ఢిల్లీలో 'ఇండియా' కూటమి రణరంగం: బ్యారికేడ్ ఎక్కి రాహుల్ నిరసన.. నేతల అరెస్ట్

ఓటర్ల జాబితా సవరణల్లో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు నిరసనగా తరలిన 'ఇండియా' కూటమి ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. నిరసన సందర్భంగా చేతిలో జాతీయ జెండాతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బ్యారికేడ్లపైకి ఎక్కి నినాదాలు చేశారు.

Updated on: Oct 6, 2026, 12:45:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుకు నిరసనగా 'ఇండియా' కూటమి నాయకులు మంగళవారం చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు నీతి ఆయోగ్ కార్యాలయం నుంచి నిర్వాచన్ సదన్ వైపు మార్చ్ నిర్వహించారు.

త్రివర్ణ పతాకంతో రాహుల్ గాంధీ (AP Photo/Manish Swarup)
త్రివర్ణ పతాకంతో రాహుల్ గాంధీ (AP Photo/Manish Swarup)

పోలీసులు ఇనుప బ్యారికేడ్లతో దారి మళ్లించేందుకు యత్నించగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా-ఉర్-రెహ్మాన్ బార్క్ తదితరులు బ్యారికేడ్లపైకి ఎక్కారు. రాహుల్ గాంధీ ఒక చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తాత్కాలిక నిర్బంధం

పోలీసులు ముందస్తు చర్యగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలేతో పాటు పలువురు విపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించి, కొంతసేపటి తర్వాత విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "జ్ఞానేష్.. సమయం ముగిసింది భాయ్, ఇక రాజీనామా చేయండి" అని సీఈసీని ఉద్దేశించి పోస్ట్ చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు: మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "స్వాతంత్య్రం తర్వాత పౌరులకు లభించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కును మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుండా పూర్తిగా ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటోంది" అని ఖర్గే ఆరోపించారు.

ఓటర్ల తొలగింపుపై అఖిలేష్ యాదవ్ ఘాటు విమర్శలు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈసీఐ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓటర్ల జాబితాలో నకిలీ సంతకాలతో ఓట్లను తొలగించారని ఆరోపించారు. "బీజేపీ తీవ్ర భయంలో ఉంది, అందుకే నగరమంతటా బ్యారికేడ్లు ఏర్పాటు చేసింది. ఈసీకి నిజాయితీ ఉంటే సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి. ఐదు కంటే ఎక్కువ ఓట్లు ఒకేసారి తొలగించకూడదనే నిబంధన ఉన్నా, 100కు పైగా బోగస్ ఫారమ్-7 దరఖాస్తులను దాఖలు చేశారు" అని నిలదీశారు.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన పి.చిదంబరం

మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ఫారమ్-6 సవరణలపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. "ఫారమ్-6లో మార్పులకు మేము ఎలాంటి ఆమోదం తెలపలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బహిరంగ కోర్టులోనే స్పష్టంగా చెప్పారు..’ అని వ్యాఖ్యానించారు.

ఓటర్ల జాబితాలో పారదర్శకత పునరుద్ధరించే వరకు విపక్షాల 'సేవ్ డెమోక్రసీ' (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) ఉద్యమం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More