PM Modi : భీకర దాడులను సైతం తట్టుకోగలిగే శక్తి.. మోదీ 'కాన్వాయ్' సొంతం! అత్యాధునిక టెక్నాలజీతో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన సందడి దేశవ్యాప్తంగా నెలకొన్న వేళ, ఆయన పర్యటనల్లో నీడలా నిలిచే అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ కాన్వాయ్‌లోని లగ్జరీ బుల్లెట్‌ప్రూఫ్ కార్లు, వాటి అభేద్యమైన భద్రతా విశేషాలపై ప్రత్యేక కథనం మీకోసం..

Published on: Sep 17, 2026, 12:21:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. స్వతంత్ర భారత చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా ప్రధానిగా సేవలందిస్తున్న అరుదైన రికార్డు మోదీ సొంతం. మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఓవైపు బీజేపీ 'సేవా సంకల్ప్ అభియాన్' పేరుతో నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా, మరోవైపు ప్రధాని రక్షణ వ్యవస్థ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధాని మోదీ భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్​జీబీ) కంటికి రెప్పలా పర్యవేక్షిస్తుంది. మోదీ కాన్వాయ్‌లోని అత్యాధునిక, అత్యంత సురక్షితమైన వాహనాలు క్లిష్టమైన దాడులను కూడా ఎదిరించేలా రూపుదిద్దుకున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కాన్వాయ్​లోని కొన్ని అత్యాధునిక వాహనాల వివరాలను ఇక్కడ చూసేయండి..

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్​650 గార్డ్: కదులుతున్న ఉక్కు కోట..

ప్రధాని మోదీ కాన్వాయ్‌లో అత్యంత విలువైన, అభేద్యమైన వాహనం మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్650 గార్డ్. దీని అంచనా విలువ సుమారు రూ. 12 కోట్లకు పైగానే ఉంటుంది.

ఈ కారు అత్యున్నత 'వీఆర్​10' లెవల్ బాలిస్టిక్ ప్రొటెక్షన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఏకే-47 తపాకీ గుళ్లు, శక్తివంతమైన బాంబు పేలుళ్లు, గ్రెనేడ్ దాడులను కూడా ఇది సునాయాసంగా తట్టుకోగలదు. టైర్లు పగిలినా లేదా పంచర్ అయినా వేగంగా ప్రయాణించేలా ఇందులో రన్-ఫ్లాట్ టెక్నాలజీని అమర్చారు. విషవాయువుల దాడి జరిగితే వెనువెంటనే కారు క్యాబిన్‌ను బయటి గాలితో సంబంధం లేకుండా సీల్ చేసి, లోపల ఉన్న ప్రధానికి స్వతంత్రంగా ఆక్సిజన్ అందించే అత్యవసర వ్యవస్థ ఇందులో ఉంది.

ఈ లగ్జరీ కారులోని 6.0 లీటర్ ట్విన్-టర్బో వీ12 ఇంజిన్ 500 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. భద్రతా కారణాల రీత్యా ఈ కారు గరిష్ట వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

రేంజ్ రోవర్ సెంటినెల్: బాంబు దాడులను తట్టుకునే శక్తి!

మోదీ కాన్వాయ్‌లోని మరో శక్తివంతమైన ఎస్‌యూవీ రేంజ్ రోవర్ సెంటినెల్. ఇది 'వీఆర్8' లెవల్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 7.62 ఎంఎం ఆర్మోర్ పియర్సింగ్ రైఫిల్ తులలను కూడా ఇది అడ్డుకుంటుంది. 15 కిలోగ్రాముల టీఎన్‌టీ బాంబు పేలుడును, కారు పైన లేదా కింద భాగంలో జరిగే గ్రెనేడ్ దాడులను ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది.

ఇందులో ఫైర్ నిరోధక వ్యవస్థ, ఆక్సిజన్ సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉన్నాయి. దాదాపు 4.4 టన్నుల బరువున్న ఈ ఎస్‌యూవీలోని 5.0 లీటర్ సూపర్ ఛార్జ్డ్ వీ8 ఇంజిన్ (380 హెచ్‌పీ) కేవలం 10.4 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 193 కిలోమీటర్లు.

ఆర్మర్డ్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ అండ్ బీఎండబ్ల్యూ 760ఎల్​ఐ

ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వెళ్లే సమయంలో ప్రధాని మోదీ తరచూ 'ఆర్మర్డ్ టయోటా ల్యాండ్ క్రూయిజర్' కారులోనే కనిపిస్తారు. 4.5 లీటర్ వీ8 డీజిల్ ఇంజిన్ (260 బిహెచ్‌పీ, 650 ఎన్ఎమ్) కలిగిన ఈ 4x4 ఎస్‌యూవీకి బాలిస్టిక్ ఆర్మర్, రసాయన దాడుల నుంచి కాపాడే సీల్డ్ క్యాబిన్ రక్షణ గోడగా నిలుస్తాయి.

అలాగే కాన్వాయ్‌లోని బీఎండబ్ల్యూ 760ఎల్​ఐ హై సెక్యూరిటీ సెడాన్ కారులో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, సెల్ఫ్ సీలింగ్ ఫ్యూయల్ ట్యాంక్, విషవాయు నిరోధక ఆక్సిజన్ సిస్టమ్ ఉన్నాయి. ఇందులో ఉండే 6.0 లీటర్ వీ12 ఇంజిన్ (544 హెచ్‌పీ) కేవలం 6.2 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

ఎస్పీజీ కమాండోల కవచం: టయోటా ఫార్చ్యూనర్

ప్రధాని కాన్వాయ్‌కు వెనుక రక్షణగా, వ్యూహాత్మక కాపలాగా ఎస్పీజీ కమాండోలు బుల్లెట్‌ప్రూఫ్ 'టయోటా ఫార్చ్యూనర్' వాహనాలను వినియోగిస్తారు. విదేశీ పర్యటనలు, ఇతర దేశాల అధినేతలు (ఉదాహరణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్) భారత్‌కు వచ్చిన సందర్భాల్లో మోదీకి ఎస్కోర్ట్ వాహనంగా, అత్యవసర రక్షణ రథంగా ఈ ఎస్‌యూవీ పనిచేస్తుంది. దేశాధినేత భద్రత కోసం సాంకేతికతను, సైనిక స్థాయి రక్షణ కవచాలను జోడించి ఈ కాన్వాయ్‌ను సిద్ధం చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More