ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ఐపీఓ ప్రారంభం.. 35% లాభం సాధ్యమేనా? సబ్‌స్క్రైబ్ చేయొచ్చా?

ముంబైకి చెందిన ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ఐపీఓ సెప్టెంబరు 7న ప్రారంభమై సెప్టెంబరు 9 వరకు అందుబాటులో ఉంటుంది. గ్రే మార్కెట్లో మంచి ప్రీమియం పలుకుతున్న ఈ పబ్లిక్ ఇష్యూ ధర శ్రేణిని రూ. 118-124గా నిర్ణయించారు. సంస్థ ఆర్థిక బలం, బ్రోకరేజ్ విశ్లేషణల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Updated on: Sep 7, 2026, 10:24:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రియల్ ఎస్టేట్ రంగంలో గుర్తింపు పొందిన ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) నేటి నుంచి (సెప్టెంబరు 7) ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబరు 9న ఈ ఇష్యూ ముగియనుంది. కంపెనీ తన షేరు ముఖ విలువ రూ. 10 కాగా, ఐపీఓ ధరల శ్రేణిని (Price Band) రూ. 118 నుంచి రూ. 124గా ఖరారు చేసింది. నేడు ఉదయం 10:00 గంటలకు బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ఐపీఓ ప్రారంభం.. 35% లాభం సాధ్యమేనా? సబ్‌స్క్రైబ్ చేయొచ్చా?
ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ఐపీఓ ప్రారంభం.. 35% లాభం సాధ్యమేనా? సబ్‌స్క్రైబ్ చేయొచ్చా?

ధరల వివరాలు, గ్రే మార్కెట్ ట్రెండ్

ఈ ఐపీఓలో పాల్గొనే ఇన్వెస్టర్లు కనీసం 120 షేర్లను (ఒక లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 120 గుణింతాల్లో బిడ్లు దాఖలు చేయవచ్చు. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరుకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ. 44 వద్ద కొనసాగుతోంది. జీఎంపీని పరిగణనలోకి తీసుకుంటే, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈ షేరు రూ. 168 వద్ద లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంటే మొదటి రోజే ఇన్వెస్టర్లకు దాదాపు 35.48 శాతం వరకు లాభం దక్కే అవకాశం ఉంది. గత వారంలో జీఎంపీ రూ. 23 నుంచి రూ. 44 మధ్య ఊగిసలాడింది.

కేటాయింపులు, కీలక తేదీలు

అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు (క్యూఐబీ) 40 శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్‌ఐఐ) 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 45 శాతం వాటాలను కేటాయించారు.

  • ఐపీఓ ప్రారంభం: సెప్టెంబరు 7 (సోమవారం)
  • ఐపీఓ ముగింపు: సెప్టెంబరు 9 (బుధవారం)
  • షేర్ల కేటాయింపు (Allotment): సెప్టెంబరు 10 (గురువారం)
  • రిఫండ్లు, డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల జమ: సెప్టెంబరు 11 (శుక్రవారం)
  • ఎక్స్ఛేంజ్ లిస్టింగ్: సెప్టెంబరు 15 (మంగళవారం)

బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణ - సబ్‌స్క్రైబ్ చేయొచ్చా?

ముంబై పశ్చిమ శివారు ప్రాంతాల్లో పునర్నిర్మాణ (Redevelopment) ప్రాజెక్టులపై ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రధానంగా దృష్టిసారించింది. సంస్థ ప్రదర్శనపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి.

స్వాస్తిక ఇన్వెస్ట్‌మార్ట్: కంపెనీకి తక్కువ వ్యయంతో పనిచేసే 'అసెట్ లైట్' మోడల్ ఉండటం వల్ల నిర్వహణ వ్యయాలు అదుపులో ఉన్నాయి. 2023-24 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య కంపెనీ రాబడి 30 శాతం, నికర లాభం (PAT) 34 శాతం చక్రవడ్డీ చొప్పున (CAGR) వృద్ధి చెందాయి. ఎబిటా (EBITDA) మార్జిన్ 17.2 శాతానికి మెరుగుపడింది. పీఈ నిష్పత్తి 18.8-19.6 రెట్లుగా ఉండటంతో వ్యాల్యుయేషన్ ఆకర్షణీయంగా ఉంది. అయితే కేవలం ఒకే భౌగోళిక ప్రాంతంపై ఆధారపడటం ఒక ముప్పుగా పేర్కొంటూ, దీర్ఘకాలిక లాభాల కోసం సబ్‌స్క్రైబ్ చేయవచ్చని సూచించింది.

కాంతిలాల్ ఛగన్‌లాల్ సెక్యూరిటీస్: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 65 ప్రాజెక్టులు కంపెనీ చేతిలో ఉన్నాయి. ఇందులో 28 పూర్తి కాగా, 20 నిర్మాణంలో ఉన్నాయి, 17 రాబోయే ప్రాజెక్టులు. స్థలం కొరత ఉన్న ముంబైలో రీడెవలప్‌మెంట్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మధ్యస్థం నుంచి దీర్ఘకాలిక వ్యవధితో ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చని సిఫార్సు చేసింది.

నిధుల సేకరణ - వినియోగం

ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 351 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 315.6 కోట్ల విలువైన కొత్త షేర్లను (Fresh Issue) జారీ చేస్తుండగా, రూ. 35.43 కోట్ల విలువైన 28.57 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా బయోఊర్జా ఇండియా ఇన్ఫ్రా విక్రయిస్తోంది.

ఈ నిధులను ప్రభుత్వ అనుమతుల సేకరణ, అదనపు ఎఫ్‌ఎస్‌ఐ (FSI) కొనుగోలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సభ్యులకు పరిహారం చెల్లింపు, అప్పుల తీర్చేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపింది. కాగా, సెప్టెంబరు 4న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ. 84.24 కోట్లను సేకరించింది. ఇందులో గోల్డ్‌మన్ శాక్స్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్, ప్యానెల్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఈ ఐపీఓకి సెంట్రమ్ క్యాపిటల్ లీడ్ మేనేజర్‌గా, కెఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి.

(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం అందించిన విశ్లేషణ మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More