Electric car : గూగుల్ జెమినీ ఏఐ టెక్నాలజీతో నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు- పిక్సో హైలైట్స్ ఇవే..

ప్రసిద్ధ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్, యూరోపియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘పిక్సో’ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. కాంపాక్ట్ సైజ్, 259 కి.మీ రేంజ్, గూగుల్ జెమినీ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో వస్తున్న ఈ కారు నగర ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

Published on: Sep 25, 2026, 11:28:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న వేళ, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ సరికొత్త ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. యూరోపియన్ నగరాల్లో సులభంగా డ్రైవ్ చేసేలా నిస్సాన్ ‘పిక్సో’ పేరుతో ఒక కాంపాక్ట్ ఏ-సెగ్మెంట్ ఈవీని మార్కెట్‌కు పరిచయం చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వాహన దిగ్గజం రెనాల్ట్ భాగస్వామ్యంతో నిస్సాన్ ఈ కారును అభివృద్ధి చేసింది. స్లోవేనియాలోని రెనాల్ట్ 'నోవో మెస్టో' ప్లాంట్‌లో ఇది ఉత్పత్తి కానుండగా, 2027 ప్రథమార్థంలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

నిస్సాన్ పిక్సో ఎలక్ట్రిక్ కారు
నిస్సాన్ పిక్సో ఎలక్ట్రిక్ కారు

రోబో ఫేస్ డిజైన్.. ఆకట్టుకునే రోడ్ ప్రెజెన్స్!

కేవలం పెట్రోల్ కార్లకు ఈవీ బ్యాటరీ అమర్చడం కాకుండా, నిస్సాన్ ఈ పిక్సో కారును పక్కా ఈవీ ప్లాట్‌ఫామ్‌పై, పక్కా ప్రణాళికతో డిజైన్ చేసింది.

బాక్సీ స్టైలింగ్: షార్ట్ ఓవర్‌హాంగ్స్, బాక్సీ షేప్‌తో నగర వీధులకు తగినట్లుగా ఉంటుంది.

లైటింగ్ అండ్ లుక్: పిక్సెల్ స్టైల్ హెడ్‌లైట్స్, ముందు భాగంలో రోబోను తలపించేలా "రోబో ఫేస్" బంపర్ డిజైన్ అలరిస్తాయి.

సైజు వివరాలు: ఈ కారు పొడవు 3,796 ఎంఎం, వెడల్పు 1,790 ఎంఎం కాగా, దీని టర్నింగ్ రేడియస్ కేవలం 9.9 మీటర్లు మాత్రమే. ఇరుకైన సందుల్లో కూడా సులువుగా యూ-టర్న్ తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

రంగులు, వీల్స్: 'వండర్ పర్పుల్', 'గియర్ బ్లూ' వంటి ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ రంగులతో పాటు 18-ఇంచుల పిక్సెల్ అలాయ్ వీల్స్‌ను ఈ నిస్సాన్ పిక్సో ఎలక్ట్రిక్ కారులో ఇచ్చారు.

అధునాతన ఇంటీరియర్.. ప్రీమియం ఫీచర్లు

ఇది చిన్న ఎలక్ట్రిక్ కారే అయినప్పటికీ లోపల నలుగురు పెద్దలు హాయిగా కూర్చునేలా విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను అందించారు.

డిజిటల్ డాష్‌బోర్డ్: 7-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు 10-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు.

కంట్రోల్స్: వాతావరణ నియంత్రణ (ఏసీ) కోసం డిజిటల్ డిస్‌ప్లే పైనే ఆధారపడకుండా, భౌతిక బటన్లను నిస్సాన్ కొనసాగించడం గమనార్హం.

ఫ్లెక్సిబుల్ సీటింగ్ అండ్ బూట్ స్పేస్: వెనుక సీట్లను అవసరానికి తగినట్లు ముందూ వెనుకకు జరుపుకునే వెసులుబాటు ఉంది. మొత్తం 356 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

ఈవీ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా 'గూగుల్ జెమినీ' ఏఐ!

టెక్నాలజీ విషయంలో నిస్సాన్ పిక్సో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా గూగుల్ జెమినీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌ను ఇందులో చేర్చారు.

16 భాషల సపోర్ట్: నావిగేషన్, వాయిస్ కమాండ్స్ కోసం గూగుల్ జెమినీ ఏఐ 16 విభిన్న భాషలు, యాసలను అర్థం చేసుకుంటుంది.

ఫేస్ ఐడీ : కార్ డ్రైవర్‌ను గుర్తించి వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా సీట్, ఇన్ఫోటైన్‌మెంట్ సెట్టింగ్స్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసే ఫేస్ రీడర్ ఫీచర్ ఇందులో ఉంది.

అడ్వాన్స్​డ్​ సేఫ్టీ : అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు హాండ్స్-ఫ్రీ పార్కింగ్ వంటి డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు దీని సొంతం.

బ్యాటరీ సామర్థ్యం అండ్ ఛార్జింగ్ వివరాలు..

ఈ కారులో 27.5 kWh ఎల్​ఎఫ్​పీ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 82 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవింగ్ రేంజ్: ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే డబ్ల్యూఎల్టీపీ ప్రమాణాల ప్రకారం 259 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ఫాస్ట్ ఛార్జింగ్: 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా కేవలం 28 నిమిషాల్లోనే బ్యాటరీని 15% నుంచి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

వెహికల్-టు-గ్రిడ్ : ఇందులో 11కేడబ్ల్యూ బైడైరెక్షనల్ ఏసీ ఛార్జింగ్‌ను అందించడం వల్ల ఈ కారులోని విద్యుత్‌ను ఇతర పరికరాలకు కూడా వాడుకునే సౌలభ్యం ఉంటుంది.

యూరోపియన్ మార్కెట్ సాధించే విజయం ఆధారంగా, భవిష్యత్తులో ఈ రకమైన కాంపాక్ట్ ఈవీలను భారత్ వంటి ఆసియా మార్కెట్లకు కూడా విస్తరించే అవకాశాలు లేకపోలేదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More