Pariksha Pe Charcha : ‘మీకంటూ ఒక ప్రత్యేక శైలి ఉండాలి’- విద్యార్థులకు ప్రధాని మోదీ సూచనలు..
పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు సొంత పద్ధతులపై నమ్మకం ఉంచాలని, ఇతరుల సలహాలను స్వీకరిస్తూనే మన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా మార్పులు చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన పరీక్షా పే చర్చ 2026లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
'పరీక్షా పే చర్చ 2026' కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అలవర్చుకోవాలని, దానిపై "పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలని" ఆయన తెలిపారు. ఇతరుల సలహాలు వినాలని, కానీ అవసరానికి తగ్గట్లుగా వాటిని మలచుకోవాలని సూచించారు.

పరీక్షా పే చర్చ 2026- సొంత శైలిపై నమ్మకం ఉంచండి..
"నేను ప్రధానమంత్రిని అయ్యాను. అయితే, ఇప్పటికీ ప్రజలు నాకు రకరకాల పని పద్ధతులను సూచిస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరికీ ఒక సొంత శైలి ఉంటుంది. కొందరు ఉదయం పూట బాగా చదవగలరు, మరికొందరు రాత్రి వేళల్లో మెరుగైన శ్రద్ధతో ఉంటారు. మీకు ఏది సరిపోతుందో దానినే నమ్మండి. ఇతరుల సలహాలు తీసుకోండి, అవి మీకు ప్రయోజనకరంగా అనిపిస్తేనే మీ జీవితంలో అలవాటు చేసుకోండి. నేను కూడా కొన్ని విషయాలను మార్చుకున్నాను కానీ, నా ప్రాథమిక శైలిని మాత్రం ఎప్పుడూ వదల్లేదు," అని ప్రధాని మోదీ విద్యార్థులకు వివరించారు.
విద్యలో పునాదులను స్కూలింగ్ దశలోనే బలోపేతం చేసుకోవాలని, అప్పుడు పోటీ పరీక్షల్లో సక్సెస్ వెతుక్కుంటూ వస్తుందని మోదీ విద్యార్థులకు సూచించారు. అంతేకానీ ఫలితాలే అంతిమ లక్ష్యాలుగా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
గురువుల బాధ్యత - లక్ష్యాల సాధన..
ఉపాధ్యాయుల పాత్ర గురించి ప్రస్తావిస్తూ.. "విద్యార్థి వేగం కంటే ఉపాధ్యాయుడి వేగం ఒక అడుగు ముందు ఉండేలా ప్రయత్నం జరగాలి. మన లక్ష్యాలు ఎలా ఉండాలంటే.. అవి మనకు అందుబాటులో ఉండాలి కానీ, మరీ సులభంగా దొరికేవిగా ఉండకూడదు," అని దిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమంలో ప్రధాని పేర్కొన్నారు.
మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి..
ఈ ఏడాది 'పరీక్షా పే చర్చ'ను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శిశు-కేంద్రీకృత అభ్యాసంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమం ఇప్పుడు “ఎగ్జామ్ వారియర్స్” ఉద్యమంలో ఒక భాగంగా మారింది. ఇది యువతలో ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా, వారి సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
ఇక ఈ పరీక్షా పే చర్చ 2026లో “పరీక్షలను సంబరాలుగా మార్చడం”, “స్వాతంత్ర్య సమర యోధుల గురించి తెలుసుకోవడం”, “పర్యావరణ పరిరక్షణ”, “స్వచ్ఛ భారత్”ని థీమ్‌గా ఎంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడుతూ.. బోర్డు పరీక్షలు, ప్రవేశ పరీక్షలను ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో మార్గనిర్దేశం చేశారు.
గతంలో మేరీ కోమ్, అవని లేఖరా, దీపికా పదుకొణె వంటి ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై మానసిక ఆరోగ్యం, చదువులో మెళకువలపై తమ అనుభవాలను పంచుకున్నారు.
ఐదు ప్రాంతాల నుంచి ఏకకాలంలో..
ఈసారి కార్యక్రమాన్ని దిల్లీలోని ప్రధాని నివాసం (7, లోక్ కళ్యాణ్ మార్గ్) తో పాటు కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువహటి, దేవ్‌మోగ్రా అనే ఐదు ప్రాంతీయ కేంద్రాల నుంచి ఏకకాలంలో నిర్వహించడం విశేషం.
2025లో నమోదైన గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తూ.. ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమానికి 4.5 కోట్లకుపైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. దీని బట్టి.. ప్రధాని మంత్రి మోదీ స్వయంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎంత ఆదరణ ఉందో స్పష్టమవుతోంది.
విద్యార్థుల ప్రశ్నలు- మోదీ సమాధానాలు..
పరీక్షా పే చర్చ 2026 కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థులు ప్రధానిని స్వయంగా ప్రశ్నలు అడగవచ్చు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి.. “చదువు, గేమింగ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? గేమింగ్‌లో కెరీర్ ఎంచుకోవాలని నాకు బలంగా ఉంది. కానీ అది సరైన నిర్ణయమేనా? అని సందేహాలు కూడా ఉన్నాయి,” అని తన మనసులో మాటను బయటపెట్టాడు.
ఇందుకు మోదీ స్పందిస్తూ.. “హాబీలను ఆచరణలోకి తీసుకురావాలంటే స్వేచ్ఛగా క్రియేషన్లు చేయాలి, వాటిని పంచుకోవాలి. వాటి ద్వారా వచ్చే ఫీడ్‌బ్యాక్‌ని తీసుకోవాలి. వాటి ద్వారా వచ్చే కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే విజయం వరిస్తుంది,” అని అన్నారు.
“నైపుణ్యం ముఖ్యం అని అంటున్నారు. కానీ చాలా మంది మార్కులే ముఖ్యం అని అంటారు. ఏది కరెక్ట్?” అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు.. “ ప్రతిదానిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యం. మీ చదువు, నైపుణ్యం, హాబీలు అన్ని కలిసిగట్టుగా ఉంటే, బ్యాలెన్స్ ఉంటుంది,” అని జవాబిచ్చారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


