ఓల్డ్ మంక్‌ను రమ్‌గా అమ్మొద్దు: బాంబే హైకోర్టులో ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ వాదనలు
ప్రముఖ మద్యం బ్రాండ్ ఓల్డ్ మంక్‌ను ఇకపై 'రమ్' అని పిలవడానికి వీల్లేదని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ) బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది. న్యూట్రల్ ఆల్కహాల్, రమ్ ఫ్లేవర్‌తో తయారు చేస్తున్న ఈ పానీయాన్ని 'రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్'గా మాత్రమే అమ్మాలని స్పష్టం చేసింది.
దేశంలో అత్యంత ఆదరణ పొందిన మద్యం బ్రాండ్లలో ఒకటైన ఓల్డ్ మంక్ (Old Monk) చుట్టూ చట్టపరమైన చిక్కులు ముసురుకున్నాయి. ఈ పానీయాన్ని 'రమ్' పేరుతో విక్రయించడానికి అనుమతించబోమని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ) బాంబే హైకోర్టుకు తెగేసి చెప్పింది. న్యూట్రల్ స్పిరిట్, రమ్ ఫ్లేవరింగ్ పదార్థాలతో దీనిని తయారు చేస్తున్నారని, కాబట్టి ఇది అసలైన రమ్ కాదని స్పష్టం చేసింది.

"ఈ ఉత్పత్తిని రమ్‌గా విక్రయించడానికి ఏమాత్రం అనుమతించలేం" అని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీని స్థానంలో 'రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్' అనే పేరుతో మార్కెటింగ్ చేసుకోవచ్చని ధర్మాసనానికి వివరించారు.
కొత్త లేబుళ్లు సమర్పించిన కంపెనీ
ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ అభ్యంతరాల నేపథ్యంలో ఓల్డ్ మంక్ తయారీ సంస్థ మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్, సవరించిన నూతన లేబుళ్లను కోర్టుకు సమర్పించింది. వీటికి ఆమోదం తెలిపేందుకు కొంత సమయం కావాలని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కోరడంతో, బాంబే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర వి. ఘుగే, జస్టిస్ గౌతమ్ ఎ. అంఖాద్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది.
మభ్యపెట్టేలా ప్రచార ప్రకటనలు
గత విచారణ సందర్భంగా, తమ బాటిళ్లపై ఉన్న '7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్' అనే పదాలను తొలగించేందుకు కంపెనీ అంగీకరించింది. ఈ పానీయాన్ని ఏడేళ్ల పాటు నిల్వ ఉంచి (Aged) తయారు చేశారని వినియోగదారులు భావించే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. బాటిల్ లేబుల్‌పై రాసిన కొన్ని వివరాలు అసలు చదవడానికి కూడా వీల్లేనంత చిన్న అక్షరాల్లో ముద్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిషేధం అమలులో ఉన్న గత 120 రోజుల్లో రోజుకు రూ.కోటి చొప్పున తీవ్ర ఆర్థిక నష్టం చవిచూశామని కంపెనీ సీనియర్ న్యాయవాది నవరోజ్ హెచ్. సీర్వాయ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ల్యాబ్ పరీక్షల్లో నిజాలు బయటకి
ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో ఈ మద్యంలో బయటి నుంచి కృత్రిమ, ఫ్లేవరింగ్ పదార్థాలను కలిపినట్లు తేలింది. ఇవి పానీయం యొక్క సహజ గుణాలను కప్పిపుచ్చుతున్నాయని సంస్థ తెలిపింది. ఆల్కహాలిక్ పానీయాల నియంత్రణ నిబంధనలు-2018 ప్రకారం ప్రామాణిక రమ్ లేదా విస్కీల సహజమైన రుచి, సువాసన మారకూడదు. ఇలా ఫ్లేవర్లు కలపడం నిబంధనలకు విరుద్ధమని సంస్థ పేర్కొంది.
మరికొన్ని ప్రముఖ బ్రాండ్ల పైనా ఆంక్షలు
ఇదే కారణంతో యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీకి చెందిన మెక్‌డోవెల్స్ నంబర్ 1 రమ్, యాంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీలతో పాటు ఇన్‌బ్రెవ్ బెవరేజెస్‌కు చెందిన బ్యాగ్‌పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ రమ్‌ల విక్రయాలపై కూడా ఆంక్షలు ఎదురయ్యాయి. అయితే యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ ఆగస్టు 24న తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. పానీయం ఫార్ములాను మార్చకుండా ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ సూచనలకు అనుగుణంగా లేబుళ్లలోనే మార్పులు చేయడానికి అంగీకరించింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


