Audi Q3 : నెక్ట్స్ జెన్ ఆడీ క్యూ3 లాంచ్- లగ్జరీ కారు ధర ఎంతంటే..

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ.. తమ పాపులర్ ఎస్‌యూవీ 'ఆడీ క్యూ3' థర్డ్ జనరేషన్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త డిజైన్, కర్వ్‌డ్ డిస్‌ప్లే, లెవల్-2 అడాస్ వంటి అధునాతన హంగులతో వచ్చిన ఈ కారు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 17, 2026, 15:12:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతీయ లగ్జరీ కార్ల విపణిలో ఆడీ తన స్థానాన్ని మరింత బలపరుచుకునేందుకు సిద్ధమైంది. ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ సంస్థ ఆడీ, తమ మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘ఆడీ క్యూ3’ సరికొత్త థర్డ్ జనరేషన్ మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 51.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. 2012లో తొలిసారిగా భారత్‌లోకి అడుగుపెట్టిన ఆడీ క్యూ3.. దేశీయ మార్కెట్లో విజయవంతంగా 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. బీఎండబ్ల్యూ ఎక్స్1, మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఏ వంటి లగ్జరీ కార్లకు ఈ కొత్త Q3 గట్టి పోటీ ఇవ్వనుంది.

నెక్ట్స్ జెన్ ఆడీ క్యూ3 లాంచ్- ధర..
నెక్ట్స్ జెన్ ఆడీ క్యూ3 లాంచ్- ధర..

ఆకట్టుకునే డిజైన్.. మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ వెలుగులు!

మునుపటి మోడల్‌తో పోలిస్తే కొత్త ఆడీ క్యూ3 లగ్జరీ కారు డిజైన్ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ముందు భాగంలో డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లతో పాటు డైనమిక్ ఇండికేటర్లుగా పనిచేసే స్లిట్-ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను ఇచ్చారు. హెడ్‌లైట్ యూనిట్లలో దాదాపు 25,600 ఇండివిడ్యువల్ పిక్సెల్స్ ఉండటం విశేషం. ముందు వైపు హనీకోంబ్ ప్యాటర్న్ గ్రిల్, దానిపై 2డీ ఆడీ లోగో మెరుస్తుంది. ఈ లోగో వెనుకనే లెవల్-2 అడాస్​కి సంబంధించిన రాడార్ సెన్సార్లను అమర్చారు. పక్క భాగంలో 18-ఇంచుల అలాయ్ వీల్స్, సెల్ఫ్-లెవెలింగ్ సెంటర్ క్యాప్స్, సిల్వర్ రూఫ్ రైల్స్, సీ-పిల్లర్ వరకు విస్తరించిన క్రోమ్ గార్నిష్ లుక్‌ను మరింత పెంచుతాయి. వెనుక వైపు స్ప్లిట్ ఎల్‌ఈడీ లైట్లు, కాంతివంతంగా మెరిసే ఆడి లోగో ఇచ్చారు.

పెరిగిన పరిమాణం.. విశాలమైన క్యాబిన్..

కొత్త ఆడీ క్యూ3 పొడవు 4,531 ఎంఎం, వెడల్పు 1,859 ఎంఎం, ఎత్తు 1,623 ఎంఎంగా ఉంది. వీల్‌బేస్ 2,681 ఎంఎంగా రూపుదిద్దుకుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 44 ఎంఎం పొడవు, 10 ఎంఎం వెడల్పు, 7 ఎంఎం ఎత్తు అదనంగా పెరిగింది. దీనివల్ల లోపల ప్రయాణికులకు లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ సౌకర్యవంతంగా ఉంటుంది. లగేజ్ సర్దుకోవడానికి 488 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను అందించారు.

హైటెక్ ఇంటీరియర్.. ప్రీమియం ఫీచర్లు

క్యాబిన్ లోపలికి అడుగుపెడితే సరికొత్త లేఅవుట్ కనిపిస్తుంది. పాత త్రీ-స్పోక్ స్టీరింగ్ స్థానంలో హెక్సాగోనల్ ఫోర్-స్పోక్ స్టీరింగ్ ఇచ్చారు. డ్యాష్‌బోర్డ్‌పై 11.9-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన వినూత్న 'కర్వ్‌డ్ డిస్‌ప్లే' ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిజైన్‌లో భాగంగా గేర్ లివర్‌ను స్టీరింగ్ కాలమ్‌కు మార్చారు.

ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ల సోనోస్ ఆడియో సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, లెదర్ యుపోల్‌స్టరీ, 9 ఎయిర్‌బ్యాగ్‌ల భద్రత ఉంది. వెనుక సీటు ప్రయాణికుల కోసం సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రెండు యూఎస్‌బీ టైప్-సి పోర్టులు, రియర్ ఏసీ వెంట్లను ఏర్పాటు చేశారు.

పవర్‌ఫుల్ ఇంజిన్.. క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్

సాంకేతిక సామర్థ్యం విషయానికి వస్తే, కొత్త ఆడీ క్యూ3 లో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 204 హెచ్‌పీ పవర్, 320 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ కంటే ఇది 14 హెచ్‌పీ అదనపు పవర్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు. ప్యాడిల్ షిఫ్టర్లు, ఆడి ప్రసిద్ధ క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు శక్తి సరఫరా అవుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More