ఎల్పీజీ, ఎరువుల కొరత ఉందంటూ పుకార్లు.. ప్రతిపక్షాలపై మోదీ నిప్పులు
పశ్చిమాసియా యుద్ధ సమయంలో గ్యాస్, ఎరువుల కొరత ఉందంటూ విపక్షాలు అసత్య ప్రచారాలు చేశాయని పీఎం నరేంద్ర మోదీ మండిపడ్డారు. గుజరాత్‌లోని బనాస్‌కాంతలో రూ.14,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన, చివరి శ్వాస వరకు దేశ ప్రజలకే సేవ చేస్తానని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ), ఎరువుల కొరత ఏర్పడుతోందంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నన్ను బద్నాం చేయడమే లక్ష్యంగా విపక్షాలు ఈ వదంతులు సృష్టించాయని, దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సంబరపడటం వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. గుజరాత్‌లోని బనాస్‌కాంత జిల్లా భిల్డీలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఆఖరి శ్వాస వరకు ప్రజలకే సేవ
"ఇరాన్ యుద్ధం తర్వాత రైతులకు ఎరువులు అందవని, ప్రజలకు ఎల్పీజీ దొరకదని కొందరు కావాలనే పుకార్లు వ్యాప్తి చేశారు. మోదీ ప్రతిష్టను దిగజార్చడమే వారి ఏకైక అజెండా. నా జీవితపు చివరి క్షణం వరకు దేశ ప్రజల సేవలోనే నిమగ్నమై ఉంటా," అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రూ.14,000 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
ఈ పర్యటనలో భాగంగా బనాస్‌కాంతలో రూ.14,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పీఎం మోదీ ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలోనే 'భారత్ గోజాతి ప్రజనన, పరిశోధనా కేంద్రాన్ని' ఆయన జాతికి అంకితం చేశారు.
పిఎం-కిసాన్ 24వ విడత నిధుల విడుదల
దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 'పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి' 24వ విడత కింద రూ.18,000 కోట్లకు పైగా సొమ్మును పీఎం మోదీ నేరుగా జమ చేశారు. "మన రైతులు, అన్నదాతలు ఈ దేశానికి బలమైన పునాదులు. రైతు సాధికారతకే మా ప్రభుత్వం ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తోంది," అని ఆయన చెప్పారు. 2013-14తో పోలిస్తే దేశంలో వ్యవసాయ బడ్జెట్ ఐదు రెట్లకు పైగా పెరిగిందని, పిఎం-కిసాన్ పథకం కోట్లాది మంది చిన్నకారు రైతుల జీవితాల్లో కీలక భాగమైందని పేర్కొన్నారు.
తాజా విడతతో గుజరాత్‌లోని 50 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.1,000 కోట్లకు పైగా జమకాగా, ఒక్క బనాస్‌కాంత జిల్లాలోనే దాదాపు రూ.50 కోట్లు లబ్ధిదారులకు అందాయి.
బనాస్‌కాంతలో కీలక అభివృద్ధి పనులు
కాంక్రేజ్ ఆవుల జాతి సంరక్షణ, జన్యు అభివృద్ధి లక్ష్యంగా భిల్డీలో 127 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారత్ గోజాతి ప్రజనన, పరిశోధనా కేంద్రాన్ని పీఎం ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ఆవుల నాణ్యత పెంపు ప్రక్రియ 10 నుంచి 20 రెట్లు వేగవంతం కానుంది.
అంతేకాకుండా బనాస్ డెయిరీకి చెందిన రెండు బయో-సిఎన్‌జి ప్లాంట్లను (థరాడ్‌లో రోజుకు 75 మెట్రిక్ టన్నుల పేడ సామర్థ్యం, రాధన్‌పూర్‌లో రోజుకు 100 మెట్రిక్ టన్నుల పేడ సామర్థ్యం) అందుబాటులోకి తెచ్చారు. సనాదర్‌లో బంగాళాదుంప ప్రాసెసింగ్ యూనిట్ విస్తరణ పనులు, పాలన్‌పూర్‌లో ఆటోమేటెడ్ స్టోరేజ్ అండ్ రీట్రీవల్ సిస్టమ్‌లను పీఎం మోదీ ప్రారంభించారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


