ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి నెట్టేసిన యువతి అరెస్ట్
పూణేకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాకింగ్‌కు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడనుకున్న కేతన్‌ను, అతని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
పూణేలో ఐదు రోజుల క్రితం జరిగిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (25) మరణం ప్రమాదం కాదు, పక్కా కుట్రతో జరిగిన పకడ్బందీ హత్య అని పోలీసులు తేల్చారు. లోహ్‌గఢ్ కోట వద్ద 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి కేతన్‌ను హతమార్చినట్లు దర్యాప్తులో స్పష్టమైంది. ఈ దారుణానికి ఒడిగట్టిన కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)లను పూణే రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది?
మహారాష్ట్రలోనే అతిపెద్ద వేర్‌హౌస్ డెవలపర్ సంస్థల్లో ఒకటైన 'సక్సెస్ గ్రూప్' డైరెక్టర్‌గా కేతన్ అగర్వాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల ఎఫ్‌డబ్ల్యూ ఓలిన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (బాబ్సన్ కాలేజీ) నుంచి మాస్టర్స్ పూర్తి చేసి 2023లో భారత్ తిరిగొచ్చిన ఆయన, కుటుంబ వ్యాపారంలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మేనమామ కుదిర్చిన సంబంధంతో పూణేకే చెందిన సంపన్న వ్యాపారవేత్త కుమార్తె సియా గోయల్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేతన్‌కు నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం ఈ ఏడాది నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో జరగాల్సి ఉంది. ఇందుకోసం హోటళ్లు కూడా బుక్ చేశారు. అయితే, సియాకు అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందనే విషయం అగర్వాల్ కుటుంబానికి తెలియదు. చేతన్ కుటుంబానికి కూడా సియా తండ్రి వ్యాపారం చేసే ప్రాంతంలోనే బిజినెస్ ఉంది.
పుట్టినరోజు కానుక పేరిట మృత్యుపాశం
సియా గోయల్ జూన్ 19న తన 20వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. దీనికి ఒక రోజు ముందు, అంటే జూన్ 18న, తన బర్త్‌డే గిఫ్ట్‌గా లోహ్‌గఢ్ కోటకు ట్రాకింగ్‌కు తీసుకెళ్లాలని కేతన్‌ను ఆమె పట్టుబట్టింది. ప్లాన్ ప్రకారం పూణే-ముంబై హైవేపై కివాలే బ్రిడ్జ్ వద్ద కేతన్ కోసం వేచి చూసింది. అక్కడి నుంచి ఇద్దరూ కోటకు వెళ్లారు. అయితే, ఉదయం 10:45 గంటల సమయంలో సియా తల్లి కేతన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఫోటోలు తీస్తూ కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని చెప్పారు.
"ప్రారంభంలో మేము దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే భావించి కేసు నమోదు చేశాం. కానీ, దర్యాప్తు సాగుతున్న కొద్దీ వెలుగుచూసిన కొన్ని ఆధారాలు, కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లు మమ్మల్ని మరో కోణంలో దర్యాప్తు చేసేలా ప్రేరేపించాయి" అని పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు.
ఫోన్ కాల్ డేటాతో గుట్టురట్టు
కేతన్ అగర్వాల్ రెగ్యులర్‌గా లోహ్‌గఢ్‌లో ట్రాకింగ్ చేసేవాడని, అతనికి అక్కడి భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని పోలీసులు గుర్తించారు. అలాగే సియా ప్రవర్తనపై కేతన్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమె ఫోన్‌ను, ఇతర ఫోరెన్సిక్ వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే సియాకు చేతన్ చౌదరితో ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, కేతన్‌తో పెళ్లి ఇష్టం లేక ఆమె రకరకాలుగా ప్రయత్నించిందని తేలింది.
"కాల్ రికార్డ్ డేటా (CDR) ఆధారంగా కేతన్, సియాలు లోహ్‌గఢ్ కోటపై ఉన్న సమయంలోనే ప్రియుడు చేతన్ చౌదరి కూడా అక్కడే ఉన్నట్లు నిర్ధారణ అయింది" అని ఎస్పీ గిల్ వెల్లడించారు.
పోలీసుల విచారణలో నిందితులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. ఈ ఘాతుకం గతేడాది మేఘాలయ అడవుల్లో ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని భార్య దారుణంగా హత్య చేసిన 'హనీమూన్ కిల్లింగ్' ఘటనను గుర్తుకు తెస్తోందని పోలీసులు పేర్కొన్నారు.
గతంలోనూ హత్యాయత్నాలు
పెళ్లిని తప్పించుకోవడానికి సియా గతంలోనూ ప్లాన్ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం బాలి వెళ్లాల్సి ఉంది. కానీ ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక కేతన్ పాస్‌పోర్ట్ కనిపించకపోవడంతో ఆ పర్యటన రద్దయింది. కేతన్ మరణం తర్వాత జరిగిన దర్యాప్తులో సియానే ఆ పాస్‌పోర్టును దాచిపెట్టినట్లు తేలింది. అంతేకాదు, ఈ ఘటనకు నాలుగు రోజుల ముందు కూడా వీరిద్దరూ లోహ్‌గఢ్‌కు ట్రాకింగ్‌కు వెళ్లారు. అక్కడ పాము కనిపించిందని, కేతన్‌ను కాపాడే ప్రయత్నంలో నెట్టేశానని అప్పట్లో సియా నమ్మబలికింది.
కొడుకు హెచ్చరించినా వినలేదు: తండ్రి ఆవేదన
సియా ప్రవర్తనపై కేతన్ ముందే అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, కుటుంబ సభ్యులు తేలిగ్గా తీసుకున్నారు. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ (46) ఈ విషయమై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
"నిశ్చితార్థం తర్వాత కేతన్, సియాలు తరచూ కలుసుకునేవారు. సియా ప్రవర్తన సరిగ్గా లేదని, ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ను సరిగ్గా వెరిఫై చేశామా లేదా అని కేతన్ నన్ను అడిగాడు. కానీ మా బంధువుల ద్వారా వచ్చిన సంబంధం కావడంతో అంతా మంచే జరుగుతుందని నేను వాడికి నచ్చజెప్పాను" అని విశాల్ అగర్వాల్ తెలిపారు.
చిన్న చిన్న విషయాలకే సియా గొడవపడేదని, ఎప్పుడూ ఫోన్ లోనే మునిగిపోయేదని తండ్రి పేర్కొన్నారు. చేతన్ చౌదరి పేరును కూడా కేతన్ తమ వద్ద ప్రస్తావించి అనుమానం వ్యక్తం చేశాడని, సియా వయసు చిన్నది కాబట్టి పెళ్లిని వాయిదా వేద్దామని తాము భావించినా.. ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి పెళ్లికి ఒప్పించారని ఆయన కన్నీరుమున్నీరయ్యారు.
ప్రస్తుతం నిందితులు ఇద్దరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (హత్య), 61(2) (క్రిమినల్ కుట్ర) కింద కేసులు నమోదు చేసి, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


