యుద్ధంలో సైనికుల బలవన్మరణాలు.. అసలు ఏం జరుగుతోంది?

2022 ఫిబ్రవరి నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఉక్రెయిన్ యుద్ధంలో 4.60 లక్షలకు పైగా రష్యా సైనికులు మరణించగా, వెయ్యికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు లీకైన గణాంకాలు వెల్లడించాయి. కఠిన ఆంక్షలు, పెరుగుతున్న మరణాలతో సైన్యంలో నైతిక స్థైర్యం దెబ్బతింటోంది.

Published on: Nov 24, 2026, 16:43:23 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐదేళ్లు పూర్తి చేసుకునే దశకు చేరుకుంటున్న వేళ, రష్యాకు భారీ ప్రాణనష్టం వాటిల్లిందని తాజా విశ్లేషణలు వెల్లడించాయి. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి 2026 సెప్టెంబర్ వరకు 4,60,000 మందికి పైగా రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే కాలంలో వెయ్యికి పైగా సైనికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరిణామాలు రష్యాలో దీర్ఘకాలంగా ఉన్న జనాభా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో శిథిలమైన భవనాలు (REUTERS)
ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో శిథిలమైన భవనాలు (REUTERS)

రష్యా ప్రభుత్వ గణాంక సంస్థ 'రోస్టాట్' నుంచి లీకైన పత్రాలను 'ఫైనాన్షియల్ టైమ్స్', 'ది గార్డియన్' పత్రికలు విశ్లేషించి ఈ వివరాలను బయటపెట్టాయి. యుద్ధంలో మరణించిన వారి వివరాలను క్రెమ్లిన్ దాచిపెడుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలు అరుదైన వాస్తవాలను కళ్లకు కట్టాయి. కఠిన నిబంధనలు, పెరుగుతున్న మరణాల సంఖ్య సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

రష్యా సైనిక మరణాలు.. గణాంకాలు చెబుతున్నదేమిటి?

2022 సెప్టెంబర్‌లో 5,937 మంది సైనికులు మరణించారని రష్యా అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఇప్పటివరకు మరణాల సంఖ్యను క్రెమ్లిన్ అప్‌డేట్ చేయలేదు. కానీ 'ది గార్డియన్' విశ్లేషణ ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి 4,60,000 మందికి పైగా మరణించారు.

రష్యా దురాక్రమణ మొదటి ఏడాదిలో దాదాపు 20,000 మరణాలు నమోదు కాగా, 2023లో ఆ సంఖ్య 50,000కు పెరిగింది. 2024లో ఏకంగా 1,34,000 మంది మరణించారు. యుద్ధంలో అత్యంత ఘోరమైన సంవత్సరంగా 2025 నిలిచింది. ఆ ఏడాది 2,00,000 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంటే రోజుకు సగటున 548 మంది చొప్పున మరణించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా లేదా సోవియట్ యూనియన్ ఎదుర్కొన్న అతిపెద్ద ప్రాణనష్టం ఇది. ఇది దశాబ్దాల పాటు జనాభా సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ యుద్ధభూమిలో వయసు పైబడిన రష్యా పురుషులు ఎక్కువగా మరణిస్తున్నారు. 2026లో మరణించిన సైనికుల్లో 20 శాతం మంది 50 ఏళ్లకు పైబడిన వారే.

భారీ ప్రాణనష్టాన్ని పూడ్చుకోవడానికి రష్యా ప్రభుత్వం స్వదేశంలో యువతను ఆకర్షించేందుకు నగదు బోనస్‌లు ప్రకటించింది. దేశంలోని ఆసియా వలస కార్మికులతో పాటు, రష్యా పౌరసత్వం, పౌర ఉద్యోగాల ఆశ చూపి విదేశీయులను కూడా పెద్ద ఎత్తున సైన్యంలోకి తీసుకుంటోంది.

పెరుగుతున్న సైనికుల ఆత్మహత్యలు

పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా సైనికుల్లో ఆత్మహత్యల ముప్పు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని విశ్లేషణలు తేల్చాయి. 2022 ఫిబ్రవరి నుంచి 2026 సెప్టెంబర్ వరకు కనీసం 1,229 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. మరోవైపు 'ది గార్డియన్' 1,087 ఆత్మహత్యలను, "నిర్ధారించలేని ఉద్దేశంతో" జరిగిన తుపాకీ గాయాల మరణాలుగా నమోదైన మరో 885 కేసులను గుర్తించింది.

యుద్ధం కొనసాగినంత కాలం సైనికుల ఆత్మహత్యలు క్రమంగా పెరిగాయి. 2023లో 235, 2024లో సుమారు 300, 2025లో 371 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2022 నుంచి జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో 600కు పైగా కేసులు, తీవ్రమైన పోరాటాలు జరిగిన ఉక్రెయిన్‌లోని నాలుగు పాక్షిక ఆక్రమిత ప్రాంతాల యుద్ధ క్షేత్రాల్లోనే చోటుచేసుకున్నాయి.

చాలా యుద్ధాల్లో ఆత్మహత్యలు కనిపించినా, రష్యా సైనికులు తోటి సైనికులు, కమాండర్ల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన యుద్ధ కార్యకలాపాలకు తమను పంపుతారనే భయం, యుద్ధం నుంచి బయటపడే మార్గం లేదనే నిరాశ వారిని కుంగదీస్తున్నాయి.

"ఇది నిరాశ కలిగించే పరిస్థితి. ప్రజలు పోరాడాలని అనుకోవడం లేదు, కానీ రష్యా సైన్యంలో చేరిపోయారు. బయటకు వచ్చే చట్టబద్ధమైన మార్గం వారికి లేదు" అని రష్యా సైనికులు సైన్యం నుంచి పారిపోవడానికి సహాయపడే 'గెట్ లాస్ట్' సంస్థ డైరెక్టర్ గ్రిగోరీ స్వెర్డ్లిన్ ఫైనాన్షియల్ టైమ్స్‌తో అన్నారు.

అసలు సంఖ్య ఇంకా ఎక్కువే..

బెలారస్ ప్రతిపక్షానికి చెందిన హ్యాకింగ్ గ్రూప్ 'సైబర్ పార్టిసన్స్', ఉక్రెయిన్ హ్యాకర్ల బృందం 'సైలెంట్ క్రో' సేకరించిన 1.1 కోట్లకు పైగా మరణ ధ్రువీకరణ పత్రాల సమాచారం ఆధారంగా ఈ గణాంకాలు వచ్చాయి. అయితే వాస్తవ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఆత్మహత్యల వివరాలను క్రెమ్లిన్ బయటపెట్టదు. ప్రాణనష్ట గణాంకాలను రాజ్య రహస్యంగా పరిగణిస్తుంది.

అంతేకాకుండా, గల్లంతైన సైనికుల మరణాలను మృతదేహాలు లభించినప్పుడు లేదా కోర్టులు మరణించినట్లు ప్రకటించినప్పుడు నెలలు లేదా ఏళ్ల తర్వాత నమోదు చేస్తారు. కొన్ని మరణాలు అసలు నమోదు కాకపోవడం, సైనికులు గల్లంతు కావడం వల్ల ఈ డేటాబేస్‌లో ప్రతి మరణమూ నమోదు కాదు. విధులకు హాజరు కాకపోవడం లేదా సేవకు నిరాకరించిన కేసుల్లో కోర్టుల ఆదేశాల తర్వాత కనీసం 49,000 మంది రష్యా సైనికులను సైన్యం నుంచి పారిపోయిన వారుగా ప్రకటించినట్లు 'ది గార్డియన్' తన నివేదికలో పేర్కొంది.

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.