమెరాల నిఘాలో రైల్వే వంటశాలలు!

వెబ్‌సైట్ అప్‌గ్రేడ్‌తో పాటు ప్రయాణికులకు అందించే వసతులపై ఐఆర్‌సీటీసీ మరో ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని అమలు చేస్తోంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో సరఫరా చేసే ఆహార నాణ్యత, పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఆర్‌సీటీసీ బేస్ కిచెన్లలో ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా 24 గంటల పాటు నిఘా ఉంచుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 800 కంటే ఎక్కువ ఐఆర్‌సీటీసీ వంటశాలలను 2,394 ఏఐ కెమెరాలతో అనుసంధానించారు. ఈ కెమెరాలన్నింటినీ దిల్లీలోని సెంట్రల్ వార్ రూమ్ నుంచి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ సరికొత్త ఏఐ సాఫ్ట్‌వేర్ వంటశాలల్లో జరిగే దాదాపు 9 రకాల అపరిశుభ్రమైన లోపాలను లేదా నిబంధనల ఉల్లంఘనలను స్వయంచాలకంగా గుర్తించి అధికారులను అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల ప్రయాణికులకు మరింత నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందుతుందని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More