‘పరీక్షా పే చర్చ 2026’ దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే ఛాన్స్- ఇప్పటికే రిజిస్ట్రేషన్ల సునామీ..
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే 'పరీక్షా పే చర్చ' 9వ ఎడిషన్ రిజిస్ట్రేషన్లకు నేడే ఆఖరు తేదీ. ఇప్పటికే 4.3 కోట్ల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, గత ఏడాది రికార్డులను ఇది బద్దలు కొట్టింది.
విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపి, పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలో వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సిద్ధమవుతున్నారు. వార్షిక కార్యక్రమం 'పరీక్షా పే చర్చ' (పీపీసీ) 2026 తొమ్మిదవ ఎడిషన్‌లో పాల్గొనేందుకు నేడు (జనవరి 11) రిజిస్ట్రేషన్లకు చివరి అవకాశం. ప్రధానితో నేరుగా మాట్లాడే అరుదైన అవకాశాన్ని అందుకోవాలనుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షా పే చర్చ 2026- రిజిస్ట్రేషన్ల సునామీ..
విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చ’కు అసాధారణ స్పందన కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏకంగా 4,30,18,173 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 3.53 కోట్ల రిజిస్ట్రేషన్లతో నెలకొల్పిన 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్'ను ఈసారి అంకెలు ఎప్పుడో దాటేయడం గమనార్హం.
ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో సుమారు 4 కోట్ల మంది విద్యార్థులుండగా, 24 లక్షల మంది టీచర్లు, 5.7 లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు.
పరీక్షా పే చర్చ 2026- ఎవరు అర్హులు?
- 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు.
- విద్యార్థులతో పాటు టీచర్లు, తల్లిదండ్రులకు కూడా అవకాశం ఉంది.
- దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి 'పార్టిసిపేషన్ సర్టిఫికేట్' అందుతుంది.
- విద్యార్థులు సొంతంగా లేదా తమ టీచర్ లాగిన్ ద్వారా వివరాలు నమోదు చేయవచ్చు.
పరీక్షా పే చర్చ 2026- ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఇలా చేయండి..
స్టెప్ 1- ముందుగా 'innovateindia1.mygov.in' అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపిస్తున్న 'Pariksha Pe Charcha 2026' లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ వివరాలతో అక్కడ రిజిస్టర్ చేసుకోండి.
స్టెప్ 4- ఫారమ్ పూర్తి చేసి సబ్మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి.
ప్రధానిని ప్రశ్నించే అవకాశం మీకే..
పరీక్షల సన్నద్ధత, ఒత్తిడిని జయించడం, కెరీర్ ప్లానింగ్ వంటి అంశాలపై ప్రధాని మోదీని నేరుగా ప్రశ్నించే వెసులుబాటు ఈ కార్యక్రమంలో ఉంటుంది.
మోదీని ప్రశ్నలు అడిగేందుకు ప్రభుత్వం 'మై గవ్' పోర్టల్‌లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ) పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీ ద్వారా ఎంపికైన వారు కార్యక్రమానికి ముందు కొన్ని ప్రశ్నలు సబ్మీట్ చేయవచ్చు. ఈ ప్రశ్నల్లో కొన్ని పరీక్షా పే చర్చ కార్యక్రమం వేదికగా మోదీ సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది.
'పరీక్షా పే చర్చ' తొలి ఎడిషన్ 2018 ఫిబ్రవరిలో దిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది బోర్డు పరీక్షల ముందు విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు ప్రధాని మోదీ ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నెలాఖరులో ఈ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. దీనిపై తుది తేదీని త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


