...
...
Next Story

Plane crash : న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ట్రక్కును ఢీకొట్టిన విమానం! ముందు భాగం నుజ్జునుజ్జు..

LaGuardia Airport : న్యూయార్క్‌లోని లాగ్వార్డియా విమానాశ్రయంలో విమాన ప్రమాదం జరిగింది. రన్‌వే దాటుతున్న సమయంలో ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం, ఒక ఫైర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.

Published on: Mar 23, 2026, 10:37:51 IST
Advertisement

అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన న్యూయార్క్ లాగ్వార్డియా ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది! స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల 40 నిమిషాల ప్రాంతంలో రన్‌వేపై ఉన్న విమానం ఒక గ్రౌండ్ వెహికల్​ని ఢీకొట్టింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 'ఫ్లైట్ రాడార్ 24' ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ సమాచారాన్ని వెల్లడించింది.

అసలేం జరిగింది?

లాగ్వార్డియా విమానాశ్రయంలో ప్రమాదానికి గురైన విమానం.. (Tiktok/@davidrea)
లాగ్వార్డియా విమానాశ్రయంలో ప్రమాదానికి గురైన విమానం.. (Tiktok/@davidrea)

అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన సీఆర్‌జే ఫ్లైట్ AC8646, రన్‌వే 04/22ని దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ ఉన్న ట్రక్ 1 అనే ఫైర్ ఇంజిన్‌ను ఢీకొట్టింది.

“ట్రక్​ 1 స్టాప్​, స్టాప్​, స్టాప్, స్టాప్​, స్టాప్​, స్టాప్​​..” అని గ్రౌండ్​ సిబ్బంది ట్రక్​ వైపు అరిచింది. కానీ ఆ ట్రక్​ ఆగలేదు. ఫలితంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం ధాటికి విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.

సహాయక చర్యలు, క్షతగాత్రులు..

ప్రమాదం జరిగిన వెంటనే లాగ్వార్డియా ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానంలోని ప్రయాణికులను అత్యవసర ద్వారాల ద్వారా టార్మాక్‌పైకి సురక్షితంగా తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 100మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

క్షతగాత్రులకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కాగా ఎయిర్‌పోర్ట్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి.

విమానాశ్రయం మూసివేత..

రన్‌వేపైకి ఫైర్ ట్రక్కు ఎలా వచ్చింది? సిగ్నల్ వ్యవస్థలో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం కారణంగా వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు.

ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks